Delivery otp scam 2026: రోజురోజుకు సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు. మనం ఎలాంటి ఆన్‌లైన్ షాపింగ్ చేయకపోయినా, ఆర్డర్ పెట్టకపోయినా సడన్‌గా ఓ కొరియర్ బాయ్ నుంచి ఫోన్ రావడం, మీ కోసం పార్శిల్ వచ్చిందని చెప్పడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఆ ఉత్సాహంలో మనం ఇచ్చే చిన్న పొరపాటు లేదా ఒక్క ఓటీపీ మన బ్యాంకు అకౌంట్‌ను పూర్తిగా ఖాళీ చేసేయగలదు. అసలు ఈ కొత్త తరహా డెలివరీ మోసాలు ఎలా జరుగుతాయి? వాటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ స్కామ్‌కు పాల్పడే కేటుగాళ్లు డార్క్ వెబ్ లేదా ఇతర డేటా లీక్స్ ద్వారా మన ఫోన్ నంబర్లు, పేర్లు, అడ్రస్‌లను సంపాదిస్తారు. ఆ తర్వాత.. ఏదో ఒక ప్రైవేట్ కొరియర్ సర్వీస్ పేరుతో మనల్ని ఫోన్ ద్వారా మభ్యపెడతారు. మనం నిజమేనని నమ్మి ఆ పార్శిల్ తీసుకోవడానికి సిద్ధపడతాం. అప్పుడు వారు ఓటీపీ అడుగుతారు. ఆ ఓటీపీ చెప్పగానే.. మన ప్రమేయం లేకుండానే మన అకౌంట్ లోని డబ్బులు మాయం కావడం లేదా మన పేరు మీద ఫేక్ లోన్లు తీసుకోవడం జరుగుతుంది.
ఈ తరహా మోసాల వల్ల సామాన్యులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఒక్కో సారి ఈ సైబర్ కేటుగాళ్లు సృష్టించే ఫేక్ పార్శిళ్ల విలువ బహిరంగ మార్కెట్లో రూ. 500 నుంచి రూ.2,000 వరకు ఉండే సాధారణ వస్తువుల లాగా కనిపిస్తాయి (ఉదాహరణకు క్యాష్ ఆన్ డెలివరీ పేరుతో.. రూ.999 లేదా రూ.1,499 వసూలు చేయడం). కానీ ఓటీపీ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా వీరు మన బ్యాంక్ అకౌంట్ లేదా క్రెడిట్ కార్డ్ నుంచి ఏకంగా రూ. 10,000 నుంచి రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని దోచుకుంటున్నారు. కొన్ని సార్లు లోన్ యాప్స్ ద్వారా మనల్ని ఇరికించి రూ 1,00,000 వరకు నష్టం కలిగిస్తున్నారు.
Also Read: పవర్ బ్యాంక్ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!
ఆర్డర్ : మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఎక్కడా ఏ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లోనూ వస్తువును ఆర్డర్ చేయనప్పుడు వచ్చే డెలివరీ కాల్స్‌ను వెంటనే కట్ చేయండి.
OTP చెప్పకండి: ఎట్టి పరిస్థితుల్లోనూ.. కొరియర్ బాయ్స్‌కి ఫోన్ కాల్‌లో ఓటీపీ చెప్పొద్దు. అసలు ఆ ఆర్డర్ మీదే కానప్పుడు ఓటీపీ అవసరమే లేదు.
క్యూఆర్ కోడ్ స్కాన్: “డెలివరీ బాయ్ నా దగ్గర మిషన్ లేదు, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేయండి” అంటే అస్సలు నమ్మకండి.
వెరిఫై : నిజంగా ఏదైనా ..ఈ-కామర్స్ సైట్ నుంచి పార్శిల్ వస్తుందంటే.. ఆయా అధికారిక యాప్స్‌లో (అమజాన్, ఫ్లిప్‌కార్ట్ మొదలైనవి)వెళ్లి మీ ఆర్డర్ స్టేటస్ చెక్ చేసుకోండి.
ఒకవేళ పొర పాటున మీరు మోసపోయి డబ్బులు కోల్పోతే.. ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయండి.