ADMS Electric e Bikes Scam: e-బైక్స్ పేరుతో ADMS చేస్తున్న చీటింగ్ బిజినెస్‌పై బిగ్‌టీవీ ప్రసారం చేసిన కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ADMS స్కీమ్‌లో చేరిన వాళ్లంతా ఇప్పుడు ఈ కథనాలపైనే చర్చలు జరుపుతున్నారు. అటు టీమ్‌లీడర్లు ఏం చేయాలో తెలియక.. ఇవన్నీ తప్పుడు కథనాలని.. నమ్మొద్దంటూ కస్టమర్లకూ చెబుతున్నారు.. తమకు అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయంటూ చెబుతున్నారు.. వీళ్ల వాదనపైనా దృష్టి పెట్టిన బిగ్‌టీవీకి మరెన్నో సంచలన విషయాలు తెలిశాయి. బిగ్‌టీవీపై ఆరోపణలు చేస్తున్న వాళ్లు తప్పకుండా చూసి తెలుసుకోవాల్సిన విషయం ఇది..
కమీషన్ వ్యాపారంలోకి జనాన్ని దింపుతూ ప్రశ్నిస్తే వితండవాదం చేస్తున్న ADMS కంపెనీకి ఇప్పుడు బిగ్ టీవీ సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తోంది. మీది న్యాయమైన వ్యాపారం అయితే మేము చూపించబోయే, అడగబోయే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీది న్యాయమైన వ్యాపారం.. అన్ని అనుమతులు ఉన్నాయంటూ ప్రతి ఒక్కరు చేతిలో నాలుగు పేపర్లు పట్టుకొని చెబుతున్నారు కదా.. మీ వెబ్‌సైట్ నుంచే.. మీరు అప్‌లోడ్ చేసిన సర్టిఫికేట్లనే ఓసారి చూద్దాం. అసలు ఎవరూ గమనించరన్న ధైర్యమో.. లేదా చూసినా ఎవరేం చేయలేరన్న బరితెగింపో కానీ.. కొన్ని సర్టిఫికేట్లు కనిపించాయి ADMS వెబ్‌సైట్‌లో.
ఇది ISO 9001 సర్టిఫికేట్.. ఇందులో ఏముంది..? ADMS మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి HMC సంస్థ జారీ చేసిన సర్టిఫికెట్. తమకు ISO సర్టిఫికెట్ ఉందంటూ ADMS ఏజెంట్లు చెప్పుకునే సర్టిఫికెట్ ఇది. కానీ.. కాస్త జాగ్రత్తగా దీన్ని పరిశీలించండి.. ఇందులో ఉన్న అసలు మ్యాటర్ అర్థమైపోతుంది. ఈ సర్టిఫికెట్ దేనికి ఇచ్చారో తెలుసా.. శానిటరీ నాప్‌కిన్స్ క్వాలిటీగా తయారు చేసి కస్టమర్లకు అందిస్తున్నందుకు.. e-బైక్స్ వ్యాపారానికి.. మల్టీలెవల్ మార్కెటింగ్‌కి.. శానిటరీ నాప్‌కిన్స్‌కు ఏమైనా సంబంధం ఉందా..? మరి ADMS e-బైక్స్ వెబ్‌సైట్‌లో ఈ సర్టిఫికెట్లు ఎందుకు పెట్టారు. కస్టమర్లు గుడ్డోళ్లు.. డీటైల్స్ ఏమీ చూడరనే అతి నమ్మకమా.. ఇలానే కదా ఇంతకాలం జనాన్ని మోసం చేసారు. ఇక్కడ ఇంకో విషయం.. ఈ సర్టిఫికెట్ కూడా ఇప్పుడు వాలీడ్ కాదు.. దీని ఎక్స్‌పైరీ డేట్ అక్టోబర్ 9, 2023 అంటే.. దాదాపు ఏడాదిన్నర క్రితమే ఆ సర్టిఫికెట్ ఎక్స్‌పైరీ అయిపోయింది.
ఇక ఇది ISO 14001 సర్టిఫికేట్.. ఇది కూడా సేమ్ ఇంతకు ముందు సర్టిఫికెట్ లాంటిదే. క్వాలిటీ శానిటరీ నాప్‌కిన్స్‌ను కస్టమర్లకు అందిస్తున్నందుకు జారీ చేసినట్లు ఈ సర్టిఫికెట్‌లో క్లియర్‌గా ఉంది. అసలు ఆ సర్టిఫికెట్‌కు ఇప్పుడు నిర్వహిస్తున్న మనీ సర్క్యులేషన్ బిజినెస్‌కు ఏంటీ సంబంధం.. ? ఈ ISO 14001 సర్టిఫికెట్ కూడా.. అక్టోబర్ 9, 2023నే ఎక్స్‌పైరీ అయిపోయింది. అంటే.. ఇప్పుడు ఈ సర్టిఫికెట్ కూడా చెల్లదు. అయినా ఈ ISO సర్టిఫికెట్లనే ఇంకా చూపిస్తున్నారంటే ఎంతగా మోసం చేస్తున్నారో అర్థం కావడం లేదా.
