ADMS Electric Bikes Scam: ADMS.. AONE.. వేరువేరుగా కనిపిస్తున్నాయి కదా.. కానీ ఒకటే అంటోంది ఆ వెబ్‌సైట్. ఇంతకీ ఏంటీ ఈ వెబ్‌సైట్ల కథ.. ప్రస్తుతం జనాల చెవిలో పువ్వు పెట్టడంలో బిజీగా ఉన్న ఈ కంపెనీ అసలు భాగోతం ఏంటి? ఆ కంపెనీ చట్టబద్ధత గురించి ఆ కంపెనీ పెద్ద మనుషులే చెప్పిన విషయాలేంటి? ADMS కథలు.. ఆ కథల వెనక అసలు భాగోతాలేంటో మీరే చూడండి.
ADMS కంపెనీ గురించి తవ్వుతున్న కొద్ది అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మల్టీ మార్కెటింగ్ పేరుతో ప్రజలను చేర్చుకుంటూ.. తమ వ్యాపారాన్ని విస్తరిస్తోంది ADMS. అయితే ఇప్పుడీ కంపెనీ సంబంధించిన మరో మోసం వెలుగులోకి వచ్చింది. అదేంటో చూడండి.
ఇక్కడ ఒకేలా కనిపిస్తున్న రెండు వెబసైట్లు ఉంటాయి. ఇందులో పేరు తప్ప మిగిలినవన్ని సేమ్. కాంటాక్ట్‌లోకి వెళితే అక్కడ కనిపించే అడ్రస్, పేర్లు అన్నీ ఒకటే. మరి నిజాయితీగా వ్యాపారం చేస్తున్న కంపెనీ అయితే ఇలా ఒకే బైక్‌ను రెండింటి పేరుపై ఎందుకు విక్రయిస్తున్నారు? అంటే ఒక కంపెనీపై ఏవైనా కేసులు నమోదై చిక్కుల్లో పడ్డా.. మరో కంపెనీ పేరుతో వ్యాపారం చేద్దామనా? లేక దీని వెనక మరేదైనా కుట్ర ఉందా?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అయితే ADMS పేరుతోనే వ్యాపారం జరుగుతోంది. ఇక మరో విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. లైసెన్స్‌లు తీసుకొని వాటితో ఇ-బైక్స్ వ్యాపారం చేస్తున్నామని చెప్పి చివరికి మల్టీ లెవల్ మార్కెటింగ్ చేస్తోంది ADMS. అసలు తమ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేవని ఆ కంపెని మేనేజింగ్ డైరెక్టర్ దిలావరే చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా సంపాదించింది బిగ్ టీవీ.
తాము చేసే వ్యాపారానికి అనుమతులు లేవని.. 2001 నుంచి అనుమతుల కోసం పోరాడుతున్నామని.. బిల్లు ఇంకా పాస్ కాలేదని చెబుతున్నారు. అసలు తమ వ్యాపారానికి అనుమతులు అవసరం లేదంటున్నారు. మళ్లీ కావాల్సిన సర్టిఫికెట్లు ఉన్నాయని.. నమ్మబలుకుతున్నారు. ఇలా జనాలకు కమీషన్ ఆశ చూపించి వారి వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పటికే 500 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని వాళ్లే చెబుతున్నారు. అంతేకాదు 40 వేల కోట్ల టర్నోవర్ చేయాలంటున్నారు. ఈ దందాను బిగ్ టీవీ బయటపెట్టడంతో బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తాను కోటి రూపాయలు కట్టించానని.. వన్ పర్సెంట్ కమీషన్ అడిగితే కొట్టబోయారంటూ బిగ్‌టీవీ ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు.
Also Read: ఈ ఒక్క ఆడియోతో e-బైక్ బయటపడ్డ బాగోతం
పైన పటారం.. లోన లొటారం అనే మాట ADMS e-బైక్‌ల పేరుతో జరుగుతున్న వ్యాపారానికి సరిగ్గా సరిపోతుంది. బిగ్‌టీవీ కథనాలతో ADMS నిర్వాహకులు సైతం అలర్ట్ అయ్యారు. బాధితులకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. మీకు న్యాయం చేస్తాం.. రోడ్డెక్కవద్దు అంటూ వేడుకుంటున్నారు. కేసులు వేయొద్దంటూ కాళ్లా వేళ్లా పడుతున్నారు.
లైసెన్స్ లేదు.. నమ్మేలా అసలు లేదు.. తాము పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయ్యే వరకు అంతా సవ్యంగానే నడిపించి.. ఆ తర్వాత జెండా ఎత్తేయాలని ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఈలోపు ప్రజలకు ఎలాంటి అనుమానం రాకుండా నిజాయితీ అనే కోటు వేసుకొని డాబుసరి కొడుతున్నారు. ప్రజలు కూడా ఇప్పుడీ కంపెనీ గురించి బయటికి తీయడంతో కొందరికి కోపాలు కూడా వస్తున్నాయి. కానీ జనాన్ని మేల్కోలిపి.. ఉన్నది ఉన్నట్టుగా చూపించడమే మా పని. ఇప్పటికైనా గుడ్డిగా మోసపోకండి. కంపెనీ బిచానా ఎత్తేయకముందే కళ్లు తెరవండి. ఇదే మా బిగ్ రిక్వెస్ట్.