Indian Railways: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే సంస్థల్లో ఇండియన్ రైల్వే ఒకటిగా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా 7,300 పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. రోజుకు 22,000 కంటే ఎక్కువ రైళ్లు నడుస్తున్నాయి. నిత్యం సుమారు రెండున్నర కోట్ల మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇక దేశంలోనే అతిపెద్ద, అత్యంత బిజీ రైల్వే స్టేషన్ ఏది? అక్కడి నుంచి రోజూ ఎన్ని రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
దేశంలోని అత్యంత బిజీ రైల్వే స్టేషన్ హౌరా జంక్షన్
దేశంలో అత్యంత బిజీ రైల్వే స్టేషన్ హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది దేశంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ కూడా. ఇక్కడ ఏకంగా 23 ఫ్లాట్ ఫారమ్ లు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ ను 1854లో నిర్మించారు. అప్పట్లో ఒకే ప్లాట్ ఫారమ్ ఉండేది. దీనిని ఎర్ర ఇటుకలతో నిర్మించారు. 1900- 1911 మధ్య కాలంలో పునర్నిర్మించారు. ఆ తర్వాత రోజు రోజుకూ అభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ మొత్తం 23 ప్లాట్ ఫారమ్ లు ఉన్నాయి. 1 నుంచి 14 ప్లాట్ ఫారమ్ లను టెర్మినల్ 1గా పిలుస్తారు. ఇది పాత కాంప్లెక్స్ లో ఉంటుంది. తూర్పు రైల్వేకు సంబంధించి స్థానిక, సుదూర రైళ్లు, స్థానిక రైల్వే సర్వీసులు ఇక్కడి నుంచి నడుస్తాయి. 17 నుంచి 23 ప్లాట్ ఫారమ్ లను టెర్మినల్ 2గా పిలుస్తారు. ఇది కొత్త కాంప్లెక్స్ లో ఉంటుంది. ఇక్కడ మరో రెండు ప్లాట్ ఫారమ్ లను నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ఫ్లాట్ ఫారమ్ కూడా ఇక్కడే ఉంది. ప్లాట్ ఫారమ్ నంబర్ 1 ఏకంగా 1,296 మీటర్ల పొడవు ఉంటుంది. ఇక్కడి నుంచి రోజూ 600 పైగా రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి.
ప్రయాణీకుల కోసం అత్యాధునిక సౌకర్యాలు
ఈ రైల్వే స్టేషన్ లో ప్రయాణీకుల కోసం అత్యాధునికి సౌకర్యాలు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ లో ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. డార్మిటరీ, సింగిల్ రూమ్, డబుల్ రూమ్ వసతితో కూడిన ట్రాన్సిట్ ప్యాసింజర్ సౌకర్యం ఉంది. ఫస్ట్ క్లాస్ ప్రయాణీకులు కోల్ కతా స్కైలైన్, హౌరా బ్రిడ్జి బాల్కనీ వ్యూతో కూడిన ఏసీ ప్రాంతంలో వెయిటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ స్టేషన్‌లో 84 లోకోమోటివ్‌లను ఉంచగలిగే డీజిల్ లోకోమోటివ్ షెడ్ ఉంది. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ షెడ్‌లో 96 లోకోమోటివ్‌లను ఉంచగలిగే స్థలం ఉంది.
Read Also: దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్.. ఎప్పుడు? ఎక్కడ అందుబాటులోకి వచ్చిందంటే?
హుగ్లీ నదిని ఆనుకుని.. హౌరా వంతెనతో అనుసంధానమై..
హౌరా రైల్వే స్టేషన్ హుగ్లీ నది పశ్చిమ ఒడ్డున ఉంది. దేశంలోనే అత్యంత ప్రసిద్ధ ల్యాండ్ మార్క్ లలో ఒకటైన హౌరా వంతెన ద్వారా కోల్ కతాకు నేరుగా అనుసంధానించబడి ఉంది. ఈ వంతెన కోల్ కతా వ్యాపార ప్రాంతాలకు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది.
Read Also: దేశంలో అత్యంత అందమైన రైల్వే స్టేషన్, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే!