Face Recognition Technology: మనం రోజుకు వందలసార్లు ఫోన్‌ను చేతిలోకి తీసుకుంటాం. స్క్రీన్ వైపు అలా చూడగానే, కనీసం పాస్‌వర్డ్ టైప్ చేసే పని కూడా లేకుండా చిటికెలో లాక్ ఓపెన్ అయిపోతుంది. పైకి ఇది చాలా సింపుల్ ఫీచర్‌లా కనిపించినా.. ఆ ఒక్క సెకనులో ఫోన్ లోపల పెద్ద తంతంగమే నడుస్తుంది. నిజానికి అన్ని స్మార్ట్‌ఫోన్లలో ఫేస్ అన్‌లాక్ ఒకేలా పనిచేయదు. కొన్ని ఫోన్లు కేవలం మన ఫొటోను చూసి లాక్ తీస్తే, ఖరీదైన ఫోన్లు మాత్రం మన ముఖం ఆకారం, లోతును కూడా పక్కాగా కొలుస్తాయి. మన ఫోన్ ఫేస్ అన్‌లాక్ ఎంత వేగంగా, ఎంత సేఫ్‌గా పనిచేస్తుందనేది అందులో వాడిన టెక్నాలజీపైనే ఆధారపడి ఉంటుంది. అసలు దీని వెనుక ఉన్న ఆ టెక్నాలజీలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఫేస్ అన్‌లాక్‌లో ఫోన్ ముందు కెమెరా మీ ముఖం ఫొటోను తీసుకుంటుంది. సెటప్ సమయంలో సేవ్ చేసిన ముఖ వివరాలతో దాన్ని పోల్చి చూస్తుంది. రెండూ సరిపోతే ఫోన్ తెరుచుకుంటుంది. ఈ పద్ధతి వాడటానికి సులభం, ఖర్చు తక్కువ. అయితే ఇది ముఖం లోతును కొలవదు. కాబట్టి.. కొన్ని ఫోన్లలో ఫొటో లేదా వీడియోతో మోసం చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ పద్ధతి ఉన్న ప్రతి ఫోన్ ఒకే స్థాయి భద్రత ఇస్తుందని అనుకోకూడదు.
చీకట్లో కూడా ముఖాన్ని గుర్తించేందుకు కొన్ని ఫోన్లు ఇన్‌ఫ్రారెడ్ కెమెరాను వాడతాయి. ఇది మన కంటికి కనిపించని ఇన్‌ఫ్రారెడ్ కాంతిని ఉపయోగించి ముఖానికి సంబంధించిన వివరాలను సేకరిస్తుంది. అందువల్ల గది చీకటిగా ఉన్నా ఫోన్ మన ముఖాన్ని గుర్తించగలదు. సాధారణ కెమెరాలా వెలుతురుపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
Also Read: కస్టమర్లతో కనెక్ట్ అవ్వడం ఇక మరింత ఈజీ.. Vi Business నుంచి ఏఐ ఆధారిత వాట్సప్ సేవలు!
మరికొన్ని అడ్వాన్స్‌డ్ ఫోన్లు ముఖంపై వేలాది చిన్న ఇన్‌ఫ్రారెడ్ చుక్కలను ప్రసరిస్తాయి. అవి ముఖంలోని ముక్కు, కళ్ల చుట్టూ, బుగ్గలపై ఎలా పడుతున్నాయో సెన్సర్లు గుర్తిస్తాయి. ఈ సమాచారంతో ముఖం ఆకారం, లోతును చూపించే 3D మ్యాప్ తయారవుతుంది. ఫొటోతో పోలిస్తే ఇది ముఖాన్ని మరింత వివరంగా గుర్తించడంలో సహాయపడుతుంది.
చీకట్లో ముఖాన్ని స్పష్టంగా స్కాన్ చేయడానికి ఫ్లడ్ ఇల్యూమినేటర్ ఉపయోగపడుతుంది. ఇది ముఖంపై ఇన్‌ఫ్రారెడ్ కాంతిని సమంగా ప్రసరిస్తుంది. దీంతో కెమెరా, ఇతర సెన్సర్లు చీకట్లోనూ వివరాలను సేకరించగలవు. వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు గుర్తింపు సరిగా పనిచేయడానికి ఇది తోడ్పడుతుంది.
ఏఐ ఆధారిత న్యూరల్ నెట్‌వర్క్‌లు కెమెరా నుంచి వచ్చిన చిత్రాలు, 3D వివరాలను విశ్లేషించి ముఖానికి సంబంధించిన డిజిటల్ నమూనాను తయారు చేస్తాయి. ఫోన్‌లో సేవ్ చేసిన నమూనాతో పోల్చి సరిపోలికను నిర్ణయిస్తాయి. ఆ తర్వాత సెక్యూర్ హార్డ్‌వేర్‌లో ధృవీకరణ జరుగుతుంది. ఉదా: యాపిల్ ఫోన్లలోని Secure Enclave బయోమెట్రిక్ సమాచారాన్ని సాధారణ యాప్స్‌కు దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇలా పలు టెక్నాలజీలు కలిసి పనిచేయడం వల్ల ఫేస్ అన్‌లాక్ వేగంగా, సురక్షితంగా మారుతుంది. అయితే భద్రత స్థాయి ఫోన్ మోడల్‌ను బట్టి మారుతుందని గుర్తుంచుకోవాలి.
Also Read: మిడ్‌రేంజ్ మార్కెట్లో మోటరోలా సంచలనం.. 53 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్న Edge 70 Neo!