అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మహిళ, రెండో మహిళ, ఎక్కువ రోజులు ఉన్న మహిళ.. ఇలా మనకి చాలా విషయాలు తెలుసు. అయితే వారంతా వివిధ ప్రయోగాలకోసం అంతరిక్ష కేంద్రం వరకు వెళ్లిన వారు. ఇటీవల అంతరిక్ష యాత్రికులు కూడా రయ్ మంటూ ప్రైవేట్ రాకెట్లలో దూసుకెళ్తున్నారు. తాజాగా ఈ అంతరిక్ష యాత్రల్లో ఓ అరుదైన రికార్డ్ సాధించారు ఆరుగురు మహిళలు. ఆ టీమ్ లో అందరూ మహిళలే. ఆల్ ఉమన్ రాకెట్ ఈరోజు అంతరిక్షంలోకి దూసుకెళ్లి 10 నిమిషాల తర్వాత సేఫ్ గా భూమిపై ల్యాండ్ అయింది. ఈ ఆరుగురు టీమ్ లో ఇంటర్నేషనల్ ఫేమస్ సింగర్ కేటీ పెర్రీ కూడా ఉండటం విశేషం.
జెఫ్ బెజోస్ కాబోయే భార్య..
ఆల్ ఉమన్ ఫ్లైట్ ని అంతరిక్షంలోకి పంపించిన కంపెనీ అమెజాన్. ఈ కంపెనీకి చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ అంతరిక్ష ప్రయోగాలు చేస్తోంది. ఈ సంస్థ ద్వారా ఒక వాహక నౌక ఈరోజు అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఆ నౌకలో కేటీ పెర్రీతోపాటు జెఫ్ బెజోస్ కాబోయే సతీమణి లారెన్ శాంచెజ్ కూడా ఉన్నారు. ఆల్ ఉమన్ ఫ్లైట్ లో ఉన్న ఆరుగురు మహిళలు వివిధ రంగాల్లో నిష్ణాతులు కావడం విశేషం.
సాహస యాత్ర
ఈ టూర్ లో గాయని, సంగీత దర్శకురాలు కేటీ పెర్రీ ప్రయాణం ఓ విశేషం. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఆమె ఈ సాహసానికి ఒప్పుకోవడమే ఓ సంచలనం కాగా.. ఈరోజు అందరూ మహిళలతో కూడిన బృందంలో ఆమె అంతరిక్ష యాత్రను పూర్తి చేసుకుని వచ్చారు.
భార రహిత స్థితిలో..
విమానాల్లో కూడా మనం ఆకాశంలోకి వెళ్తాం. కానీ వాటిని అంతరిక్ష యాత్రలు అనరు. అంతకంటే అత్యథిక ఎత్తుకు వెళ్తే ఆ యాత్రలనే అంతరిక్ష యాత్రలు అంటారు. ప్రస్తుతం బ్లూ ఆరిజిన్ కి చెందిన న్యూ షెపర్డ్ రాకెట్ ద్వారా వీరంతా అంతరిక్షం లోకి వెళ్లి వచ్చారు. ఈ యాత్ర మొత్తం 10 నిమిషాల్లో పూర్తయింది. భూ ఉపరితలం నుంచి దాదాపు 100 కిలోమీటర్ల వరకు ఈ రాకెట్ వెళ్లింది. అక్కడ గురుత్వాకర్షణ శక్తిలోని తేడాను కూడా వారు గమనించగలిగారు. గురుత్వాకర్షణ శక్తి లేని భార రహిత స్థితిలో వారంతా కొద్దిసేపు తమ సీట్ బెల్ట్ లు తొలగించి ఆ అనుభూతిని ఆస్వాదించవచ్చు.
11వ మిషన్..
ఇది బ్లూ ఆరిజన్ కి సంబంధించి 11వ మిషన్. గతంలో ఈ సంస్థ 52మందిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. తాజాగా మరో ఆరుగురు మహిళల బృందం ఈ లిస్ట్ లో చోటు దక్కించుకుంది. అంతరిక్ష యాత్రల విషయంలో ఎలన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ సంస్థతో.. జెఫ్ బెజోస్ కి చెందిన బ్లూ ఆరిజిన్ పోటీ పడుతోంది. రాబోయే రోజుల్లో మరింత తక్కువ ఖర్చుతోనే ఈ యాత్రలు పూర్తి చేసేందుకు వివిధ రకాల ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఫేమస్ పర్సన్స్ ని యాత్రలకు తీసుకెళ్తూ.. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు జెఫ్ బెజోస్. కేటీ పెర్రీ అంతరిక్షయానం ద్వారా ఈ మిషన్ మరింత ప్రచారం సంపాదించింది.