Janasena Party: పిఠాపురం వేదికగా జనసేన పార్టీ ఘనంగా నిర్వహించనున్న 12వ ఆవిర్భావ సభ 14 వ తేదీన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే జనసేన ప్రధాన నేతలు సిద్దమవుతున్నారు. పలుమార్లు మంత్రి నాదెండ్ల మనోహర్ సభ ఏర్పాట్లను పరిశీలించి, పలు సూచనలు చేశారు. అయితే ఆవిర్భావ సభ సంధర్భంగా వినూత్న కార్యక్రమానికి జనసేన శ్రీకారం చుట్టింది.
జనసేనలో జనసైనికులతో పాటు సమానంగా జనసేన వీర మహిళలు కూడా ఉన్నారు. వీరు ఎన్నికల సమయంలో పార్టీకి చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. అందుకే పార్టీలో వీర మహిళలకు అధిక ప్రాధన్యత కల్పిస్తారు. వైసీపీ నుండి వచ్చే విమర్శలను తిప్పికొట్టడంలో ఎందరో వీరమహిళలు ఎప్పుడూ ముందుంటారు. అందుకే పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణకు వీరమహిళల పాత్ర అత్యంత కీలకమని జనసేన పీఏసి చైర్మన్ మనోహర్ అన్నారు. అయితే సభకు మహిళలను ఆహ్వానించే భాద్యతను వీరమహిళలకు పార్టీ అప్పగించింది.
కాకినాడ కంట్రోల్ రూమ్ లో ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ సభ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఆ తర్వాత మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వీర మహిళలు ఇంటింటికీ వెళ్లి, మహిళలను ఆహ్వానించాలన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం బొట్టు పెట్టి మరీ సభకు ఆహ్వానించాలని మనోహర్ కోరారు. అలాగే ఆహ్వాన పత్రికను అందించి పార్టీ సిద్దాంతాలను వివరించాలని కోరారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరపున ఆహ్వానించాలని, మహిళా శక్తి చాటిచెబుతూ మహిళలు అధిక సంఖ్యలో సభకు హాజరయ్యేలా చూడాలన్నారు.
నాదెండ్ల మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు గత ఐదేళ్లు దుర్మార్గంగా పాలించారన్నారు. సొంత ఆస్తులను పెంచుకోవడానికి ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారణి తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న గ్రావెల్ ను ఏ విధంగా దోచుకున్నారో… గ్రావెల్ కోసం శాసనసభ్యులు ఏ విధంగా కొట్టుకున్నారో మనందరం చూశామని విమర్శించారు. స్థానిక వైసీపీ నాయకులు గ్రావెల్ పై వచ్చిన సంపాదన గురించి ఆలోచించారు తప్ప.. యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన చేయలేదని మనోహర్ పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని అన్నారు. అనంతరం పార్టీ నాయకులకు ఆవిర్భావ సభ విజయవంతం చేయడంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
అయితే ఆవిర్భావ సభలో పవన్ ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి నాయకులకు పవన్ ఎటువంటి సూచనలు చేస్తారన్నది చర్చ సాగుతోంది. అయితే నాదెండ్ల మనోహర్ గత కొద్ది రోజులుగా సభ నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ పిఠాపురంలో మకాం వేశారు. ఇప్పటికే సభ నిర్వహణ భాద్యతలను పార్టీ శ్రేణులకు అప్పగించిన అధిష్టానం, ఈ సభ ద్వారా జనసేన సత్తా చూపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా సభకు వచ్చే వారికి ఏ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు సాగుతున్నాయి. సభ నిర్వహణ పిఠాపురంలో సాగుతుండగా, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.