Gadgets Price Cut: ఈ మధ్య కాలంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో టెక్ యుద్ధం రాజుకుంటోంది. ముఖ్యంగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతినడంతో రెండు దేశాల మధ్య ‘టారిఫ్ వార్’ కొత్త మలుపులు తీసుకుంటోంది. అయితే, ఈ యుద్ధం మనకి అంటే భారత వినియోగదారులకు మంచి అవకాశాలను తెచ్చిపెడుతోంది. ఎలా అంటే? ప్రస్తుతం టీవీలు, ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు రాబోయే రోజుల్లో తగ్గే అవకాశముంది. దీని వెనుక ప్రధాన కారణం చైనా తయారీదారులు భారతీయ కంపెనీలకు అందిస్తున్న 5% డిస్కౌంట్.
125% టారిఫ్ దెబ్బ
అమెరికా ప్రభుత్వం చైనా తయారీ ఉత్పత్తులపై భారీగా 125% మేరకు టారిఫ్ విధించింది. అంటే చైనాలో $100కి తయారయ్యే ఉత్పత్తి, అమెరికాకు చేరేసరికి దాని ధర $225గా మారిపోతుంది. ఫలితంగా అమెరికాలో చైనా వస్తువుల అమ్మకాలు భారీగా తగ్గిపోతున్నాయి.
భారత కంపెనీలకు స్పెషల్ డిస్కౌంట్లు
ఇలాంటి పరిస్థితుల్లో, చైనా తయారీదారులు తమ వ్యాపారాన్ని కొనసాగించేందుకు, ఇతర మార్కెట్లపై దృష్టి పెడుతున్నారు. అందులో భారత్ ప్రధాన టార్గెట్ మార్కెట్‌గా మారింది. ఎందుకంటే భారత్‌లో మధ్య తరగతి జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. అమెరికా మార్కెట్‌లో అమ్మకాలు పడిపోవడంతో, చాలామంది చైనా ఎలక్ట్రానిక్ భాగాల తయారీదారులు తమ ధరలను తగ్గించి, భారత కంపెనీలకు 5% వరకూ డిస్కౌంట్లను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది భారత కంపెనీలకు ఒక గోల్డెన్ ఛాన్స్ లా మారింది.
Read Also: YouTube AI Music Tool: వాయిస్ నీది, బీట్ …
వినియోగదారులకు లాభాలు
ఈ తగ్గింపు కారణంగా, భారత్‌లో గ్యాడ్జెట్‌ల తయారీ ఖర్చులు తగ్గవచ్చు. కంపెనీలు ఈ తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు కూడా పంచితే? టీవీలు, ఫ్రిజ్‌లు, మొబైల్ ఫోన్లు లాంటి డివైస్‌లు తక్కువ ధరలకు లభించే అవకాశం ఉంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ తగ్గింపు వల్ల భారత కంపెనీలు తమ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలను కొంతమేర తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో కొత్త మోడళ్ల లాంచ్‌లు, హోలిడే సేల్‌లు జరుగుతున్న నేపథ్యంలో, ఈ డిస్కౌంట్ ప్రయోజనాన్ని వినియోగదారులకు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు.
తగ్గింపు ధర కూడా
ఈ ప్రయోజనం అత్యంత అవసరమైన సమయానికే వస్తోంది. వేసవి రాబోతుంది. అంటే ఫ్రిజ్‌లకు భారీ డిమాండ్ ఉంటుంది. వేసవి సెలవుల్లో గ్యాడ్జెట్ల మీద ఆఫర్లు, EMI సౌకర్యాలు, క్యాష్‌బ్యాక్‌లు ఇలా అన్నీ వర్షంలా కురుస్తాయి. ఇప్పుడు వాటితో పాటు చైనా ఇచ్చే తగ్గింపు ధర కూడా కలవడంతో, వినియోగదారుల జేబుపై ఒత్తిడి తగ్గే అవకాశముంది.
దిగుమతుల రాజధాని
ఇక్కడ మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. భారత్.. చైనాకి భారీగా ఆధారపడుతున్న దేశం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో 2022లో భారత్ చైనా నుంటి సుమారు $30.63 బిలియన్ల విలువైన విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు దిగుమతి చేసుకుంది. ఇందులో ఎక్కువగా ఉన్న వాటిలో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, మైక్రోచిప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ కంపోనెంట్‌లు ఉన్నాయి. అంటే మన దేశంలో అమ్మబడే టెక్ గాడ్జెట్ల వెనుక 80% వరకు చైనా హస్తం ఉంది. ఇప్పుడు అదే చైనా తయారీదారులు తమ ఉత్పత్తులపై డిస్కౌంట్ ఇస్తే, మన మార్కెట్‌కి మరింత ఊపు రానుంది.
ధరలు తక్కువ అవుతాయా?
పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ 5% తగ్గింపు చిన్నదే అయినప్పటికీ, దీన్ని సరైన వ్యూహంతో వినియోగదారులకు ట్రాన్స్‌ఫర్ చేస్తే, మంచి మార్కెటింగ్ సేల్స్ అవుతాయి. కంపెనీలు తక్కువ ధరలకు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టవచ్చు లేదా అదే ధరకు మరింత ఫీచర్లను ఇచ్చే ప్రయత్నం చేయవచ్చు. మొత్తానికి ఇది కనీసం వచ్చే 2-3 నెలల వరకు ఒక పోజిటివ్ ట్రెండ్‌కి నాంది పలకవచ్చని అంటున్నారు టెక్ వర్గాలు.