Huawei Mate X8: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హువావే.. ఇప్పుడు మరో కొత్త సంచలనానికి సిద్ధమైంది. తమ Mate X సిరీస్ 8వ వార్షికోత్సవం సందర్భంగా, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Mate X8 ఫోల్డబుల్ ఫోన్ ఫస్ట్ లుక్‌ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. ఈ వీడియోలో ఫోన్ డిజైన్ చూస్తుంటే టెక్ ప్రియులకు పండగే అనిపిస్తోంది. అయితే, డిజైన్ చూపించి ఊరించిన హువావే.. ఫోన్ ఫీచర్లు, ధర వివరాలను మాత్రం ఇంకా సస్పెన్స్‌లోనే ఉంచింది.
తాజాగా విడుదలైన వీడియో ప్రకారం.. Mate X8 డిజైన్ పాత మోడల్స్ తరహాలోనే లోపలికి మడిచే (ఇన్‌వర్డ్ ఫోల్డింగ్) విధంగా ఉంది. ఫోన్ మూసినప్పుడు పెద్ద డిస్‌ప్లే లోపలికి వెళ్లి సేఫ్‌గా ఉంటుంది. వెనుక వైపు హువావే మార్క్ పెద్ద సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ చాలా ప్రీమియంగా కనిపిస్తోంది. చూడటానికి ఇది పాత Mate X7 మాదిరిగానే ఉన్నా.. ఫినిషింగ్ మాత్రం చాలా స్లిమ్‌గా, ఆకర్షణీయంగా ఉంది.
కంపెనీ అధికారికంగా ఏమీ చెప్పకపోయినా.. టెక్ వర్గాల్లో ఈ ఫోన్ ఫీచర్లపై రకరకాల లీకులు చక్కర్లు కొడుతున్నాయి. Mate X8 బయట వైపు 6.5 అంగుళాల స్క్రీన్, లోపల 8.15 అంగుళాల భారీ డిస్‌ప్లేతో రానుందని సమాచారం. గత మోడల్‌తో పోలిస్తే ఇది కాస్త పెద్దది. అంతేకాకుండా.. లోపలి స్క్రీన్ డ్యామేజ్ కాకుండా అల్ట్రా-థిన్ గ్లాస్ (UTG) ప్రొటెక్షన్ వాడుతున్నారట.
Also Read: Jio రీఛార్జ్ గడువు ముగిస్తే ఇన్‌కమింగ్ కాల్స్ కూడా బంద్? సిమ్ యాక్టివ్‌గా ఉండాలంటే ఇలా చేయండి!
ఇక పెర్ఫార్మెన్స్ విషయంలో హువావే ఎక్కడా తగ్గడం లేదు. ఈ ఫోన్‌లో కొత్త కిరిన్ 9050 ప్రో ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఫోన్ స్పీడ్ అద్భుతంగా ఉండబోతోంది. ఇందులో స్టాండర్డ్ మోడల్‌తో పాటు, ప్రత్యేకంగా కలెక్టర్స్ ఎడిషన్ కూడా రానుంది. స్టాండర్డ్ వేరియంట్‌లో 12GB ర్యామ్, 512GB వరకు స్టోరేజ్ ఉంటే.. కలెక్టర్స్ ఎడిషన్‌లో ఏకంగా 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ ఆప్షన్లు ఉండనున్నాయి.
ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్ ఆరెంజ్, వైట్, బ్లాక్, గ్రీన్, పర్పుల్ షేడ్స్‌లో మొత్తం 5 ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి రానుందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ అద్భుతమైన ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? మన మార్కెట్లో దీని ధర ఎంత ఉండబోతోంది? అనే విషయాలపై క్లారిటీ రావాలంటే కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.
Also Read: ఒక్క రీఛార్జ్‌తో 84 రోజుల వ్యాలిడిటీ, 4 ఓటీటీలు, రూ.4,000 విలువైన ప్రీమియం బెనిఫిట్స్ ఫ్రీ!