ఇప్పుడు మరో సర్టిఫికేట్ చూద్దాం. ఇది ఉద్యం సర్టిఫికేట్. దీనిని కేంద్ర ప్రభుత్వం సూక్ష్మ, మధ్య తరహా ఫ్యాక్టరీల ఏర్పాటుకు అందజేస్తుంది. ఇందులో ఏముంది.. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టెక్స్‌టైల్స్ .. అదే శానిటరీ నాప్‌కీన్స్ తయారీ కోసం ఏర్పాటు చేసే టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీకి ఇచ్చిన సర్టిఫికెట్ .. అసలు e-బైక్స్ కంపెనీ వెబ్‌సైట్‌లో ఏం ఉండాలి..? వాహన తయారీకి సంబంధించిన అనుమతులు, బైక్ ఫ్యాక్టరీకి సంబంధించిన సర్టిఫికెట్లు, అవార్డులు.. కానీ అవేవీ ఈ సైట్‌లో కనిపించవు. కేవలం శానిటరీ నాప్‌కిన్స్ సర్టిఫికెట్లు మాత్రమే పెట్టి మోసం చేస్తున్నదెవరు.. ? ADMS మేనేజ్‌మెంట్ కాదా..? అసలు ఈ సర్టిఫికెట్ల గురించి పూర్తి తెలుసుకోకుండా జనాన్ని ఈ నకిలీ స్కీమ్‌లో చేర్పిస్తున్న ఏజెంట్లు కాదా..?
ఇక ఇప్పుడు చెప్పండి.. శానిటరీ నాప్‌కిన్స్ తయారీ కోసం లైసెన్స్‌లు తీసుకొని.. వాటి పేరుతో e-బైక్స్ అమ్ముతామని చెప్పి.. చివరికి మల్టీ లెవల్ మార్కెటింగ్ చేయడం ఏంటి అనేది ఇప్పుడు ADMS మేనేజ్మెంట్‌కే తెలియాలి. అసలు తమది e-బైక్స్ వ్యాపారమని చెబుతూ బయటికి ప్రచారం చేస్తూ.. లోపల మల్టీ లెవల్ మార్కెటింగ్ చేస్తుంది ADMS. ఈ సర్టిఫికెట్స్‌ను చూస్తే అసలు e-బైక్స్ అమ్మడానికి, తయారు చేయడానికి ఎలాంటి అనుమతులు లేవని అర్థమవుతుంది.
ఇక్కడే అర్థమవుతుంది ఈ కంపెనీ భాగోతం. ఇప్పుడు అనేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. e-బైక్స్ తయారీకి సంబంధించిన సర్టిఫికెట్లు ఎక్కడ..? మల్టీ లెవల్ మార్కెటింగ్, మనీ సర్క్యులేషన్ చేయడానికి అనుమతులు ఎక్కడ? అంటే సమాధానం లేదు. అసలు చేతిలో ఈ నాలుగు కాగితాలు పట్టుకొని దబాయిస్తున్న కొందరు ఏజెంట్లు అందులోఏముందో కూడా చూడటం లేదని అర్థమవుతుంది. ఆ సర్టిఫికెట్లలో ఏముందో చూడకపోవడం జనం అమాయకత్వమా? అవివేకమా?.
ఇప్పటికే ఈ మల్టీ లెవల్ మార్కెటింగ్‌లో లక్షలాది మంది చేరినట్టు తెలుస్తోంది. ఉన్నపాటుగా కంపెనీ బోర్డు తిప్పేస్తే పరిస్థితేంటి? అనేది ఇప్పుడు దేవుడికే తెలియాలి. అసలు ADMS కంపెనీ కొద్ది కాలంలోనే కుచ్చుటోపి పెట్టేందుకు రెడీ అయ్యిందా? అందుకే అందినకాడికి దోచేయాలనుకున్నారా? కంపెనీ ఎత్తేస్తే సమాధానం చెప్పేది ఎవరు? కొత్తగా ఇందులో ఇరుక్కున్నవారు కంపెనీని ప్రశ్నిస్తారా? లేక చేర్పించినవారినా? సమాధానం చెప్పేది కంపెనీనా? చేర్పించినవారా? అనేది తెలియడం లేదు.
బైక్‌లు అమ్ముకోవాల్సిన కంపెనీ బైక్ కొనకపోయినా పర్వాలేదని ఎందుకు చెబుతోంది? కేవలం ఐడీ జనరేట్ చేసుకుని కొత్తవారిని ఎందురు చేర్పించమంటోంది? చిన్న ప్రొడక్ట్ కూడా మీ చేతిలో పెట్టకుండా 16 వేలు ఎందుకు లాక్కుంటోంది? ఇప్పటికైనా కాస్త తెలివిగా ఆలోచించండి.
ఇక్కడ ADMS కూడా లక్షల్లో కాకుండా చాలా తెలివిగా 15.. 16 వేలే వసూలు చేస్తోంది. డబ్బు ఎక్కువగా ఉంటే రిస్క్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. ఇదైతే చిన్న అమౌంట్ కదా.. ఏమైనా తేడా జరిగినా కొంచెం డబ్బే కదా అనుకుంటారనే ధైర్యం కావొచ్చు. కానీ ఇది మోసం అని తేలిననాడు.. లేదా ఎవరైనా ఫిర్యాదు చేసిననాడు.. చర్యలు మొదలుపెడితే.. కంపెనీ పెద్దలతో పాటు.. ఇందులో కీలకంగా వ్యవహరించిన వారు జైలుకు పోక తప్పదని చెప్పాలి.