Brain Sharp No Smartphone | మనిషి జీవితం ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌తోనే నడుస్తోంది. అలాంటిది అది లేకుండా ఒక్కరోజైనా ఉండగలమా? ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా! అంతగా అడిక్ట్ అయ్యాం మరి! అయితే, ఫోన్ వాడకం వీలైనంత తగ్గించుకోవాలని తరచూ నిపుణులు సూచిస్తుంటారు. ఈ క్రమంలో, తాజా పరిశోధనల్లో ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది.
స్మార్ట్‌ఫోన్లను వీలైనంత తక్కువగా ఉపయోగించడం వల్ల మెదడు అత్యంత చురుకుగా పని చేస్తుందట. జర్మనీలోని హెయిడెల్‌బర్గ్, కోలోగ్నే యూనివర్సిటీల సైంటిస్టులు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం తేలింది. ఈ పరిశోధన కోసం వారు.. “త్రీడేస్ చాలెంజ్”ను కొంతమంది యువతపై ప్రయోగించారు.
18 నుంచి 30 ఏళ్లలోపు వయస్సు గల 25 మంది యువతపై ఈ పరిశోధన నిర్వహించారు. సుమారు 72 గంటలపాటు (దాదాపు మూడు రోజులు) కేవలం అత్యవసర వినియోగానికి మాత్రమే వారికి ఫోన్ వాడడానికి అనుమతించారు. ఈ సమయంలోనే సోషల్ మీడియా అడిక్షన్‌ను కూడా పరిశీలించారు. పరిశోధనకు ముందు, ఆ తర్వాత వ్యక్తులకు ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌తో పాటు కొన్ని మానసిక పరీక్షలు నిర్వహించారు.
పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే, ఫోన్ తక్కువగా వాడిన వ్యక్తులలో మెదడు అత్యంత చురుకుగా పని చేస్తుంది. అంతేకాదు, వ్యసనానికి సంబంధించిన “న్యూరోట్రాన్స్మిటర్ వ్యవస్థ”కు సంబంధించిన మెదడు క్రియాశీలతలో కూడా మార్పులు గమనించారు. ఫలితంగా.. ఫోన్‌కు ఎంత దూరంగా ఉంటే.. మెదడు అంత బాగా పని చేస్తుందని ఫలితాల్లో తేలింది.
Also Read: మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతోందా?.. ఇలా చేస్తే సమస్యకు చెక్!
సుదీర్ఘకాలిక పరిశోధనలు (Longitudinal Study) చేసిన తర్వాత ఈ అంచనాకి వచ్చినట్లు పరిశోధకులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ విషయంపై మరింత స్పష్టత రావచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ ఓ ఆసక్తికరమైన సంగతి చెప్పాలి. ప్రముఖ నటి సమంత ఈ మధ్యే త్రీడేస్ చాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధతో సమంత మూడు రోజులపాటు తన ఫోన్‌కు దూరంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు.. ఆ సమయంలో తన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి.. తన అభిమానులకు సూచనలు కూడా ఇచ్చారు.
“మూడు రోజులపాటు ఫోన్ లేదు. ఎవరితో కమ్యూనికేషన్ లేదు. నాతో నేను మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన విషయాల్లో ఒకటి. భయంకరమైనది కూడా. కానీ, ఇలా మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్‌సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటాను. మీరు కూడా స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి” అని సమంత తన అభిమానులకు సూచించారు.
పిల్లలపై స్మార్ట్ ఫోన్ తో తీవ్ర ప్రభావాలు
స్మార్ట్‌ఫోన్ అతి వినియోగం చాలామందికి వ్యసనాలు, అనర్థాలకు దారితీస్తోంది. తాజాగా, గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ చేసిన ఒక అధ్యయనంలో, చిన్నపిల్లలు మరియు టీనేజర్ల మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వెల్లడైంది. 13-17 ఏళ్ల వయస్సు ఉన్న 10,000 మందిని పరిశీలించి, ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ వాడేవారిలో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కనిపించాయి. ఇందులో అమ్మాయిలలో ఆందోళన 65% మంది ఎక్కువగా ఉందని గుర్తించారు. స్మార్ట్‌ఫోన్ వ్యసనంగా మారితే.. పిల్లల్లో కోపం, చికాకు, బెదిరింపులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్క్రీన్ టైమ్ తగ్గించడం, టెక్నాలజీ పట్ల అవగాహన పెంచడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.