Crispy pasta namkeen recipe: సాయంత్రం అయిందంటే.. పిల్లల నుంచి పెద్దల వరకు ఏదైనా కరకరలాడే స్నాక్స్ తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. బయట కొనే జంక్ ఫుడ్‌కు బదులుగా ఇంట్లోనే పరిశుభ్రంగా రుచికరమైన స్నాక్స్ తయారు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటి వాటిలో ‘కుర్కురే పాస్తా నమ్‌కీన్’ ఒకటి. వీటిని తక్కువ టైంలో ఈజీగా తయారు చేసుకోవచ్చు. కేవలం కొన్ని పదార్థాలతో ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉండే ఈ స్నాక్ తయారీ విధానం గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం.
పాస్తా- 1 కప్పు
శనగపిండి లేదా మైదా – 2 స్పూన్లు
బియ్యం పిండి – 2 స్పూన్లు (క్రిస్పీగా రావడానికి)
కారం – 1 స్పూన్
చాట్ మసాలా – అర స్పూన్
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
నూనె – వేయించడానికి సరిపడా
కరివేపాకు – కొద్దిగా
1. ముందుగా ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి మరగబెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో కొద్దిగా ఉప్పు, కొన్ని చుక్కల నూనె వేయాలి.ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు పాస్తాను ఆ నీటిలో వేసి ఉడికించాలి. పాస్తా పూర్తిగా మెత్తగా ఉడికిపోకూడదు. సుమారు 70 నుంచి 80 శాతం మాత్రమే ఉడికేలా చూసుకోవాలి. ఎక్కువ ఉడికితే.. నూనెలో వేసేటప్పుడు మెత్తబడిపోతాయి. ఉడికిన తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి, పాస్తాను కొద్దిసేపు ఆరబెట్టాలి.
2. వడకట్టిన పాస్తా కొద్దిగా చల్లారిన తర్వాత, ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. అందులో బియ్యం పిండి, శనగపిండి లేదా మైదా పిండి, చిటికెడు పసుపు ,తగినంత ఉప్పు వేయాలి. పిండి అంతా పాస్తాకు చక్కగా పట్టేలా చేతితో మెల్లగా కలపాలి. కావాలనుకుంటే.. కొద్దిగా నీటిని చిలకరించుకోవచ్చు, కానీ పాస్తా పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఈ కోటింగ్ వల్లనే పాస్తా నమ్‌కీన్ చాలా కరకరలాడుతూ వస్తుంది.
3. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరి పడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత, మనం కోట్ చేసి పెట్టుకున్న పాస్తాను కొద్ది కొద్దిగా నూనెలో వేయాలి. మంటను మీడియం లేదా హై ఫ్లేమ్‌లో ఉంచి బంగారు రంగు వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేయాలి. పాస్తా నూనెలో.. వేగిన తర్వాత మంచి రంగులోకి మారుతుంది. ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పాస్తా మొత్తాన్ని వేయించుకోవాలి. పాస్తా వేడిగా ఉన్నప్పుడే.. అందులో కారం, చాట్ మసాలా , కొద్దిగా నల్ల ఉప్పు వేయాలి. మసాలాలు పాస్తాకు బాగా పట్టేలా గిన్నెను ఒకసారి బాగా కదిలించాలి. చివరగా అదే నూనెలో కొద్దిగా కరివేపాకును ఫ్రై చేసి కలుపుకుంటే మంచి సువాసన వస్తుంది.
Also Read: స్వీట్ హౌస్ స్టైల్ బ్రెడ్ హల్వా..ఇంట్లోనే ఇలా టేస్టీగా రెడీ చేయండి
ఈ కుర్కురే పాస్తా నమ్‌కీన్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా చేస్తే దాదాపు 15 నుంచి 20 రోజుల వరకు ఇవి మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయి.
సాయంత్రం టీ సమయంలో.. పిల్లలకు ఏదైనా కొత్తగా చేసి పెట్టాలనుకుంటే ఈ కుర్కురే పాస్తా నమ్‌కీన్ బెస్ట్ ఆప్ష్ అని చెప్పొచ్చు. తక్కువ ఖర్చుతో, క్షణాల్లో తయారయ్యే ఈ స్నాక్‌ను మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీటి రుచికి ఎవ్వరైనా ఫిదా అయిపోతారు!