Pawan Kalyan: కాకినాడలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పవర్ చూపించారు. అంతేకాదు సీరియస్ కామెంట్స్ చేయడమే కాక, అధికారులను పరుగులు పెట్టించారు. పవన్ పర్యటన అనగానే సాదాసీదాగా సాగుతుందని అనుకున్న అధికారులకు పవన్ పెద్ద ఝలక్ ఇచ్చారు.
ఇటీవల కాకినాడ తీర ప్రాంతంలో జిల్లా కలెక్టర్ సింగం మాదిరిగా, రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టురట్టు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సుమారు 6 లారీల రేషన్ బియ్యాన్ని అధికారులు ఓడలో పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనకు వచ్చారు. అది కూడా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి కాకినాడ పోర్టుకు పవన్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా కాకినాడ పోర్టులో అక్రమ బియ్యం రవాణా సాగుతున్న నేపథ్యంలో, అధికారులను ప్రశ్నల వర్షం కురిపించి ముచ్చెమటలు పట్టించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పోర్టు నుండి అక్రమ బియ్యం రవాణా జరుగుతున్నప్పుడు, భవిష్యత్తులో పేలుడు పదార్థాలు బయట నుండి రావని గ్యారెంటీ ఏమిటి అంటూ పవన్ ప్రశ్నించారు. గతంలో ముంబై పేలుళ్లకు తీర ప్రాంతంలో ఉగ్రవాదులు వచ్చిన విషయాన్ని మరిచిపోయారా అంటూ ప్రశ్నించిన పవన్, కసబ్ లాంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం కాకినాడ తీర ప్రాంతంలో లేదా అంటూ సీరియస్ అయ్యారు. కాకినాడ పోర్టులో జరుగుతున్న అక్రమ బియ్యం రవాణా, నిఘ వైఫల్యం పై జిల్లా ఎస్పీ వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం పూర్తి వైఫల్యం చెందిందని, ఇది దేశ భద్రతకు భంగం కలుగుతున్నట్లుగా తాను భావిస్తున్నానన్నారు. అక్రమ రవాణా చేస్తున్న బోట్ ఓనర్లు, దీనికి పాల్పడుతున్న వ్యక్తులు, వెనక ఉన్న వ్యక్తులపై వెంటనే కేసులు నమోదు చేయాలని, కారకులైన కింగ్ పిన్ లను గుర్తించాలని పవన్ ఆదేశించారు.
Also Read: AP Schemes: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇదొక్కటి మిస్ అయితే.. పథకాలన్నీ కట్..
అలాగే ప్రధాని నరేంద్ర మోడీ, హోం మినిస్టర్ వంగలపూడి అనిత, దర్యాప్తు సంస్థలకు పంపించేందుకు, కాకినాడ పోర్టు అక్రమ రవాణా కార్యకలాపాలపై లేఖలు సిద్ధం చేయాలని తన వ్యక్తిగత కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. మొత్తం పవన్ కళ్యాణ్ పర్యటన కాకినాడ పోర్టులో సాగుతున్నంత సేపు, గత పర్యటనలకు భిన్నంగా సాగిందని చెప్పవచ్చు. మరి అక్రమ బియ్యం రవాణా వెనుక, అధికార పార్టీకి చెందిన ఓ నేత హస్తం ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందులో ఏమైనా వాస్తవం ఉందో పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.