Christmas Comedy Movie: తండ్రి కొడుకుల బంధంలో ప్రేమ ఉంటుంది.. చిన్న చిన్న అలకలు ఉంటాయి. అప్పుడప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తండ్రులు పడే తిప్పలు కూడా ఉంటాయి. అలాంటి ఓ చిన్న పాయింట్‌ను తీసుకుని, ఆద్యంతం నవ్వులు పూయించే కామెడీతో పాటు కుటుంబ బంధాల విలువను గుర్తుచేసే విధంగా తెరకెక్కించిన హాలీవుడ్ సినిమా ‘జింగిల్ ఆల్ ది వే’ (Jingle All the Way). క్రిస్మస్‌కు తన కొడుకుకు నచ్చిన బొమ్మ కొనివ్వాలని ప్రయత్నించే ఓ తండ్రి చుట్టూ ఈ కథ సాగుతుంది. మరి తండ్రీకొడుకు సెంటిమెంట్ తో సాగే ఈ సినిమా ఏ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది ? తెలుగులో స్ట్రీమింగ్ అవుతోందా ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
హోవార్డ్ లాంగ్‌స్టన్ బిజీ బిజినెస్‌మ్యాన్. పనిలో పడి కుటుంబానికి సరైన సమయం కేటాయించలేకపోతుంటాడు. దీంతో అతని కొడుకు జేమీ, తండ్రి తనకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడం లేదని బాధపడుతుంటాడు. ఒకసారి కొడుకు కరాటే కార్యక్రమానికి కూడా వెళ్లలేకపోయిన హోవార్డ్, ఈసారి క్రిస్మస్‌కు మాత్రం జేమీ కోరుకున్న బహుమతిని తప్పకుండా కొనిస్తానని మాట ఇస్తాడు. జేమీకి ఆ సమయంలో టీవీలో ప్రసారమయ్యే సూపర్ హీరో టర్బో మ్యాన్ అంటే చాలా ఇష్టం. అందుకే క్రిస్మస్ కు తనకు టర్బో మ్యాన్ యాక్షన్ ఫిగర్ కావాలని అడుగుతాడు. హోవార్డ్ కూడా ఆ బొమ్మ కొనివ్వడానికి ఒప్పుకుంటాడు. కానీ పని ఒత్తిడిలో పడి ఆ విషయాన్ని చివరి నిమిషం వరకు వాయిదా వేస్తాడు.
క్రిస్మస్ ఈవ్ వచ్చేసరికి షాపులకు వెళ్లి చూస్తే, ఆ బొమ్మ ఎక్కడా దొరకదు. అప్పటికే దాని కోసం తల్లిదండ్రులంతా పోటీపడటంతో స్టాక్ మొత్తం అయిపోతుంది. కొడుకుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో హోవార్డ్ నగరమంతా తిరుగుతాడు. ఇదే సమయంలో తన కొడుకు కోసం టర్బో మ్యాన్ బొమ్మను వెతుకుతున్న మైరన్ లారాబీ అనే మరో తండ్రి అతనికి ఎదురవుతాడు. ఇద్దరూ ఒకే బొమ్మ కోసం పోటీపడటంతో పరిస్థితులు మరింత గందరగోళంగా మారతాయి. షాపుల్లో జరిగే హడావుడి, ఇతర కొనుగోలుదారులతో తలెత్తే గొడవలు, పోలీసుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు… ఇలా హోవార్డ్‌కు ఒక్కో అడుగు కొత్త సమస్యను తెచ్చిపెడుతుంది.
బొమ్మను సంపాదించాలనే ఆత్రంలో హోవార్డ్ ఎలాంటి పనులు చేస్తాడు ? మైరన్‌తో అతని పోటీ ఎక్కడికి దారితీస్తుంది ? క్రిస్మస్‌కు కొడుకుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలుగుతాడా ? ఈ గందరగోళం మధ్య హోవార్డ్‌కు కుటుంబం గురించి, తన కొడుకు కోరుకునే అసలు విషయం గురించి ఎలాంటి అవగాహన వస్తుందన్నదే సినిమాలోని ప్రధాన అంశం. బొమ్మ కోసం జరిగే హడావుడి నవ్విస్తూనే, తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించడం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది.
‘జింగిల్ ఆల్ ది వే’ 1996లో విడుదలైన ఇంగ్లీష్ ఫ్యామిలీ కామెడీ మూవీ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ సినిమా ఇంగ్షీషులో అందుబాటులో ఉంది. ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ (Arnold Schwarzenegger), సిన్‌బాద్ (Sinbad), ఫిల్ హార్ట్‌మన్ (Phil Hartman), రీటా విల్సన్ (Rita Wilson) కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం 1996లో విడుదలైంది. దర్శకుడు బ్రయన్ లెవాంట్ (Brian Levant) ఈ సినిమాను ఫ్యామిలీ కామెడీగా తెరకెక్కించారు.
Read Also: విప్లవం వెనుక నవ్వుల రైడ్… ఓటీటీలోకి అడుగుపెట్టిన పీరియాడిక్ మాస్ డ్రామా ‘కామ్రేడ్ కళ్యాణ్’