Crew Dragon Sea Landing | భారత సంతతికి చెందిన అమెరికా అంతరిక్ష వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో ముగ్దురు ప్రయాణికులతో కూడిన క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌక భూగ్రహంలో అమెరికా సమీపంలోని సముద్రంలో దిగింది. ఈ ల్యాండింగ్ కోసం నేలను కాకుండా సముద్రాన్ని నాసా ఎందుకు ఎంచుకుందన్న ప్రశ్న ఇప్పుడు అందరికీ కలుగుతోంది. దీనికి అనేక కారణాలున్నాయి. అంతరిక్ష యాత్రలు ముగించుకొని భూమికి తిరిగి వచ్చే అంతరిక్ష నౌకల ల్యాండింగ్ విషయంలో ప్రతి దేశం తనదైన విధానాన్ని అనుసరిస్తుంది. రష్యా తన స్పేస్ క్యాప్సూళ్లను భూమిపై దించుతుండగా, అమెరికా సముద్రంలో దించుతోంది.
అంతరిక్ష నౌకలను సురక్షితంగా దించడానికి అనువైన సముద్ర ప్రాంతాలు లేకపోవడంతో రష్యా భూమిపైనే ల్యాండింగ్ నిర్వహిస్తోంది. ఆ దేశానికి ల్యాండింగ్ కోసం అనువైన బేరెంట్స్ సముద్రం, లాప్టెవ్ సముద్రం, తూర్పు సైబీరియా సముద్రం వంటి ప్రాంతాలున్నాయి. అయితే ఆ ప్రాంతాల వాతావరణ పరిస్థితులు అంతరిక్ష నౌకల ల్యాండింగ్ కు అనుకూలంగా లేవు. ఆ ప్రాంతాల్లో నీరు చాలా చల్లగా ఉంటుంది. ఒకవేళ అంతరిక్ష నౌకలోకి నీరు ప్రవేశిస్తే, అంతరిక్ష యాత్రికులు గడ్డకట్టుకుపోతారు. అంతరిక్ష నౌకను బయటకు తీయడం కూడా సహాయ బృందాలకు కష్టమవుతుంది. కొన్ని ప్రాంతాలు అనుకూలంగా ఉన్నప్పటికీ.. అవి అంతర్జాతీయ సరిహద్దులకు దగ్గరగా ఉండడంతో రష్యా ఆ ప్రాంతాల్లో ల్యాండింగ్ చేయడానికి ఇష్టపడటం లేదు. మరోవైపు, ఆ దేశంలో జనావాసాలు లేని భూభాగాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ల్యాండింగ్ కోసం వాటిని ఉపయోగించుకుంటోంది. రెట్రో రాకెట్లు, పారాచూట్ల సహాయంతో అంతరిక్ష నౌక వేగాన్ని తగ్గించి, నెమ్మదిగా భూమిపై దించుతోంది. చైనా కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తూ ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో భూమిపై ల్యాండింగ్ నిర్వహిస్తోంది.
Also Read: బుచ్ విల్మోర్.. అంతరిక్షంలో సునీతా విలియమ్స్‌కు తోడుగా నిలబడ్డ హీరో..
సముద్రాల్లో ల్యాండింగ్ చేస్తున్న అమెరికా
అనుకూల సముద్రాలు ఉన్నాయి కదా..: భౌగోళికంగా తనకున్న సౌకర్యాల కారణంగా అమెరికా సముద్రాల్లో ల్యాండింగ్ ను ఎంచుకుంటోంది. భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించాక, పారాచూట్ల సహాయంతో వేగాన్ని తగ్గించుకొని, అంతరిక్ష యాత్రికులకు హాని కలుగుకుండా సముద్రంలో ల్యాండింగ్ చేయడం సాధ్యమవుతుందని, చివరి దశలో ప్రత్యేక ఇంజిన్లను ఉపయోగించాల్సిన అవసరం లేదన్న నిర్ణయానికి అమెరికా వచ్చింది. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలు దగ్గరలో ఉండటం, అక్కడ తమ నౌకాదళం భారీగా మోహరించి ఉండటం వంటి కారణాల వల్ల భూమిపై దించే ఆలోచనను అమెరికా వదులుకుంది. 2011 వరకు ఆ దేశానికి సేవలందించిన స్పేస్ షటిళ్లు మాత్రమే రన్ వేలపై విమానాల్లా దిగాయి. గతంలో జెమినీ, అపోలో, మెర్క్యూరీ.. ఇప్పుడు క్రూ డ్రాగన్ వంటి స్పేస్ క్యాప్సూళ్లు సముద్రాల్లోనే ల్యాండ్ అవుతున్నాయి. గగన్ యాన్ పేరుతో మానవసహిత అంతరిక్ష యాత్ర చేపట్టబోతున్న భారత్ కూడా ఇదే పద్ధతిలో సముద్ర ల్యాండింగ్ ను ఎంచుకుంది.
సముద్రంలో ల్యాండింగ్‌తో ప్రయోజనాలు..
కుషన్ లా ఉపయోగపడే సముద్రం
..: నీటి సాంద్రత, స్నిగ్ధత తక్కువగా ఉండటం వల్ల, ల్యాండైన అంతరిక్ష నౌకకు కుషన్ లా పనిచేస్తుంది. అందువల్ల అంతరిక్ష నౌక దెబ్బతినే ప్రమాదం చాలా తక్కువ.
టార్గెట్ ల్యాండింగ్ సమస్య లేదు
సముద్రం విశాలంగా ఉండటం వల్ల, అత్యంత ఖచ్చితమైన ప్రదేశంలో ల్యాండింగ్ అయ్యే అవకాశం లేని అంతరిక్ష నౌకలకు ఇది ప్రయోజనకరం. అది నిర్దేశిత ప్రదేశంలో కాకుండా కొంచెం పక్కకు మళ్లినా సమస్య ఉండదు.
నీటిలో నుంచి బయటకు తీయడం సులభం
ల్యాండింగ్ తర్వాత సహాయ బృందాలు సులభంగా అంతరిక్ష నౌక ఉన్న ప్రదేశానికి చేరుకోవచ్చు. అంతరిక్ష యాత్రికులను సురక్షితంగా బయటకు తీసుకురావచ్చు.