Apple Made in India: ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ప్రపంచ ఆర్థిక వాతావరణం వేగంగా మారిపోతోంది. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు, రాజకీయ నిర్ణయాలు టెక్ దిగ్గజాల వ్యాపార మార్గాలను మార్చేలా ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న నూతన వాణిజ్య విధానాలు, దిగుమతులపై ఒత్తిడితో… యావత్ టెక్ పరిశ్రమలో గందరగోళం నెలకొంది. ఈ నేపధ్యంలో, ఐఫోన్ తయారీదారైన ఆపిల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చైనాపై అధిక సుంకాల విధింపు నేపథ్యంలో ఇప్పుడు ఆపిల్ వ్యాపారం సవాళ్లను ఎదుర్కొంటోంది.
మేడ్ ఇన్ ఇండియా
ఈ సవాళ్లను అవకాశాలుగా మలచుకుంటూ, ఆపిల్ తన వ్యూహాలను భారత్ వైపు మళ్లించనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇండియాలో తక్కువ ఖర్చుతో అధిక లాభాలను పొందే అవకాశం ఉండటమే. దీంతో ఇన్నాళ్లూ చైనాలో ప్రధానంగా తయారవుతున్న ఐఫోన్, త్వరలో “మేడ్ ఇన్ ఇండియా” ట్యాగ్‌తో ఇండిలోనే తయారుకానున్నాయి. అయితే అసలు ఆపిల్ ఎందుకు భారత్ వైపు మొగ్గుచూపుతోంది? దీని వెనుక ఉన్న వ్యూహాలు ఏమిటి? భారత్‌కు లాభమా? చైనాకు ఏమవుతుందనే విషయాలను ఇక్కడ చూద్దాం.
చైనా నుంచి భారత్‌కు షిఫ్ట్ ఎందుకు
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం. దీంతోపాటు గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు కాస్త గందరగోళంగా మారాయి. టారిఫ్‌లు పెరగడం, కొత్త నిబంధనలు రావడం వంటి విషయాలు అమెరికా కంపెనీలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఆపిల్ లాంటి కంపెనీలు తమ సరఫరా విషయంలో ఒక్క దేశంపై ఆధారపడకుండా, విభిన్న దేశాల్లో విస్తరించాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. ఈ పరిణామాల వల్లే భారత్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది.
భారత్‌లో తక్కువ దిగుమతి టారిఫ్‌లు
అమెరికా, చైనా మధ్య ఉన్న టారిఫ్‌లు దాదాపు 54% వరకు ఉన్నప్పుడు, భారత్ నుంచి వచ్చే దిగుమతులపై టారిఫ్ మాత్రం 26% మాత్రమే. అంటే, ఆపిల్‌కు తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసి అమెరికాలో అమ్ముకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
“మేక్ ఇన్ ఇండియా” పథకం ప్రోత్సాహం
భారత ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విదేశీ కంపెనీలకు పన్ను మినహాయింపులు, సబ్సిడీలు అందిస్తూ తయారీ కేంద్రంగా భారత్‌ను అభివృద్ధి చేస్తోంది. ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ వంటి ఆపిల్ భాగస్వామ్య సంస్థలు ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తమ ప్లాంట్లను విస్తరించాయి.
Read Also: Xiaomi Summer Sale 2025: సమ్మర్ సేవింగ్స్..అద్భుతమైన ..
భారత్‌కు లాభాలే లాభాలు
భారత్‌లో ఐఫోన్ తయారీ విస్తరించడంతో 2 నుంచి 5 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని అంచనా. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక ప్రజలకు పెద్దగా ఉపశమనం కలిగించవచ్చు. ఇప్పటికే 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఐఫోన్ ఎగుమతుల విలువ $6 బిలియన్లు (సుమారు 50,000 కోట్లకు పైగా) దాటింది. కొన్ని నివేదికల ప్రకారం, ఇది 2027 నాటికి $34 బిలియన్ల వరకు పెరిగే అవకాశం ఉంది.
భారత ఉత్పత్తిలో వాటా పెరుగుతోంది
ప్రస్తుతం ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తిలో భారత్ వాటా 14-15% ఉండగా, 2027 నాటికి ఇది 26-30% వరకు పెరగవచ్చని అంచనా. అంటే, ప్రతీ మూడు ఐఫోన్లలో ఒకటి భారత్‌లో తయారయ్యే అవకాశం ఉంది.
చైనాకు ఏమవుతుంది?
చైనా ఇప్పటికీ ఆపిల్ ఉత్పత్తిలో పెద్ద ప్లేయర్. కానీ, భారత్ వైపు షిఫ్ట్ వల్ల సుమారు $70 బిలియన్ల ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థపై కొంత ప్రభావం చూపొచ్చు. అయితే, పూర్తి స్థాయిలో చైనాను ఆపిల్ విడిచిపెట్టదు. ముఖ్యమైన పరికరాల ఉత్పత్తి ఇంకా అక్కడే జరగనుంది. కానీ, ప్రధానంగా అసెంబ్లీ వంటి శ్రామిక సంబంధిత పనులు భారత్‌లోకి షిఫ్ట్ కానున్నాయి. ఒకప్పుడు మనం వినియోగించిన మొబైల్స్ అన్నీ “మేడ్ ఇన్ చైనా” అయి ఉండేవి. కానీ రాబోయే రోజుల్లో “మేడ్ ఇన్ ఇండియా” అనే ట్యాగ్ రానుంది.