ఇల్లు కట్టడానికి ఇటుకలు మాత్రమే ఉంటే సరిపోదు. వాటిని అతికించి, బలంగా మార్చడానికి సిమెంట్ కూడా అవసరం. అయితే, ఇటీవల బహుళ అంతస్తుల భవనాలను ఇటుకలతో పని లేకుండానే కట్టేస్తున్నారు. కేవలం సిమెంట్‌తోనే గోడలు కూడా లేపేస్తున్నారు. దానివల్ల అవి మరింత దృఢంగా మారుతున్నాయి. కానీ, ఖగోళ శాస్త్రవేత్తలు మాత్రం.. ఇళ్లు కట్టడానికి సిమెంట్ అవసరం లేదని, ఇటుకలు ఉంటే చాలని అంటున్నారు. ఇంతకీ ఆ ఇళ్లు ఎక్కడ కట్టనున్నారో తెలుసా? అదిగో అల్లంత దూరంలో ఆహ్లాదంగా కనిపిస్తుందే.. ఆ చంద్రుడి మీద.
ఒకే ఇప్పుడు మనం చంద్రుడి మీద అడుగు పెట్టేశాం. కానీ, అక్కడ నివసించడం ఎలా? భూమి ఉన్నట్లు అక్కడ బతకాలి అంటే తప్పకుండా దృఢమైన నిర్మాణాలు ఉండాలి కదా. అందుకు ఏం చెయ్యాలి? భూమి మీద నుంచి ఇటుకలు, సిమెంట్‌ను తీసుకెళ్లాలంటే మాటలు కాదు. అందుకు ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుంది. పైగా అంతరిక్ష నౌకల్లో భారీ సామాగ్రిని తరలించడం అంత ఈజీ కాదు. అందుకే, పరిశోధకులకు ఒక ఐడియా వచ్చింది. భూమి మీద నుంచి ఇటుకలు, సిమెంట్ మొసుకెళ్లే బదులు.. అక్కడి దూళితోనే ఇటుకలు చేసేస్తే సరిపోతుంది కదా అనుకున్నారు. అది సరే.. సిమెంట్ లేకుండా నిర్మాణం ఎలా పూర్తి చేయగలరని పలువురు ప్రశ్నించారు. ఇందుకు కూడా మా దగ్గర సమాధానం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు.
అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ అర్కాన్సన్‌కు చెందిన పరిశోధకులు ఈ మేరకు పలు పరిశోధనలు చేపట్టారు. ఒక కృత్రిమ పదార్థాన్ని ఉపయోగించి ప్రత్యేకమైన బ్లాకులు(ఇటుకలు) తయారు చేశారు. ఈ పదార్థాన్ని ‘లూనార్ హైలాండ్స్ రెగోలిత్ సిమ్యులెంట్ – (LHS-1) అంటారు. ఇది అపోలో మిషన్ల సమయంలో సేకరించిన చంద్రుడి మట్టిని పోలి ఉంటుంది. ఇందుకు వారు లేజర్ టెక్నాలజీ ఉపయోగించారు. చంద్రుడి మీద లభించే సహజ వనరులతోనే నిర్మాణాలు చేపట్టగలిగితే ఖర్చు గణనీయంగా తగ్గుతుందని నిరూపించారు.
ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తలు ‘లేజర్ పౌడర్ బెడ్ ఫ్యూజన్’ అనే ఆధునిక సాంకేతిక విధానాన్ని ఉపయోగించారు. ఇందులో ముందుగా పొడి రూపంలో ఉన్న పదార్థాన్ని ఒక చోట సమాంతరంగా పలుచని పొరలా పరిచారు. తర్వాత లేజర్ కిరణాలను ఉపయోగించి నిర్దిష్ట ప్రాంతాల్లో వేడిని ప్రసరింపజేశారు. ఆ వేడికి పొడి పదార్థంలోని చిన్న చిన్న కణాలు ఒకదానితో మరొకటి అతుక్కుని గట్టిపడ్డాయి. ఈ ప్రక్రియను సింటరింగ్ అని అంటారు. ఇలా ఒక్కో పొరను తయారు చేస్తూ క్రమంగా వివిధ ఆకారాల్లో నిర్మాన బ్లాకులను తయారు చేశారు.
చంద్రుడి మీద ఉండే మట్టికి, భూమిపై ఉండే మట్టికి చాలా తేడా ఉంటుంది. నిజానికి చంద్రుడి మీద ఉండేది మట్టి కాదు.. దూళి. కోట్లాది సంవత్సరాలుగా ఉల్కలు, చిన్న చిన్న గ్రహశకలాలు చంద్రుడిని ఢీకొట్టడం వల్ల దాని ఉపరితలంపై ఎక్కువగా దూళి పేరుకుపోయింది. ఇది దూళిలో భూమి మీద ఉండే మట్టిలోని సేంద్రీయ పదార్థాలు ఉండవు. మట్టి తరహాలో ముద్దగా ఏర్పడవు. అందుకే పరిశోధనలో లేజర్ టెక్నాలజీని ఉపయోగించారు.
ఇటుకలు ఒకదాన్ని ఒకటి అతుక్కోవాలంటే సిమెంట్ అవసరం. లేదా ఏదైనా రసాయానిక జిగురులతో కూడా అతికించవచ్చు. అయితే, పరిశోధకులు చేసిన ఈ ఇటుకలతో వాటితో పనిలేదు. ఎందుకంటే.. వీటిని లెగో స్టైల్‌లో రూపొందించారు. వీటిలో క్రాస్ (X), హెచ్(H) ఆకారంలో బ్లాకులు ఉంటాయి. వాటిని క్రమ పద్దతిలో కలిపితే చాలు.. నిర్మాణం పూర్తవుతుంది. చూడటానికి అవి పిల్లలు ఆడుకొనే లెగో బొమ్మల బ్లాకుల్లాగానే ఉంటాయి.
ఈ ఇటుకలు వాటి బరువును అవే తట్టుకోగలుగుతున్నాయి. కానీ, ఇతర బరువులను మోయగలిగే అంత బలంగా లేవు. చంద్రుడి వాతావరణాన్ని తట్టుకోవాలంటే.. నిర్మాణాలపై బరువైన పైకప్పులు ఉండాలి. అక్కడ భూమి తరహాలో వాతావరణ పీడనం ఉండదు. గురుత్వాకర్షణ శక్తి కూడా భూమితో పోల్చితే చాలా తక్కువ. ఈ పరిస్థితుల్లో లేజర్ ద్వారా మట్టిని గట్టిపరిచే ప్రక్రియ అక్కడ ఎలా పనిచేస్తుందనేది పెద్ద ప్రశ్న. ఈ మేరకు అక్కడ కొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. ఇది ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ అంతరిక్ష పరిశోధనల్లో ఇది కీలక ముందడుగా భావిస్తున్నారు. మున్ముందు ఈ బ్లాక్‌లను మరింత స్ట్రాంగ్‌గా తయారు చేసేందుకు అవసరమైన మార్గాలు అన్వేషించి, గుడ్ న్యూస్ చెబుతారని ఆశిద్దాం.
Also Read: 1911లో చనిపోయిన దొంగ.. 66 ఏళ్లుగా ఆ శవాన్ని పూడ్చలేదు.. కాల్చలేదు, చివరికి..