Virtual Reality Surgery: వైద్య రంగంలో టెక్నాలజీ మార్పులు రోజురోజుకు ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా అమెరికా మిచిగాన్‌లో ఒక ఆసుపత్రిలో వాడుతున్న టెక్నాలజీని చూస్తే, సినిమా సీన్ మాదిరిగా అనిపిస్తుంది. ఒక చిన్నారి జీవితాన్ని ఏకంగా వీడియో గేమ్ టెక్నాలజీ మార్చేసింది. అవును ఇది నిజం. ఇటీవల వర్చువల్ రియాలిటీ.. వైద్యులకు మెదడు లోపల ఏం జరుగుతుందో, ఏ ప్రాంతంలో సమస్య ఉందో ముందుగానే తెలుసుకునే వీలు కల్పిస్తోంది. దీంతో వైద్యులకు సర్జికల్ థియేటర్ సమయంలో XR విజువలైజేషన్ మరింత సులభమవుతుంది.
ఈ టెక్నాలజీ వినియోగిస్తున్న ఆసుపత్రి
మిచిగన్‌లోని రాయల్ ఓక్ అనే నగరంలో ఉన్న కోర్‌వెల్ హెల్త్ విలియం బ్యూమాంట్ యూనివర్సిటీ హాస్పిటల్ ఈ సాంకేతికతను వినియోగిస్తోంది. అక్కడ పని చేస్తున్న న్యూరో సర్జన్లు ఈ వర్చువల్ టెక్నాలజీ ద్వారా శస్త్రచికిత్స చేసే ముందు రోగి మెదడును పూర్తిగా అధ్యయనం చేసి, ఖచ్చితమైన ప్లాన్ తయారుచేస్తున్నారు.
ఓ చిన్నారి జీవితాన్ని మార్చిన టెక్నాలజీ
ఈ టెక్నాలజీ ప్రయోజనం పొందిన వ్యక్తుల్లో ఒకరు ఐదేళ్ల హాలిన్ ఫ్రోమర్ ఉన్నారు. ఆమెకు ట్యూబరస్ స్క్లెరోసిస్ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి ఉంది. ఇది మెదడు, గుండె, మూత్రపిండాల్లో గడ్డలు ఏర్పడే పరిస్థితి. ముఖ్యంగా మెదడులో ఏర్పడే కణితులు, మూర్ఛలను కలిగించే వ్యాధి. మొదట ఆమె ఒహియోలో చికిత్స పొందింది. కానీ తల్లిదండ్రులకు మిచిగన్‌లో మెరుగైన టెక్నాలజీ ఉందని తెలిసింది. వెంటనే వారు ఫెంటన్ అనే ప్రాంతానికి మకాం మార్చారు.
వర్చువల్ మెదడు టూర్ – డాక్టర్ తీసిన 3D బ్రెయిన్ జర్నీ
డాక్టర్ సీజర్ సెరానో అనే పీడియాట్రిక్ న్యూరో సర్జన్, హాలిన్ మెదడును వర్చువల్ టూర్ ద్వారా చూపించారు. MRI, CT స్కాన్‌లను ఆధారంగా చేసుకొని తాను VR హెడ్సెట్‌లో చూసే విధంగా, మెదడు లోపల ఎలా ఉందో ఒక 3D మ్యాప్‌లను తయారు చేశారు.
Read Also: Meta Breakup: మెటాకు షాక్.. ఈ తీర్పుతో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ …
వీడియో గేమ్ తరహాలో వైద్య సమాచారం
హాలిన్ తల్లిదండ్రుల మాటల్లో, ఇది అక్షరాలా వీడియో గేమ్ లాంటిదే! కానీ గేమ్ కాదు. ఈ టెక్ ద్వారా వారు తమ కుమార్తె మెదడులో ఎక్కడ కణితం ఉందో, అక్కడ లేజర్ ట్రీట్‌మెంట్ ఎలా జరగబోతుందో, అందులో నుంచి మూర్ఛలు ఎలా వస్తున్నాయో స్పష్టంగా తెలుసుకున్నారని వెల్లడించారు. హాలిన్ తల్లి హీథర్ ఫ్రోమర్ చెప్పినట్లు VRలో చూస్తుంటే ఆ సమస్య ఉన్న ప్రాంతం ఎర్రగా వెలిగిపోతుందన్నారు. ఇది ఒక గేమ్ లాగా అనిపించినా, నిజానికి జీవితాన్ని మార్చే టెక్నాలజీ అని పేర్కొన్నారు.
వాస్తవ శస్త్రచికిత్స సమయంలో కూడా XR ఉపయోగం
ఈ వర్చువల్ టెక్నాలజీతో వైద్యులు శస్త్రచికిత్సకు ముందు మాత్రమే కాదు, ఆపరేషన్ సమయంలో కూడా ఉపయోగిస్తున్నారు. శస్త్రచికిత్స సమయంలో ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) ఆధారంగా సర్జికల్ మైక్రోస్కోప్ ఉపయోగించి, రోగి మెదడుపై వాస్తవిక చిత్రాన్ని చూశారు. ఈ టెక్నాలజీ వల్ల మెదడులోని ముఖ్యమైన ట్రాక్ట్‌లను ఖచ్చితంగా గుర్తించి, వాటిని గాయపరచకుండా శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు వెల్లడించారు.
శస్త్రచికిత్స ఫలితాలు
చివరకు శస్త్రచికిత్స విజయవంతమైంది. గత ఐదు సంవత్సరాలుగా మూర్ఛలతో బాధపడుతున్న చిన్నారి శస్త్రచికిత్స తర్వాత మూడు వారాలుగా ఒక్క మూర్ఛ కూడా పోలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులకు సంతోషం వ్యక్తం చేశారు. ఇతర న్యూరో సర్జరీలకూ దీన్ని వినియోగిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. రోగి మెదడులో ఏ ప్రాంతాన్ని టచ్ చేయకూడదో స్పష్టంగా చూపుతుందని ఆయన అన్నారు. ఈ టెక్నాలజీ వల్ల శస్త్రచికిత్సలు కేవలం సురక్షితంగా మారడమే కాదు. ఆపరేషన్ సమయం తగ్గుతుంది, రికవరీ వేగంగా ఉంటుంది. పైగా రోగులకు, వారి కుటుంబ సభ్యులకు మరింత అవగాహన కల్పిస్తుంది. ఇది మరింత మందికి భరోసా కలిగిస్తుంది.
భారత్ వస్తుందా ఈ టెక్నాలజీ?
ప్రస్తుతం ఇది అమెరికాలోని కొద్ది ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ, ఈ టెక్నాలజీ విజయవంతంగా నడుస్తూ ఉండటంతో త్వరలోనే భారత్‌లోని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా దీన్ని తీసుకొచ్చే అవకాశముంది.