భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తు చైనాపైనే ఆధారపడి ఉంది. మనదేశంలోని ప్రముఖ కంపెనీలైన బోష్ ఇండియా, టీవీఎస్ మోటార్, యునో మిండా వంటివన్నీ కూడా చైనా ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. చైనాలో ఉన్న అరుదైన ఎర్త్ మాగ్నెట్ ను మనకు ఎగుమతి చేస్తేనే మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సులువవుతుంది. దాదాపు 21 కంపెనీలు చైనా పంపించే భూమి మాగ్నెట్ల కోసం వేచి ఉన్నాయి.
చైనా ఎర్త్ మాగ్నెట్లకు డిమాండ్
చైనాలో అరుదైన ఎర్త్ మాగ్నెట్లు ఉంటాయి. ప్రపంచ ఉత్పత్తిలో 90 శాతం చైనా నుంచి ఈ ఎర్త్ మాగ్నెట్లు సరఫరా అవుతున్నాయి. భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఎర్త్ మాగ్నెట్ల కోసం చైనా పైనే ఆధారపడుతోంది. ఈ అయస్కాంతాలు లేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్ ఉత్పత్తి ఆగిపోయే అవకాశం ఎక్కువ. ఈ అరుదైన భూ అయస్కాంతాలు ఎలక్ట్రిక్ వాహనాల్లోని మోటార్లు, బ్రేకింగ్ వ్యవస్థ, పవర్ ట్రెయిన్లలో ఉపయోగించే కీలకమైన పదార్థం. కాబట్టి వాటిని చైనా ఎగుమతి చేస్తేనే మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి సులువు అవుతుంది.
చైనా నుండి ఈ అరుదైన ఎర్త్ మాగ్నెట్లను దిగుమతి చేసుకోవడానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాల్సి వస్తుంది అలా దరఖాస్తు చేసి లైసెన్సుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ కంపెనీలో 21 ఉన్నాయి కొన్ని డాక్యుమెంటరీ లోపాల కారణంగా కొన్ని కంపెనీల దరఖాస్తులు కూడా తిరస్కరణకు గురయ్యాయి
చైనా కొత్త నిబంధన
ఈ ఏడాదే ఏప్రిల్ 4న చైనాకు చెందిన మీడియం నుంచి హెవీ అరుదైన ఎర్త్ అయస్కాంతాలను ఎగుమతి చేయడానికి లైసెన్సు పొందడం తప్పనిసరి చేస్తూ ఒక నిబంధనను అమలు చేసింది. ఆ నిబంధన ప్రకారం సైనిక లేదా విధ్వంసక ఆయుధాల తయారీలో ఈ అయస్కాంతాలను ఉపయోగించమని సదరు కంపెనీలు చైనాకు హామీ ఇవ్వాలి. అలా హామీ ఇచ్చాకే చైనా లైసెన్సు ఇస్తుంది. అంటే ఆ ఎర్త్ అయస్కాంతాలను ఎగుమతి చేస్తుంది. ఇప్పటికే అమెరికన్ కంపెనీలకు చైనా లైసెన్సును ఆమోదించింది. కానీ భారతదేశంలో మాత్రం ఇంకా ఆలస్యం చేస్తోంది.
భారత ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో చైనాతో చర్చలు ప్రారంభించింది. కానీ ఒక కొలిక్కి రాలేదు. కొన్ని యూరోపియన్ కంపెనీలకు కూడా అయస్కాంతాలను ఎగుమతి చేయడానికి చైనా అనుమతి ఇచ్చింది. భారతదేశంలో మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ పడలేదు.
పరిస్థితి ఇలాగే జరిగితే కొన్ని రోజులకు ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉత్పత్తి మన దేశంలో నిలిచిపోయే అవకాశం ఉంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు చెబుతున్న ప్రకారం మన దేశంలోని 52 కంపెనీలు చైనా నుండి అరుదైన ఎర్త్ అయస్కాంతాలను దిగుమతి చేసుకుంటున్నాయి.
కొన్ని వారాల్లో తిరిగి లైసెన్సు పొందకపోతే జూలై ప్రారంభం నాటికే వాటి దగ్గర ఉన్న అయస్కాంతాలు పూర్తిగా అయిపోతాయి. అప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉత్పత్తి కూడా నిలిచిపోవచ్చు. ప్రతి ఏటా భారతదేశం 300 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అయస్కాంతాలను దిగుమతి తీసుకుంటుంది. ఈ అయస్కాంతాల సరఫరాను చైనా నిలిపివేస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ తో పాటు హైబ్రిడ్ మోటార్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం అధికంగా ఉంది.