Crocodile Auction: సాధారణంగా అరుదైన వస్తువులను వేలం వేస్తుంటారు. పురాతనమైన వస్తువులకు మరింత ధర పలుకుతుంది. కొన్ని వస్తువులను కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన సందర్భాలున్నాయి. అయితే, త్వరలో చైనాలో వెరైటీ వేలం పాట జరగబోతోంది. ఇందులో ఏకంగా బతికి ఉన్న మొసళ్లను వేలం వేయబోతున్నారు. మొసళ్లను వేలం వేయడం ఏంట్రా బాబూ అనిపిస్తుందా? ఇప్పటికే వీటిని అమ్మేందుకు రెండుసార్లు వేలం పాట నిర్వహించినా ఎవరూ కొనుగోలు చేయలేదు. ముచ్చటగా మూడోసారి ఈ మొసళ్ల వేలం జరగబోతోది.
న్యాయస్థానం నేతృత్వంలో మొసళ్ల వేలం
ఈ మొసళ్ల వేలం చైనాలోని షెంజెన్ కోర్టు నేతృత్వంలో కొనసాగనుంది. న్యాయమూర్తుల సమక్షంలో 100 టన్నుల సియామీస్ మొసళ్ళను వేలం నిర్వహించనున్నారు. ఈ వేలం ప్రక్రియ మార్చి 10న మొదలై మే 9 వరకు కొనసాగనుంది. 100 టన్నుల మొసళ్ల ధరను న్యాయస్థానం 4 మిలియన్ యువాన్లు.. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.4.7 కోట్లుగా నిర్ణయించింది. ఇక ఈ మొసళ్లను వేలంలో దక్కించుకున్న వాళ్లు వాటిని స్వయంగా తీసుకెళ్లాలి. నీటిలో నుంచి బయటకు తీయడం మొదలుకొని రవాణా వరకు అన్ని ఖర్చులు వాళ్లే భరించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ మొసళ్లను కొనుగోలు చేసే వారికి కృత్రిమంగా వీటిని పెంచేందుకు లైసెన్స్ అనేది ఉండాలి. లేని వాళ్లు ఈ వేలంలో పాల్గొనేందుకు అనర్హులుగా న్యాయస్థానం ప్రకటించింది.
ఈ మొసళ్ల వేలం ఎందుకు?
2005లో మో జున్ రాంగ్ అనే వ్యక్తి గ్వాంగ్ డాంగ్ హాంగ్ యి క్రొకొడైల్ సంస్థను నెలకొల్పారు. ఆయనను అందరూ క్రొకొడైల్ గాడ్ గా పిలిచేవారు. కొంత కాలం పాటు ఈ పరిశ్రమ బాగానే కొనసాగినా, ఆ తర్వాత బాగా అప్పులు అయ్యాయి. వాటిని తీర్చలేకపోవడంతో అతడి ఆస్తులను వేలం వేయాలని న్యాయస్థానం నిర్ణయించింది. ఇప్పటికే రెండుసార్లు వీటిని అమ్మేందుకు వేలం పాట నిర్వహించారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ వీటి వేలంపాట కొనసాగింది. ధర ఎక్కువ అనే కారణంతో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అలీబాబా జ్యుడీషియల్ వేలం సైట్ ను ఏకంగా 4 వేల మంది విజిట్ చేసినప్పటికీ, వాటిని కొనుగోలుకు సుముఖత చూపించలేదు. “నెటిజన్లు కూడా ఈ వేలం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ వేలం ధర చాలా ఎక్కువగా ఉంది. నిజంగా వీటిని ఎవరు కొనుగోలు చేస్తారో అర్థం కావడం లేదు. అంత ధర పెట్టి కొనడం, కోర్టు నిబంధనల ప్రకారం పెంచడం అనేది అంత ఈజీ కాదు” అని అభిప్రాయపడ్డాడు. “ఇది సాధారణ వ్యక్తులతో అయ్యే పని కాదు. పెద్ద కంపెనీ మాత్రమే వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది” అని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు.
మొసళ్లను దేనికి ఉపయోగిస్తారు?
చైనాలో మొసళ్ల వ్యాపారం బాగా కొనసాగుతుంది. మొసళ్ల చర్మం, మాంసం నుంచి ఎన్నో ఫ్యాన్సీ వస్తువులు, సౌందర్య సాధనాలను తయారు చేస్తారు.
Read Also: 12,500 ఏళ్ల కిందట అంతరించిపోయిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నక్కల జాతికి మళ్లీ ప్రాణం!