Cheap Powerbanks : పవర్ బ్యాంక్.. స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా ఉపయోగించే ప్రతీ ఒక్కరికీ ఎంతగానో ఉపయోగపడే సాధనం. మరి ఈ పవర్ బ్యాంక్స్ లో సైతం టాప్ బ్రండ్ కంపెనీలకు చెందినవి ఎన్నో ఉన్నాయి. అయితే వీటిలో నాసిరకం కూడా అన్నే ఉన్నాయి. ముఖ్యంగా చైనా ఎన్నో పవర్ బ్యాంక్స్ ను తక్కువ రేటుకే మార్కెట్లోకి లాంఛ్ చేసింది. వీటికి ఉన్న డిమాండ్ కూడా ఎక్కువే. అయితే తాజాగా భారత్ ప్రభుత్వం ఈ పవర్ బ్యాంక్స్ పై షాకింగ్ విషయాలు వెల్లడించింది.
చైనాకు చెందిన నాసిరకం పవర్ బ్యాంక్‌లపై భారత ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకుంది. ఇప్పటికే 50శాతానికి పైగా వాటా ఉన్న రెండు ప్రధాన చైనీస్ పవర్ బ్యాంక్ సరఫరా కంపెనీలను నిషేధించింది. తాజాగా మరో కంపెనీ పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో చైనా తీసుకొచ్చే నాసిరకం పవర్ బ్యాంక్స్ తో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది.
చైనా నుంచి భారత్ లోకి లిథియం బ్యాటరీలను దిగుమతి చేసే రెండు ప్రధాన కంపెనీలపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక భారత్లోకి చైనా నుండి నాసిరకం నాణ్యతలేని పవర్ బ్యాంక్‌ల విక్రయాలు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వీటిలో చాలా పవర్ బ్యాంక్‌లు నిర్దిష్ట సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని… అయితే వాస్తవానికి అవి తయారీదారులు ప్రకటించే వాటిలో 50 60% మాత్రమే నాణ్యతతో ఉన్నాయని తెలిపింది.
భారతీయ కంపెనీలు చైనీస్ సరఫరాదారుల నుండి తక్కువ ధరలకు ఈ సబ్‌పార్ బ్యాటరీలను కొనుగోలు చేస్తున్నారని.. దీంతో చౌకైన ఉత్పత్తులను విక్రయించడానికి, మార్కెట్లో అసమర్థ గ్యాడ్జెట్స్ అమ్మకానికి సహాయపడుతున్నాయని తెలిపింది. ఇది భద్రతా లోపాన్ని పెంచటమే కాకుండా కస్టమర్స్ ను సైతం తప్పుదారి పట్టిస్తున్నాయని తెలిపింది.
ఇక తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) రెండు చైనీస్ బ్యాటరీ కంపెనీలను రద్దు చేశాయి. వాటిలో గ్వాంగ్‌డాంగ్ క్వాసన్ న్యూ ఎనర్జీ టెక్నాలజీ, గన్‌జౌ నావెల్ బ్యాటరీ టెక్నాలజీ ఉన్నాయి. వీటి రిజిస్ట్రేషన్‌లను సైతం రద్దు చేసింది. ఇక మూడవ కంపెనీ Ganzhou TaoYuan New Energy ప్రస్తుతం పరిశీలనలో ఉంది. .
ఈ పవర్ బ్యాంక్‌లు వాటి ప్రకటన సామర్థ్యాలకు అనుగుణంగా లేవని.. 10K మిల్లీ ఆంపియర్ (mAh) సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు చెప్పుకునే కొన్ని పవర్ బ్యాంక్‌లు వాస్తవానికి 4000 నుండి 5,000 mAhని మాత్రమే కలిగి ఉన్నాయని తెలిపింది. కొన్ని కంపెనీలు అధిక నాణ్యతా ప్రమాణాలు ఉన్నట్లు నమ్మిస్తున్నాయని.. అందుకే వాటికి అనుమతులు లభిస్తున్నాయని కానీ వాస్తవానికి పరిస్థితి వేరే విధంగా ఉందని తెలిపింది. ఇక భారత్ లో బ్రాండ్‌లకు తక్కువ నాణ్యత బ్యాటరీలను విక్రయించడానికి ఈ ఆమోదాలను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. వీటి ధర అసలు ధరతో పోలిస్తే 25% వరకు వ్యత్యాసం ఉండటంతో వినియోగదారులు తెలియకుండానే నాసిరకం ఉత్పత్తులకు డబ్బులు చెల్లిస్తున్నట్లు తెలుస్తుంది. వీటిని సైతం తేలికగా గుర్తించవచ్చు. నాణ్యమైన 10,000 mAh పవర్ బ్యాంక్ ధర రూ. 1,000 కంటే ఎక్కువగా ఉంటుంది. అనేక చౌకైన ఎంపికలు రూ. 600 లోపు అందుబాటులో ఉన్నాయి.
ALSO READ : 5000mah బ్యాటరీ మెుబైల్స్ కావాలా! టాప్ ఆఫ్షన్స్ ఇవే