Packers and movers Damage goods| ఇల్లు మారేటప్పుడు సామాన్లు జాగ్రత్తగా తరలించడం చాలా ముఖ్యం. ఇందుకోసం చాలామంది ప్యాకర్స్ అండ్ మూవర్స్ సేవలను ఉపయోగిస్తారు. అయితే, డబ్బులు చెల్లించినా సామాన్లు సురక్షితంగా చేరుతాయనే గ్యారంటీ లేదు. ఢిల్లీ నుంచి నాగాలాండ్‌కు ఇల్లు మారిన ఓ మహిళకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఆమె వస్తువులు ఆలస్యంగా చేరడమే కాకుండా, కొన్ని ధ్వంసమయ్యాయి. మరో 23 వస్తువులు అసలు కనిపించలేదు. దీంతో ఆమె వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి పరిహారం పొందారు.
మిస్ లాంగ్‌చార్ అనే మహిళ 2020 సెప్టెంబర్‌లో అర్బన్ కంపెనీ ద్వారా ప్యాకర్స్ అండ్ మూవర్స్ సేవలను బుక్ చేసుకున్నారు. సెప్టెంబర్ 26న ఆమె ఇంటి సామాన్లు, కారు తరలించేందుకు అప్పగించారు. రెండు వారాల్లోగా వస్తువులు నాగాలాండ్‌లోని దిమాపూర్‌కు చేరుస్తామని అర్బన్ కంపెనీ హామీ ఇచ్చింది. రవాణా సమయంలో వస్తువులు దెబ్బతిన్నా, పోయినా బాధ్యత తీసుకుంటామని తెలిపింది. అయితే, ఆమె కారు దాదాపు నెల రోజుల తరువాత అక్టోబర్ 23న చేరింది. ఇంటి సామాన్లు నవంబర్ 19న మాత్రమే డెలివరీ అయ్యాయి. పైగా మొత్తం 93 వస్తువుల్లో కేవలం 70 మాత్రమే అందాయి. మిగిలిన 23 వస్తువులు కనిపించలేదు.
Also Read: రాష్ట్రం మారితే మద్యం ధర ఎందుకు మారుతుంది? అత్యంత తక్కువ ధర రాష్ట్రాలు ఇవే
సామాన్లు విప్పి చూసినప్పుడు ఆమెకు మరో షాక్ ఎదురైంది. ఏసీ పూర్తిగా దెబ్బతిని, మరమ్మతులకు కూడా పనికిరాకుండా పోయింది. ఎల్ఈడీ టీవీతో పాటు క్రాకరీ, వంట సామాన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా విరిగిపోయాయి. ఫిర్యాదు చేసినప్పటికీ కంపెనీ తొలుత బాధ్యత తీసుకోలేదని ఆమె ఆరోపించారు. చివరకు దెబ్బతిన్న ఏసీకి రూ.25,000 చెల్లిస్తామని అంగీకరించింది. మిగిలిన వస్తువులను కొరియర్ ద్వారా పంపిస్తామని హామీ ఇచ్చింది. కానీ అవి కూడా చేరలేదు.
Also Read: స్టేజ్‌పై మాట్లాడేటప్పుడు చేతులు, కాళ్లు వణుకుతున్నాయా? మీ కాన్ఫిడెన్స్ పెంచేందుకు ఈజీ టిప్స్
దీంతో ఆమె దక్షిణ ఢిల్లీ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆశ్రయించారు. సేవలకు చెల్లించిన రూ.1.15 లక్షలతో పాటు నష్టపరిహారం కోరారు. మొత్తం రూ.7.75 లక్షలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ కంపెనీ విచారణకు హాజరు కాలేదు. అర్బన్ కంపెనీ మాత్రం తాము కేవలం సేవలు అందించే సంస్థలకు, వినియోగదారులకు మధ్య వేదికగా పనిచేస్తామని వాదించింది. అయితే, సంస్థ వెబ్‌సైట్‌లో మూవర్స్‌కు 4.45 రేటింగ్ ఉండటాన్ని కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. వినియోగదారులు ఆ రేటింగ్ ఆధారంగా సేవలను ఎంచుకున్నందున అర్బన్ కంపెనీ బాధ్యత నుంచి తప్పించుకోలేదని స్పష్టం చేసింది.
మూవర్స్ కంపెనీ రూ.3 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. అర్బన్ కంపెనీ మానసిక వేదన, వేధింపులు, న్యాయపరమైన ఖర్చుల కోసం మరో రూ.50,000 చెల్లించాలని తెలిపింది. మూడు నెలల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది.
సామాన్ల జాబితాను వాటి పరిస్థితితో సహా రాతపూర్వకంగా తీసుకోవాలి. చెల్లింపుల రసీదులు, ఒప్పందం, రవాణా రసీదు, బీమా పత్రాలను భద్రపరచాలి. సామాన్లు తరలించే ముందు ఫొటోలు తీసుకోవాలి. వస్తువులు దెబ్బతిన్నా, కనిపించకపోయినా వెంటనే సంస్థకు ఫిర్యాదు చేయాలి. జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ 1915కు ఫోన్ చేయవచ్చు. అవసరమైతే జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించవచ్చు.
ఇంటి సామాన్లు తరలించే ముందు సరైన పత్రాలు తీసుకోవడం మీ హక్కులను కాపాడుతుంది.