Kerala High Court Woman False Cases | మగవారిపై లేనిపోని లైంగిక ఆరోపణలు చేసే మహిళల ఆటలు ఇకపై చెల్లవు. తప్పుడు లైంగిక ఆరోపణలు చేసేందుకు ప్రయత్నించే మహిళలపై కేరళ హైకోర్టు(Kerala High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హైకోర్టు హెచ్చరించింది. ఫిర్యాదుదారులు చేస్తున్న ఆరోపణ అబద్ధమని తేలితే వారిపై చర్యలు తీసుకోవచ్చని హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. బదరుద్దీన్ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళలు దాఖలు చేస్తున్న లైంగిక వేధింపుల ఫిర్యాదులన్నీ నూరు శాతం నిజమైనవి కావని, అందుకే ఇటువంటి ఫిర్యాదులపై వివరణాత్మక దర్యాప్తు అవసరమని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఇటువంటి తప్పుడు ఫిర్యాదులు స్వీకరించిన సందర్భంలో సంబంధిత అధికారులే కాదు, సదరు కోర్టులు కూడా చిక్కుల్లో పడతాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఒక లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన కన్నూర్‌కు చెందిన యువకునికి ముందస్తు బెయిల్(Anticipatory bail) మంజూరు చేస్తూ.. జారీ చేసిన ఉత్తర్వులలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
కొందరు మహిళలు చేసే ఫిర్యాదులు అబద్ధమని తెలిసినా, వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసు అధికారులు తటపటాయిస్తుంటారని, అటువంటి సందర్భాల్లో పోలీసులు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. అధికారుల నిర్ణయాలు సరైనవైతే కోర్టు వారి ప్రయోజనాలను కాపాడుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. తప్పుడు ఫిర్యాదుల కారణంగా బాధితులకు కలిగే హానిని ఏ విధంగానూ తీర్చలేమని, అందుకే పోలీసులు దర్యాప్తు దశలోనే నిజానిజాలను నిర్థారించుకోవాలని కేరళ హైకోర్టు సూచించింది.
Also Read: జీతం పెంచాలంటే పరీక్షలో పాస్ కావాలి.. ఐటి కంపెనీ కండీషన్!
భార్య వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు
కట్టుకున్న భార్యల వల్ల బాధపడుతున్న భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు ఇటీవల పెరిగాయి. ఇటీవలే, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో టీసీఎస్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల మానవ్ శర్మ ఫిబ్రవరి 24న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు అతను ఒక వీడియో రికార్డ్ చేసి, తన భార్య తనతో చెడుగా ప్రవర్తిస్తుందని, వివాహేతర సంబంధాలు కలిగి ఉందని, ఇదే విషయంపై తనకు బాధ కలిగిందని చెప్పాడు. అతను మహిళలకు రక్షణ కల్పించే చట్టాలు ఉన్నట్లే పురుషులకు కూడా రక్షణ కావాలని కోరాడు.
మానవ్ శర్మ తన మరణానికి ముందు తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దని కోరాడు. అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసి, తన కుమారుడి మరణానికి కోడలు కారణమని ఆరోపించారు. అయితే, మానవ్ భార్య ఈ ఆరోపణలను తిరస్కరించి, తన భర్త మద్యపానానికి బానిస అయ్యాడని, పలుమార్లు ఆత్మహత్య ప్రయత్నాలు చేశాడని, తనను తాను చంపుకోవడానికి ప్రయత్నించినప్పుడు తానే అతన్ని కాపాడానని చెప్పింది. వివాహేతర సంబంధాల గురించి అడిగినప్పుడు, అది వివాహానికి ముందు జరిగిన విషయమని, వివాహం తర్వాత తన భర్తే తన ప్రపంచమంతా అని ఆమె పేర్కొంది.
పోలీసులు మానవ్ శర్మ ఆత్మహత్య కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. అతను రికార్డ్ చేసిన వీడియోను పరిశీలించి, అతని భార్యతో విభేదాలు, ఇతర సమస్యల కారణంగా ప్రాణాలు తీసుకున్నట్లు గుర్తించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.