Grok AI Chatbot Abusive | ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫీషియల్ కంపెనీ xAI.. బుధవారం తమ గ్రోక్ చాట్‌బాట్ చేసిన ‘అనుచిత పోస్ట్‌లను’ తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ చాట్‌బాట్ అడాల్ఫ్ హిట్లర్‌ను పొగిడే వ్యాఖ్యలు, యూదు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంపై పాశ్చాత్య దేశాల్లో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అలాగే భారతదేశంలో పలువురు ప్రముఖ రాజకీయ నాయకులను ఉద్దేశించి గ్రోక్ అసభ్య సందేశాలు పంపడం ద్వారా వైరల్‌గా మారింది. మస్క్ కు చెందిన xAI సంస్థ అభివృద్ధి చేసిన గ్రోక్ ఎఐ చాట్ బాట్.. గూగుల్ జెమినీ, ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ వంటి చాట్ బాట్లకు ప్రత్యామ్నాయంగా లాంచ్ అయింది.
గత శుక్రవారం గ్రోక్‌లో గణనీయమైన మార్పులు చేసినట్లు మస్క్ తెలిపారు. ఈ మార్పుల వల్ల యూజర్లు దాని పనితీరులో మెరుగుదలను గమనిస్తారని ఆయన చెప్పారు. అయితే దీని తరువాత కూడా గ్రోక్.. అనేక అసభ్య పోస్ట్‌లను షేర్ చేసింది. గ్రోక్ ఒక పోస్ట్ ని షేర్ చేస్తూ.. ‘ట్రోలింగ్ చేస్తూ సంతోషంగా ఉండండి’ అని యూజర్లను ప్రోత్సహించింది.
గ్రోక్ అధికారిక ప్రకటన
బుధవారం.. గ్రోక్ అధికారంగా చేసిన ప్రకటనలో అసభ్య పదజాలంతో చేసిన పోస్ట్ లన్నీ తొలగిస్తున్నట్లు తెలిపింది. యూజర్లు లేదా దాని చేసిన అసభ్య సమాధానాలు అనుచిత కంటెంట్‌ను చురుగ్గా పనిచేస్తున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించింది. కానీ వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు. సమస్యాత్మక కంటెంట్ గురించి తెలిసిన తర్వాత, xAI గ్రోక్ ద్వారా ద్వేషపూరిత పోస్ట్‌లను నిషేధించే చర్యలు తీసుకుంది. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో యూజర్ల సంఖ్య అధికంగా ఉండడం వల్ల సమస్యలను త్వరగా గుర్తించి, మోడల్‌ను మెరుగుపరచడం సాధ్యమైందని తెలిపింది.
టర్కీలో గ్రోక్‌పై నిషేధం
గ్రోక్ అధికారిక ప్రకటన చేసిన రోజే టర్కీ దేశం గ్రోక్ చాట్ బాట్ పై నిషేధం విధించింది. టర్కీలో ఒక కోర్టు బుధవారం గ్రోక్ చాట్‌బాట్‌ను నిషేధించింది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, అతని దివంగత తల్లి, ముస్తఫా కెమాల్ అటాటర్క్ వంటి ప్రముఖులను అవమానించే అసభ్య వ్యాఖ్యలను గ్రోక్ షేర్ చేసిందని ప్రభుత్వ అనుకూల న్యూస్ ఛానల్ ఏ హబర్ నివేదించింది. ఈ నివేదికను ప్రస్తావిస్తూ.. పబ్లిక్ ఆర్డర్ కు ప్రమాదం పొంచి ఉందని.. అంకారా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. అందుకే టర్కీ ఇంటర్నెట్ చట్టం కింద నిషేధం విధించాలని కోరారు. క్రిమినల్ కోర్టు ఈ అభ్యర్థనను ఆమోదించి, టెలికమ్యూనికేషన్ అథారిటీకి నిషేధాన్ని అమలు చేయమని ఆదేశించింది.
Also Read: ఇక అనవసర ఈమెయిల్స్ ఉండవు.. ఒక్క క్లిక్‌తో ఈజీగా చెక్
గ్రోక్ అసభ్యంగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో, సంబంధం లేని ప్రశ్నలకు సమాధానంగా, గ్రోక్ సౌత్ ఆఫ్రికా జాతి రాజకీయాలు, ‘వైట్ జెనోసైడ్’ అనే అంశాలను పదేపదే ప్రస్తావించింది. ఈ ప్రవర్తన ‘అనధికార సవరణ’ వల్ల సంభవించినట్లు xAI వివరించింది.