Social Media Ban : పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని అరికట్టేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా ఉండేందుకు ఓ చట్టం తీసుకురాబోతోంది. అయితే దీనిపై ఆస్ట్రేలియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొంతమంది ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరికొంతమంది ఇది పిల్లల భవిష్యత్ కోసం మంచి నిర్ణయమని చెబుతున్నారు.
ఓవైపు ఈ చట్టం పిల్లల గొంతులను అణిచివేసే విధంగా ఉందని పలువురు యువ హక్కుల న్యాయవాదులు చెబుతున్నారు. పలువురు యువకులు కూడా సోషల్ మీడియాను నిషేధించడం సమస్యలకు పరిష్కారం కాదని అంటున్నారు. దీని కారణంగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో కనెక్ట్ అయ్యే మార్గాలు అంతమైపోతాయని అంటున్నారు. కానీ మరోవైపు పిల్లలు అంత చిన్న వయస్సులోనే ఇంటర్నెట్ ప్రపంచాన్ని సురక్షితంగా అర్థం చేసుకోలేరని పలువురు తల్లిదండ్రులు అంటున్నారు.
యూగోవ్ సర్వే ప్రకారం అయితే ఈ నిషేధానికి 77 శాతం మంది ఆస్ట్రేలియన్ ప్రజల మద్దతు లభించింది. అయితే ఈ మద్దతు ఆగస్టులో 61 శాతం ఉండగా, నవంబర్‌లో 77 శాతానికి పెరిగింది. ఇకపోతే ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌తో పాటు ఇతర మీడియా సంస్థలు కూడా ఈ నిషేధానికి మద్దతుగా నిలిచాయి.
రూ.273 కోట్ల ఫైన్ – ఒకవేళ ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. తమకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో ఏడాదిలోగా వయో పరిమితులు నిర్వహించాలి. చిన్నపిల్లలు సోషల్‌మీడియా ఖాతాలు వినియోగించకుండా 12 నెలల్లోనే తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో మార్పులు చేర్పులు చేయాలి. ఒకవేళ సామాజిక మాధ్యమాల సంస్థలు ఈ నిబంధనలు ఉల్లంఘించి, రూల్స్ పాటించకపోతే సదరు సంస్థలపై 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు ( అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.273 కోట్లకు పైనే) జరిమానా విధిస్తారు. టిక్‌టాక్, ఫేస్‌బుక్, స్నాప్‌చాప్, రెడిట్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ సహా ఇతర మాధ్యమాలకు ఈ చట్టం వర్తించనుంది.
టిక్‌టాక్ రియాక్షన్! –
‘చాలా ప్రమాదం చీకట్లోకి తోసేయడమే’- అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టిక్‌టాక్‌కు సంబంధించిన ఓ ప్రతినిధి మాట్లాడారు. “ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నాం. మానసిక ఆరోగ్యం, ఆన్లైన్ సేఫ్టీ, యువ హక్కుల న్యాయవాదులు కొత్త చట్టానికి వ్యతిరేకంగా ఇచ్చిన సలహా, సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదు. బ్యాన్ చేయడమంటే యువతను చీకట్లోకి నెట్టేయడమే.” అని అన్నారు.
కాగా, కొత్త చట్టం బిల్లుకు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదం తెలిపింది. ఇక, దీనికి సెనెట్ ఆమోదం తెలిపితే చట్టరూపం దాల్చనుంది. బుధవారం ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా 102 ఓట్లతో ఆమోదం పొందింది. మెజార్టీ పార్టీలు దీనికి అనుకూలంగా ఓటేశారు. సభలో 13 మంది మాత్రం వ్యతిరేకించారు. ఏదేమైనా మొత్తంగా ఆస్ట్రేలియన్స్ నుంచి ఈ కొత్త చట్టంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి చూడాలి చిన్న వయసులోనే పిల్లలు సోషల్ మీడియాకు అలవాటుపడి లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్న నేపథ్యంలో ఇతర దేశాలైనా ఆస్ట్రేలియాను ఆదర్శంగా తీసుకుంటాయో లేదో!
ALSO READ : ఎలన్ మస్క్ కు షాక్.. ఇకపై ఆ దేశంలో..!