Idli Kottu Movie Review : తమిళ హీరో ధనుష్.. డైరెక్టర్‌గా టర్న్ తీసుకున్నాడు. గతేడాది ఆయన దర్శకత్వం చేసిన ‘రాయన్’ మూవీ కమర్షియల్‌గా సక్సెస్ అయింది. ఇక ఈ ఏడాది డైరెక్ట్ చేసిన ‘జాబిలమ్మా నీకు అంత కోపమా’ మూవీ కొన్ని విధాలుగా బాగున్నా.. ఆడియన్స్‌కి మాత్రం పెద్దగా నచ్చలేదు. ఇప్పుడు ఈ ఏడాదే రెండో సినిమా డైరెక్ట్ చేశాడు. అదే ‘ఇడ్లీ కడై’ తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ అనే పేరుతో రిలీజ్ చేశారు. మరి ఈ సినిమాతో ధనుష్ డైరెక్టర్‌గా మంచి మార్కులు కొట్టేశాడా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం.
మురళి (ధనుష్) శంకరాపట్నం అనే చిన్న గ్రామంలో ఇడ్లీలు అమ్ముకునే శివకేశవుడు (రాజ్ కిరణ్) కొడుకు. శివకేశవుడు ఊరిలో తన ఇడ్లీ కొట్టులో ఇడ్లీలు అమ్ముతూ గౌరవంగా బతుకుతాడు. కానీ, మురళి జీవితంలో ఎదగాలని, తనకు కారు, బిల్డింగ్ ఉండాలని అనుకుంటాడు. అలా… ఊరి నుంచి వెళ్లిపోయి.. బ్యాంకాక్‌లో సెటిల్ అవుతాడు. అక్కడే మురళి పని చేసే రెస్టారెంట్ ఓనర్ విష్ణు వర్ధన్ (సత్యరాజ్) కూతురు మీనా (శాలినీ పాండే)తో ప్రేమలో పడుతాడు. పెళ్లి టైంలో మురళి ఇంట్లో విషాదం చోటుచేసుకుంటుంది.
దీంతో మురళి తన తండ్రి ఇడ్లీ కొట్టునే చూసుకోవాలని ఫిక్స్ అవుతాడు. అది విష్ణు వర్ధన్ కొడుకు అశ్విన్ (అర్జున్ విజయ్)కు నచ్చదు. ఈగోతో రగిలిపోయే అశ్విన్… మురళిని ఏం చేశాడు. మీరా ఫ్యామిలీ మొత్తం ఇండియా వచ్చి చేసిందేమిటి? మురళి తన తండ్రి ఇడ్లీ కొట్టును ఎలా చూసుకున్నాడు? ఈ ప్రాసెస్‌లో మురళికి కళ్యాణి (నిత్య మీనన్) చేసిన హెల్ప్ ఏంటి ? లాస్ట్‌కి అశ్విన్ ఈగో తగ్గిందా ? అనేది సినిమాలో చూడాల్సిన పాయింట్స్.
ధనుష్ నటనలోనే కాదు… డైరెక్షన్‌లో కూడా ఇప్పటికే సక్సెస్ సాధించాడు అని అనుకోవచ్చు. రాయన్ మూవీ మిక్సిడ్ టాక్ తెచ్చుకున్నా… కమర్షియల్‌గా సక్సెస్ అయింది. కానీ, తర్వాత మూవీ ‘జాబిలమ్మా నీకు అంత కోపమా’ తేడా కొట్టినా… ధనుష్ ఎంపిక చేసుకునే స్టోరీలంటే ఓ వర్గం ఆడియన్స్‌కు స్పెషల్ ఇంట్రెస్ట్.
ఇప్పుడు ఇడ్లీ కొట్టు సినిమాకు అదే పరిస్థితి. కరూర్ తొక్కిసలాట ఘటన వల్ల ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. అయినా… ఈ సినిమా చూడటానికి థియేటర్స్‌లోకి జనాలు వచ్చారంటే.. కారణం, ధనుష్ స్టోరీ సెలెక్షన్ అనే చెప్పొచ్చు.
అందరూ అనుకున్నట్టే, ఇడ్లీ కొట్టు సినిమా స్టోరీ గుడ్ సెలెక్షన్. ఫాదర్ సెంటిమెంట్, గ్రామీణ అనుభందాలు అన్నీ కూడా సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. అయితే, ధనుష్ ఎప్పటిలానే కొన్ని మిస్టేక్స్ ఈ ఇడ్లీ కొట్టు సినిమాలో కూడా చేశాడు. స్టోరీ బానే చెప్పినట్టు అనిపిస్తున్నా… లెన్తీ, ల్యాగ్ ఉందేంటి అనే ఫీల్ వస్తుంది.
ఇప్పుడు ఇడ్లీ కొట్టు మూవీ నిడివి 147 నిమిషాలే. అయినా.. అలాంటి ఫీలింగ్ వచ్చిందంటే… కథనం పరుగులు పెట్టించలేదు. అయితే, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ఎమోషన్ అయితే క్యారీ చేశాడు. దాని వల్ల సినిమా లాస్ట్ వరకు ఉంటాం. కొన్ని సందర్భంలో అయితే, హీరో పాత్ర సాటిస్ఫై అయినట్టు మనం కూడా లో లోపల సాటిస్పై అవుతాం. అలా సినిమాలో కొన్ని సీన్స్‌కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేయడంలో డైరెక్టర్‌గా ధనుష్ సక్సెస్ అయినట్టే.
కానీ, ఎంతైనా… 147 నిమిషాలు ఉన్న చిన్న సినిమాలు ఈ ల్యాగ్ సన్నివేశాలు లేకుండా చూసుకుంటే బాగుండేది. దీని వల్ల ఇడ్లీ టేస్ట్ బానే ఉన్నా.. చట్నీ లేదు అనే ఫీలు వస్తుంది. నిజానికి సినిమాలో కూడా ఇడ్లీ మేకింగ్ మాత్రమే చూపిస్తారు. కానీ, ఎక్కడా చట్నీ తయారుచేయడం కానీ, దాని రుచి గురించి గానీ అసలు ప్రస్తావన ఉండదు.
అయితే, తమిళ వాళ్లు ఇడ్లీలో చట్నీ కంటే సాంబర్ ఎక్కువగా తింటారు. అందుకే కాబోలు… తెలుగు ఆడియన్స్ అయిన మనకు సాంబర్ కంటే చట్నీపై ఫోకస్ మళ్లింది. ఇక్కడ చట్నీ అంటే తెలుగు ఫ్లేవర్.
నిత్య మీనన్ – ధనుష్ అంటే తిరు మూవీ గుర్తొస్తుంది. దానికంటే ముందుగా ఆ సినిమాలోని సాంగ్. అలాంటి సాంగ్ ఒకటి ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేసిన వాళ్లకు నిరాశే.
ధనుష్ నటనకు ఎప్పుడూ మైనస్‌లు ఉండవు. ఈ సినిమాలో కూడా అంతే… వంక పెట్టలేం. ఇటు డైరెక్షన్.. అటు నటన సరిగ్గా మ్యానేజ్ చేశాడు. నిత్య మీనన్ ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. విలన్‌గా అర్జున్ విజయ్ పీక్స్. ఈగోఇజం చూపించడంలో ఫర్ఫామెన్స్ బాగుంది. శాలిని పాండే పాత్ర బానే ఉన్నా.. గుర్తిండిపోయేలా అయితే లేదు. సత్య రాజ్ సెటిల్డ్‌గా చేశాడు.
ధనుష్ నటన, డైరెక్షన్
లాస్ట్ వరకు ఎమోషన్స్ క్యారీ చేయడం
మ్యూజిక్
నిత్య మీనన్
సెకండాఫ్
కొన్ని ల్యాగ్ సీన్స్
స్లో నేరేషన్
ఎక్స్‌పెక్టెడ్ స్టోరీ
మొత్తంగా… ఇడ్లీకి సాంబర్ ఒక్కటే కాదు.. చట్నీ కూడా ఉండాల్సింది.