Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతోందా? రేపో మాపో కీలక విషయాలు వెల్లడి కానున్నాయా? ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫోన్‌ని తెలంగాణలో ట్యాపింగ్ చేశారా? ఈ విషయాన్ని అదుపులో ఉన్న నిందితులు అంగీకరించారా? అదే జరిగితే కేసీఆర్‌ని ఏపీ సర్కార్ అరెస్టు చేయడం ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో కేవలం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నేతలు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, సినిమావాళ్ల ఫోన్లు మాత్రమే కాదు.. ఏపీలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
చంద్రబాబు, లోకేష్‌లకు సన్నిహితంగా ఉండే మరో ముగ్గురు ఫోన్లు కూడా ఆ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది గనుక వాస్తవమయితే ఈ కేసు దేశ రాజకీయాల్లో పెను ప్రకంనాలు సృష్టించడం ఖాయం. ఈ మేరకు కొన్ని ఛానెళ్లలో ఈ తరహా వార్తలు జోరందుకున్నాయి.
ఆయా ఫోన్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు ట్యాప్ చేసినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నార్మల్ ఫోన్లు మాత్రమే కాకుండా వాట్సాప్ ఆడియోలను సైతం ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. ట్యాప్ చేసిన ఫోన్ల డేటాను ఓ చిప్‌లో పెట్టి ప్రభుత్వ పెద్దలకు అందజేసేవారట.
ALSO READ: హైదరాబాద్‌లో మల్టీ లెవెల్ పార్కింగ్.. రెండువారాల తర్వాత అందుబాటులోకి
అప్పటి ఏపీ సీఎం జగన్‌కు సన్నిహితంగా ఉండేవారు వచ్చి ఆ చిప్‌ని తీసుకెళ్లినట్టు బయటపడింది. దీని కోసం ఇంట్లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని జగన్ వినేవారని తెలుస్తోంది. ఒకవేళ ఫోన్ ట్యాప్ చేసింది వాస్తవమే అయితే బీఆర్ఎస్ కీలక నేతలకు కష్టాలు మొదలవ్వడం ఖాయమని అంటున్నారు.
పై విషయాలు అధికారుల విచారణలో కొందరు అధికారులు చెప్పినట్టు ఓ వార్త హంగామా చేస్తోంది. కేసీఆర్ చెప్పినట్టుగా తాము చేశామన్నది వాళ్ల మాటగా తెలుస్తోంది. నార్మల్‌గా ఫోన్లు ట్యాపింగ్ చేయడం నేరం. అందులోనూ ఒక రాష్ట్ర ప్రతిపక్షనేత ఫోన్‌ని మరో రాష్ట్ర అధికార పార్టీ ట్యాపింగ్ చేయడం ఇంకా ఇంకా నేరం.
దీనిపై క్లారిటీ వస్తే ట్యాపింగ్ కేసుని సీబీఐ హ్యాండిల్ చేసే అవకాశమున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో అప్పటి తెలంగాణ ప్రభుత్వం పెద్దలను విచారణకు పిలిచే అవకాశముందని అంటున్నారు. అదే గనుక జరిగితే దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించబోతోంది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు.
అంతేకాదు ఆ పార్టీని ప్రజలు శాశ్వతంగా దూరం పెట్టడం ఖాయమనే వాదన సైతం లేకపోలేదు. విచారణలో ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు చెప్పిన విషయాలు బయటకు వస్తే దుమారం రేగడం ఖాయం. రాజ్యాంగాన్ని అతిక్రమించి ఇలాంటి చర్యలకు పాల్పడడం క్షమించరాని నేరం కూడా. మొత్తానికి రేపటి రోజున ఫోన్ ట్యాపింగ్ గురించి ఇంకెన్ని కొత్త కొత్త విషయాలు బయటకు వస్తాయో చూడాలి.