Cyber Crime: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. సైబర్ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కష్టపడి సంపాదించిన డబ్బు క్షణాల్లో మాయం అవుతోంది. ఇలా మోసపోయిన వారిలో కొంత మందికి బయటికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నవాళ్లు కూడా ఉన్నారు. అయితే, సైబర్ మోసానికి గురైతే డబ్బులు పోయాయని నిరాశ చెందుతూ అలా ఉండిపోకుండా.. వెంటనే కొన్ని పనులు చేస్తే మీ డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
మొదటగా చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయడం. మోసం జరిగిన వెంటనే, ముఖ్యంగా మొదటి కొన్ని గంటల్లో దీన్ని ‘గోల్డెన్ అవర్’ అంటారు. ఈ సమయంలో ఫిర్యాదు చేస్తే మోసగాళ్లు ఆ డబ్బును వేరే ఖాతాలకు బదిలీ చేయకముందే బ్యాంకులు ఆ ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేయడానికి అవకాశం ఉంటుంది.
అలాగే, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ వివరాలతో పూర్తి ఫిర్యాదును నమోదు చేయాలి. అక్కడ జరిగిన మోసానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు, లావాదేవీల వివరాలు, మోసగాళ్ల ఫోన్ నంబర్లు వంటి ఆధారాలను కచ్చితంగా అప్‌లోడ్ చేయాలి. ఈ ఆన్‌లైన్ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు తదుపరి దర్యాప్తు వేగంగా ప్రారంభిస్తారు.
Also Read: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలంటే.. ఈ సెట్టింగ్స్ మార్చుకోవాల్సిందే!
మీ డబ్బు ఏ బ్యాంకు ఖాతా నుంచి కట్ అయిందో ఆ వెంటనే మీ బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వాలి. మోసం జరిగిన విషయాన్ని వారికి రాతపూర్వకంగా తెలియజేస్తే.. వారు స్పందించి ఆ తదుపరి లావాదేవీలను నిలిపివేస్తారు. అలాగే, ఏ లావాదేవీ ద్వారా డబ్బు పోయిందో ఆ యూపీఐ యాప్ లేదా క్రెడిట్/డెబిట్ కార్డ్ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయడం కూడా మరచిపోవద్దు.
కేవలం ఆన్‌లైన్ ఫిర్యాదుతో సరిపెట్టకుండా మీ దగ్గర్లోని పోలీసు స్టేషన్‌లోని సైబర్ క్రైమ్ విభాగాన్ని నేరుగా సంప్రదించడం మంచిది. పోలీసులు ఇచ్చే ఎఫ్ఐఆర్ కాపీ భవిష్యత్తులో బ్యాంకుల నుంచి డబ్బును క్లెయిమ్ చేసుకోవడానికి లేదా కోర్టు ప్రక్రియకు చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఇలా సకాలంలో స్పందిస్తే మీ డబ్బు వెనక్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ఎవరికీ వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు చెప్పకపోవడమే అత్యుత్తమ రక్షణ. ఎలాంటి అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకూడదు. ఒకవేళ పొరపాటున మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా పైన పేర్కొన్న మార్గాలను అనుసరిస్తే మీ డబ్బును సురక్షితంగా రక్షించుకునే అవకాశం లభిస్తుంది.
Also Read: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక Passkeysను ఇలా ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు!