భూమి ఎప్పుడు అంతమవుతుందో తెలుసుకోవడానికి అమెరికా అంతరిక్ష సంస్థ NASA, జపాన్ లోని టోహో విశ్వవిద్యాలయ పరిశోధకులు కీలక పరిశోధనలు నిర్వహించారు. సూపర్ కంప్యూటర్ లను ఉపయోగించి ఈ స్టడీ చేశారు. భూమి అంతం గురించి గతంలో ఉన్న అంచనాలతో పోల్చితే ముందుగానే కనుమరుగు అయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. సూపర్ కంప్యూటర్ అంచనా ప్రకారం మానవలు, సూక్ష్మజీవులు రెండూ ఎప్పుడు ఉనికిలో లేకుండా పోతాయో వెల్లడించాయి. ‘భూమి ఆక్సిజన్ వాతావరణం యొక్క భవిష్యత్తు జీవితకాలం’ అనే అధ్యయనం ప్రకారం.. భూమిపై జీవం అనేది సూర్యుడి జీవితకాలం, పరిణామంతో నేరుగా ముడిపడి ఉంది.
బిలియన్ల సంవత్సరాలలో సూర్యుడు మరింత ఎక్కువ వేడిని విడుదల చేస్తాడని పరిశోధకులు అంచనాకు వచ్చారు. ఎక్కువ వేడి కారణంగా నెమ్మదిగా భూమి వాతావరణం ప్రతికూలంగా మారుతుంది. 400,000 కంప్యూటర్ సిమ్యులేషన్ల ఫలితాల అనంతరం 1,000,002,021 సంవత్సరంలో భూగ్రహం నివాసానికి పనికిరాకుండా పోతుందని అంచనాకు వచ్చారు. నెమ్మదిగా భూ ఉపరితలం చాలా వేడిగా మారుతుంది. కనీసం సూక్ష్మజీవులు కూడా తట్టుకోలేవు. ఆ దశలో, మహాసముద్రాలు ఆవిరైపోతాయి. వాతావరణం సన్నగిల్లుతుంది. ఉపరితల ఉష్ణోగ్రతలు జీవి మనుగడను అసాధ్యం చేస్తాయి. అయినప్పటికీ, మానవాళి అంత దూరం వెళ్ళే అవకాశం లేదని పరిశోధకులు వెల్లడించారు.
సూర్యుడి నుంచి నెమ్మదిగా రేడియేషన్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ రేడియేషన్ తీవ్రమైన వాతావరణ, పర్యావరణ మార్పులను ప్రేరేపిస్తుంది. మానవ జీవితం చాలా ముందుగానే ముగియవచ్చని సూపర్ కంప్యూటర్ నమూనాలు అంచనా వేస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తగ్గుతున్న ఆక్సిజన్ స్థాయిలు, క్షీణిస్తున్న గాలి నాణ్యత క్రమంగా గ్రహాన్ని ఉనికి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. వాతావరణ మార్పు, సౌర వికిరణం కారణంగానే ఈ విపత్తు జరిగే అవకాశం ఉన్నట్లు అధ్యయనకారులు వెల్లడించారు.
కరోనల్ మాస్ ఎజెక్షన్లు, సౌర తుఫాన్ల లాంటి సౌర కార్యకలాపాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి భూమి అయస్కాంత క్షేత్రాన్ని దెబ్బతీసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. అదే సమయంలో భూమ్మీద ఉన్న ఆక్సిజన్ ను నెమ్మదిగా తగ్గించనున్నాయి. మానవ ఆధారిత వాతావరణ మార్పుతో కలిపి రికార్డు స్థాయిలో అధిక ప్రపంచ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. వేగంగా మంచు కరగడం ద్వారా గ్రహం నెమ్మదిగా దాని సమతుల్యతను కోల్పోతుంది. “చాలా సంవత్సరాలుగా, భూమి మనుగడ అనేది సూర్యుడి స్థిరమైన వెలుగు మీద ఆధారపడి ఉంటుంది. కానీ, రానున్న రోజుల్లో ఆ ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. సూపర్ కంప్యూటర్ అంచనాలు గతంలో భూమి అంతానికి సుమారు రెండు బిలియన్ సంవత్సరాల జీవితాన్ని ఇచ్చాయి. కానీ, కొత్త నమూనాలు ఆ కాలాన్ని సగానికి తగ్గించాయి. జీవించడానికి ఆక్సిజన్ అవసరమైన ఏ జీవి అయినా భూమ్మీద దాదాపు బిలియన్ సంవత్సరాలలో అంతం అయిపోతుంది” అని ఈ అధ్యయనం ప్రధాన రచయిత కజుమి ఓజాకి వెల్లడించారు.
Read Also: మత్తెక్కించే మాటలతో మాయ చేయనున్న చాట్ జిపిటి.. ఇక ఆటగాళ్లకు పండగే!