Google AI Youtube Videos| చాలా దేశాల్లో ఇప్పటికే సెర్చ్ ఇంజిన్ మోనొపొలీ కేసులు ఎదుర్కొంటున్న ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ మరో వివాదంలో చిక్కుకుంది. ఈసారి.. తన కొత్త Veo 3 వీడియో జనరేషన్ AI మోడల్‌ను శిక్షణ ఇవ్వడానికి యూట్యూబ్ క్రియేటర్ల వీడియోలను వారి అనుమతి లేకుండా వాడిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు డేటా వినియోగ పారదర్శకత, AI నీతి, యుట్యూబ్ లో కంటెంట్ యాజమాన్య హక్కులపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయి.
వివాదం ఏంటి?
తాజా నివేదికల ప్రకారం.. గూగుల్ తన Veo 3 AI మోడల్‌ను శిక్షణ ఇవ్వడానికి 20 బిలియన్లకు పైగా యుట్యూబ్ వీడియోలను ఉపయోగించింది. Veo 3 అనేది టెక్స్ట్ ఆదేశాలను రియల్ టైమ్ వీడియోలుగా మార్చగల టెక్నాలజీ. ఈ మోడల్‌ను గూగుల్ I/O 2025 ఈవెంట్‌లో ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది గూగుల్ అత్యంత అడ్వాన్స్ వీడియో జనరేషన్ సాధనంగా చెప్పబడుతోంది.
కానీ, అనేక మంది యూటూబ్ క్రియేటర్లు తమ కంటెంట్‌ను తమకు తెలియకుండానే, అనుమతి లేకుండానే AI శిక్షణ కోసం వినియోగిస్తున్నారని తెలుసుకున్నారు. దీనిని అనధికార డేటా సేకరణగా పలువురు పిలిచారు. దీంతో క్రియేటర్లు, టెక్ కమ్యూనిటీలో ఈ అంశంపై సీరియస్ చర్చలు మొదలయ్యాయి.
గూగుల్ వియో 3 అంటే ఏమిటి?
Veo 3 అనేది గూగుల్ యొక్క అత్యాధునిక AI వీడియో జనరేషన్ మోడల్. ఇది సాధారణ టెక్స్ట్ ఆదేశాలతో హై క్వాలిటీ గల, వాస్తవమైన వీడియోలను రూపొందించగలదు. సినిమా నిర్మాణం, ప్రకటనలు, కంటెంట్ సృష్టి, విద్య వంటి రంగాలలో దీనిని ఉపయోగించవచ్చు. కానీ, ఈ మోడల్ శక్తివంతంగా పనిచేయడానికి చాలా పెద్ద డేటాసెట్ అవసరం. ఈ డేటా ఎక్కువగా YouTube నుంచి తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
గూగుల్ ఏం చెబుతోందంటే..
ఈ ఆరోపణలకు సమాధానంగా, గూగుల్ కొన్ని మీడియా కంపెనీలుచ క్రియేటర్లతో కంటెంట్ లైసెన్సింగ్ ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పింది. “మా ఉత్పత్తి మెరుగుదల, AI యుగంలో కూడా.. ఒప్పందాలను గౌరవిస్తూ జరుగుతాయి. క్రియేటర్లు తమ కంటెంట్ AI శిక్షణకు వాడకూడదని ఎంచుకోవచ్చు,” అని గూగుల్ తెలిపింది.
గూగుల్ మరో విషయం కూడా స్పష్టం చేసింది. యూట్యూబ్ టెర్మ్స్ ఆఫ్ సర్వీస్‌లో.. అప్‌లోడ్ చేసిన కంటెంట్‌ను ప్రొడక్ట్ క్వాలిటీ ఇంప్రొవైజేషన్ (ఉత్పత్తుల మెరుగుదల), కొత్త ఫీచర్ల అభివృద్ధికి ఉపయోగించవచ్చని ఇప్పటికే పేర్కొన్నారు. 2024 సెప్టెంబర్‌లో ఒక బ్లాగ్ పోస్ట్‌లో ఈ విషయాలను క్రియేటర్లకు తెలియజేశామని గూగుల్ చెప్పింది.
యుట్యూబ్ నిబంధనలు, క్రియేటర్ హక్కులు
యుట్యూబ్ ప్రస్తుత టెర్మ్స్ ఆఫ్ సర్వీస్ ప్రకారం.. అప్‌లోడ్ చేసిన కంటెంట్‌ను గూగుల్ ప్రపంచవ్యాప్తంగా తమ ప్రొడక్ట్స్, సేవలను మెరుగుపరచడానికి ఉపయోగించే హక్కు ఉంది. అయితే, క్రియేటర్లు తమ కంటెంట్‌పై కాపీరైట్ హక్కులను కలిగి ఉంటారు. వారు కంటెంట్ ప్రొటెక్షన్ సెట్టింగ్స్‌ను ఉపయోగించి.. అమెజాన్, ఎన్విడియా, ఆపిల్ వంటి కంపెనీల AI శిక్షణకు తమ కంటెంట్‌ను నిరోధించవచ్చు.
Also Read: బ్యాటరీపై జీవితకాల వారంటీ.. ఈవి వాహనాల రంగంలో టాటా గేమ్ ఛేంజింగ్ ప్రకటన
ఈ వివాదం AI టెక్నాలజీలో డేటా వినియోగం గురించి మరోసారి ముఖ్యమైన చర్చను రేకెత్తించింది. క్రియేటర్ల అనుమతి లేకుండా వారి కంటెంట్‌ను వాడటం సరైనదేనా అనే ప్రశ్నలు లేవనెత్తాయి. గూగుల్ తన విధానాలను సమర్థిస్తున్నప్పటికీ, క్రియేటర్ల హక్కులు మరియు పారదర్శకతపై ఈ ఆరోపణలు కొత్త చర్చలకు దారితీశాయి. యుట్యూబ్ క్రియేటర్లు తమ కంటెంట్ రక్షణ కోసం అందుబాటులో ఉన్న సెట్టింగ్స్‌ను ఉపయోగించాలని సూచించబడుతోంది.