Anti-Aging Experiment: చావులేకుండా ఉండేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఎవరూ సక్సెస్ కాలేదు. బయో హ్యాకర్ బ్రయాన్ జాన్సన్ కూడా ఈ ప్రయోగం చేశాడు. ఇందుకోసం ఏకంగా రూ.17 కోట్లు ఖర్చు చేశాడు. యవ్వనంగా ఉండాలని ప్రయోగం చేస్తే, ముసలి వాడిగా మారిపోయినట్లు వెల్లడించాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్ లో షేర్ చేసిన వీడియోలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. తన యాంటీ ఏజింగ్ ప్రయోగం ఎలా విఫలం అయ్యిందో చెప్పే ప్రయత్నం చేశాడు.
కోట్ల రూపాయలతో ప్రయోగం.. ఊహించిన ఫలితం..
చావు లేకుండా ఉండేందుకు ప్రయోగాలు చేసిన ప్రముఖ వ్యక్తులలో టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ ఒకడు. తన మీద తానే ఈ ప్రయోగాన్ని చేసుకున్నాడు. వయసును తగ్గించుకునేందుకు 2 మిలియన్లు డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ.17 కోట్లు ఖర్చు చేశాడు. అధునాతన ఆరోగ్య పద్ధతులను ఉపయోగించి వయసును కంట్రోల్ చేయాలనుకున్నాడు. ఇందుకోసం తన కొడుకు నుంచి రక్త మార్పిడి, ప్లాస్మా మార్పిడి చేయించుకున్నాడు. అప్పట్లో ఈ ప్రయోగం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి కలిగించింది.
46 ఏళ్ల బ్రయాన్ జాన్సన్ రీసెంట్ గా ఊహించని ఫలితాన్ని ఎదుర్కొన్నాడు. వృద్ధాప్యాన్ని కంట్రోల్ చేసేందుకు చేసిన ప్రయోగం విఫలం అయినట్లు గుర్తించాడు. సొంత యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసిన వీడియోలో జాన్సన్ తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించాడు. ఈ ప్రయోగంలో కీలకమైనదిగా భావించిన రాపామైసిన్ మెడిసిన్ లో ముఖ్యమైన లోపాన్ని గుర్తించినట్లు తెలిపాడు. రోగనిరోధక శక్తిని తగ్గించే ఈ మందును మొదట అవయవ మార్పిడి రోగులకు ఉపయోగించారని.. ఇప్పుడు వృద్ధాప్య వ్యతిరేక ప్రయోగాల్లో ఉపయోగిస్తున్నట్లు తెలిపాడు. ఈ మందును జాన్సన్ ఐదు సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నట్లు వివరించాడు.
Read Also: మొసళ్లను పెంచుకుంటారా? వందల టన్నులు వేలానికి సిద్ధం.. డెలీవరీ బాధ్యతలు మీవే!
ఎలుకల జీవితాన్ని పెంచిన రాపామైసిన్
2009లో నిర్వహించిన అధ్యయనంలో రాపామైసిన్ ఎలుకల జీవితకాలాన్ని 14% వరకు పెంచుతుందని తేలింది. 2023లో మనుషుల మీద ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగంలో పాల్గొన్న 65% మంది ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు యాంటీ ఏజింగ్ లక్షణాలు కనిపించినట్లు గుర్తించారు. జాన్సన్ కూడా తన యాంటీ ఏజింగ్ ప్రయోగంలో ఈ మెడిసిన్ ను కొద్ది సంవత్సరాలు పాటు ఉపయోగించాడు. ఆయనలో మాత్రం యాంటీ ఏజింగ్ లక్షణాలు కనిపించకపోగా, వృద్ధాప్య ఛాయలు కనిపించినట్లు వెల్లడించాడు. పైగా నోటి పూత, గాయాలు త్వరగా నయం కాకపోవడం, కొలెస్ట్రాల్ అసమతుల్యత, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, హృదయ స్పందనలో తేడాలు సహా పలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నట్లు తెలిపాడు. యవ్వనాన్ని కాపాడటానికి బదులుగా.. ఇది వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు. అప్పటి నుంచి ఈ మందును తీసుకోవడం మానేసినట్లు తెలిపాడు. ప్రస్తుతానికి యాంటీ ఏజింగ్ ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బ్రయాన్ జాన్సన్ ప్రకటించాడు.
Read Also: 12,500 ఏళ్ల కిందట అంతరించిపోయిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నక్కల జాతికి మళ్లీ ప్రాణం!