Chatgpt: టెక్నాలజీ ప్రపంచంలో రోజుకో సంచలన మార్పు జరుగుతుంది. ప్రస్తుతం తక్కువ సమయంలోనే ఎక్కువ మార్పులతో, మానవ మేధస్సును మించిపోయే స్థాయిలో అభివృద్ధి చెందుతోన్న AI మోడల్స్ ఇప్పుడు ఎక్కువగా ఆదరణ పొందాయి. అందులో భాగంగా, ఓపెన్‌ఏఐ తమ రెండు సంవత్సరాల వయస్సు కలిగిన GPT-4 మోడల్‌ను ChatGPT ప్లాట్‌ఫామ్‌లో నుంచి తొలగించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 30, 2025 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది.
GPT-4కు గుడ్‌బై…
ఇప్పటివరకు ChatGPTలో ప్రీమియం యూజర్లకు అందుబాటులో ఉన్న GPT-4 మోడల్‌ను ఇకపై GPT-4o మోడల్‌తో పూర్తిగా భర్తీ చేయనున్నట్లు ఓపెన్‌ఏఐ వెల్లడించింది. GPT-4o అంటే ‘GPT-4 Omni’ పేరుతో వస్తుంది. అంటే ఇది ఆల్-రౌండ్ పెర్ఫార్మర్ అని అర్థం. GPT-4o అనేది GPT-4 కంటే ఎక్కువ మెరుగైన రచనా నైపుణ్యం, కోడింగ్ సామర్థ్యం, STEM పరిజ్ఞానం కలిగి ఉంది. ప్రత్యేకంగా, ఇది యూజర్ సూచనలను అనుసరించడంలో మరింత ఈజీగా ప్రతిస్పందిస్తుంది. ఇలా చూస్తే, GPT-4కి సహజ వారసుడిగా GPT-4o నిలుస్తోంది.
GPT-4o కి ఉన్న ప్రత్యేకతలు ఏంటి?
GPT-4o మోడల్‌ను పరిశీలిస్తే ఇది కేవలం ఒక భాషా మోడల్ మాత్రమే కాదు. ఇది ఒక మల్టీ మోడల్ ప్లాట్‌ఫామ్. అంటే, ఇది టెక్స్ట్ మాత్రమే కాకుండా చిత్రాలను కూడా అర్థం చేసుకోగలదు. దృశ్యాలను విశ్లేషించి, వాటిపై వివరణ ఇవ్వగలదు. ఇదే అసలు ఈ మోడల్ ప్రత్యేకత. GPT-4లో కూడా మల్టీ మోడల్ లక్షణాలున్నప్పటికీ, GPT-4oలో ఇవి మరింత సమగ్రంగా, వేగంగా ఉన్నాయి. ఈ కొత్త మోడల్‌తో ChatGPT మరింత యూజర్-ఫ్రెండ్లీగా మారే అవకాశం ఉంది.
Read Also: WhatsApp Update: వాట్సాప్ వాడుతున్నారా? కేంద్రం కీలక …
GPT-4కు ఖర్చు ఎంత?
GPT-4 మోడల్ శిక్షణ కోసం ఓపెన్‌ఏఐ CEO సామ్ ఆల్ట్‌మాన్ తెలిపిన వివరాల ప్రకారం, దాదాపు $100 మిలియన్ల ఖర్చు అయ్యిందట. ఇది ఓపెన్‌ఏఐ ఇప్పటివరకు చేసిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటి. కానీ, ఇప్పుడు టెక్నాలజీ వేగంగా మారుతున్న వేళ, అంత ఖరీదైన మోడల్‌ను మేనేజ్ చేయడం కూడా సవాలని చెప్పవచ్చు.
GPT-4పై న్యాయపరమైన వివాదాలు
GPT-4ని రూపొందించడంలో పబ్లిషింగ్ కంపెనీల డేటాను అనుమతి లేకుండా ఉపయోగించారనే ఆరోపణలు ఓపెన్‌ఏఐపై ఉన్నాయి. న్యూయార్క్ టైమ్స్ సహా పలు పబ్లిషింగ్ కంపెనీలు దీనిపై కేసులు కూడా వేశారు. వాటి ప్రకారం, తమ కంటెంట్‌ను GPT-4 శిక్షణకు ఉపయోగించారట. అది వారు అనుమతించలేదట. అయితే, ఓపెన్‌ఏఐ మాత్రం దీనిపై స్పందిస్తూ “ఫెయిర్ యూజ్” సిద్ధాంతం కింద తమ చర్యలు చట్టబద్ధమైనవేనని చెబుతోంది.
GPT-4oతో యూజర్లకు ఉపయోగాలు ఏంటి?
-వేగవంతమైన ప్రతిస్పందనలు
-మల్టీ మోడల్ సామర్థ్యం వాయిస్, ఇమేజ్, టెక్స్ట్ ఇంటిగ్రేషన్
-అధిక ఖచ్చితత్వంతో సహజమైన సమాధానాలు
-స్టెమ్, కోడింగ్ రంగాల్లో మెరుగైన పనితీరు
-ఇవన్నీ యూజర్ల అనుభవాన్ని మరింత సమృద్ధిగా, చురుకుగా చేస్తాయి.
భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
GPT4 రిటైర్మెంట్ కేవలం ఒక ముగింపు కాదు. ఇది కొత్త మోడల్స్‌కు మార్గం వేసే ప్రారంభం మాత్రమే. టెక్ విశ్లేషకుడు టిబోర్ బ్లాహో చెప్పిన సమాచారం ప్రకారం, ఓపెన్‌ఏఐ త్వరలో GPT-4.1 మోడల్స్ నుంచి GPT-4.1, GPT-4.1 mini, GPT-4.1-nanoను విడుదల చేయనున్నట్లు చెప్పారు. అంతేకాదు, o3 reasoning మోడల్, o4-mini reasoning మోడల్ అనే కొత్త తరహా మోడల్స్‌పై కూడా ఓపెన్‌ఏఐ పనిచేస్తోంది.