Chandrayan -3 : భారత్ అంతరిక్ష ప్రయోగ సంస్థ – ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ చంద్రునిపై నీటి ఆనవాళ్లకు సంబంధించి మరో అద్భుత విషయాన్ని కనుక్కుంది. ఇప్పటికే చంద్రుని ఉపరితలంపై నీటి అనవాళ్లను గుర్తించిన చంద్రయాన్-1కు కొనసాగింపుగా ప్రయోగించిన చేపట్టిన ప్రయోగంలో.. చంద్రుడి ధ్రువాల దగ్గర గతంలో అనుకున్నదాని కంటే ఎక్కువ మొత్తంలో, విస్తృతమైన మంచు ఉనికి ఉన్నట్లుగా గుర్తించింది. ఉష్ణోగ్రతలలోని వైవిధ్యాలు మంచు నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయని చెబుతున్న శాస్త్రవేత్తలు, చంద్రుని భౌగోళిక చరిత్ర, భవిష్యత్తులో చంద్రుడిపై చేపట్టే అన్వేషణలకు ఈ సమాచారం బాగా ఉపయోగపడుతుందని వెల్లడిస్తున్నారు.
చంద్రయాన్-3 మిషన్ నుంచి వచ్చిన డేటాను సునిశితంగా పరిశీలిన చేసిన శాస్త్రవేత్తలు.. గతంలో అంచనా వేసిన దానికంటే చంద్రుని ఉపరితలం క్రింద, ధ్రువాల దగ్గర ఎక్కువ ప్రదేశాలలో మంచు ఉండవచ్చని అభిప్రాయ పడుతున్నారు. ఈ పరిశోధనా ఫలితాల్ని కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌లో ప్రచురించారు. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు ఈ మంచు కణాలను పరిశీలించడం ద్వారా చంద్రుని ప్రారంభ భౌగోళిక చరిత్రపై అవగాహనకు ఉపయోగపడతాయని అంటున్నారు. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌లోని ‘ChaSTE’ ప్రోబ్ ద్వారా నమోదు చేసిన చంద్ర ఉపరితలం క్రింద 10 సెంటీమీటర్ల లోతులో తీసుకున్న ఉష్ణోగ్రత రీడింగులను ఈ అధ్యయనం విశ్లేషించింది. బెంగళూరు నుంచి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో.. ప్రయోగించిన చంద్రయాన్-3, ఆగస్టు 23, 2023న చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ అయ్యింది. ఈ పాయింట్ కు ప్రధాని నరేంద్ర మోదీ ‘శివశక్తి పాయింట్’ అని పేరు పెట్టారు.
పరిశోధక ల్యాండింగ్ ప్రదేశంలో చంద్రుని ఉపరితల ఉష్ణోగ్రతలు నాటకీయంగా మారుతుంటాయి. ఇక్కడ పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 82 డిగ్రీల సెల్సియస్ లు ఉంటుండగా, రాత్రిపూట -170 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయని పరిశోధనా బృందం కనుగొంది. ల్యాండింగ్ పాయింట్ నుంచి కేవలం ఒక మీటరు దూరంలోని చదునైన ఉపరితలంపై గరిష్ట ఉష్ణోగ్రతలు 60 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు తెలిసింది. అయితే.. ఉష్ణోగ్రతలలో వ్యత్యాసం ల్యాండింగ్ ప్రదేశంలో స్వల్ప వంపుపై ఉండటం వల్ల జరిగిందని, ఇది సౌర వికిరణానికి గురికావడంతో ఉష్ట్రోగ్రత ఎక్కువగా చూపించిందని పరిశోధకులు తెలిపారు. దీనితో పరిశోధకులు చంద్ర అక్షాంశాల వద్ద ఉపరితల ఉష్ణోగ్రతలను.. వాలు కోణాలు ఎలా ప్రభావితం చేస్తాయో అంచనా వేసే నమూనాను అభివృద్ధి చేశారు. సూర్యుని నుంచి 14 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ కోణంలో ఉన్న వాలులు ఉపరితలం దగ్గర మంచు పేరుకుపోయేంత చల్లగా ఉండవచ్చని వారి పరిశోధనలు సూచిస్తున్నాయి.
భవిష్యత్ చంద్ర కార్యకలాపాలకు చిక్కులు
ఈ అధ్యయన ఫలితాలు భవిష్యత్ చంద్ర అన్వేషణ ప్రయోగాలపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుందని అంటున్నారు. వీటిలో.. NASA ప్రయోగించే ఆర్టెమిస్ మిషన్లు కూడా ఉన్నాయి. ఇవి చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర వ్యోమగాములను దింపడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. మంచు గతంలో ఊహించిన దానికంటే విస్తృతంగా ఉండడతో.. భవిష్యత్తులో మానవ అన్వేషణ, నివాసానికి కీలకమైన వనరుగా ఉపయోగపడుతుందని పరిశోధకులు ఆశిస్తున్నారు. అయితే, చంద్రునిపై వాతావరణ పీడనం చాలా తక్కువగా ఉండటం వల్ల ద్రవ రూపంలో నీరు ఉండదని అంటున్నారు. అంటే మంచు ద్రవ రూపంలోకి కరగడానికి బదులుగా నేరుగా ఆవిరిలోకి ఉత్పతనం అవుతుంది.
Also Read : Madhya Pradesh fort : ఛావా సినిమా ఎఫెక్ట్ – కోటను తవ్వేస్తున్న స్థానిక గ్రామాల ప్రజలు