OTT Movie: ప్రశాంతంగా ఉండే ఓ చిన్న పట్టణంలోకి ఒకరోజు వింత ఐస్‌క్రీమ్ వ్యాపారి వస్తాడు. ఊర్లోని పిల్లలందరికీ ఉచితంగా ఐస్‌క్రీమ్‌లు పంచుతాడు. అయితే ఆ ఐస్‌క్రీమ్ తిన్న పిల్లలు కొద్దిసేపటికే వింతగా ప్రవర్తించడం మొదలుపెడతారు. ఆ తర్వాత మనుషులనే చంపే రాక్షసుల్లా మారిపోతారు. దీంతో ఆ ఊరంతా రక్తపాతంతో నిండిపోతుంది. వినడానికి చాలా వింతగా ఉన్న ఈ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన హారర్ కామెడీ స్లాషర్ మూవీ ‘ఐస్ క్రీమ్ మ్యాన్’ (Ice Cream Man). హారర్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎలి రోత్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు Shudderలో స్ట్రీమింగ్ అవుతోంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ మూవీని ఎంజాయ్ చేస్తుండటంతో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. హారర్ కామెడీ స్లాషర్ ఫ్యాన్స్ కు ఇది ఒక మంచి విందు భోజనమే. ఇంతకీ ఆ ఐస్‌క్రీమ్‌లో ఏముంది? పిల్లలు ఎందుకు హంతకులుగా మారారు? ఈ భయంకరమైన కథలో అసలు రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బేలీన్ బే (Bayleen Bay) అనే ప్రశాంతమైన పట్టణానికి ఒకరోజు పాత వ్యాన్‌లో ఓ ఐస్‌క్రీమ్ వ్యాపారి వస్తాడు. అతడి పేరు జోనాథన్ స్మైలీ (అరి మిల్లెన్). ఎప్పుడూ వింతగా నవ్వుతూ కనిపించే అతడు పిల్లలందరికీ ఉచితంగా ఐస్‌క్రీమ్‌లు పంచుతుంటాడు. ఆ ఐస్‌క్రీమ్ తిన్న పిల్లలు కొద్దిసేపటికే మత్తులోకి జారుకుంటారు. రాత్రి కాగానే ఐస్‌క్రీమ్ వ్యాన్ నుంచి వినిపించే సంగీతానికి మేల్కొని, తమ తల్లిదండ్రులపై దాడి చేసి దారుణంగా చంపడం మొదలుపెడతారు. మరుసటి రోజు పాఠశాలలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. పిల్లలు తమ టీచర్లతో పాటు ఊరిలోని పెద్దవాళ్లను కూడా వేటాడుతుంటారు.
అయితే జారెడ్ (చార్లీ జెల్ట్జర్), టామీ (షిలో ఓ’రైలీ), మియా (కియోరి మిర్జా వాల్డ్‌మన్) మాత్రం ఆ ఐస్‌క్రీమ్ తినకపోవడంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. పాల పదార్థాలు పడని జారెడ్‌కు మొదటి నుంచే ఆ వ్యాపారిపై అనుమానం ఉంటుంది. మరోవైపు జారెడ్ అక్క లిజ్జీ (సారా అబాట్) కూడా ఐస్‌క్రీమ్ తిన్నప్పటికీ, దాన్ని బయటకు కక్కేయడంతో ప్రాణాలతో బయటపడుతుంది. ఆమెకు మాజీ ప్రియుడు క్రిస్ (డైలన్ హాకో) తోడవుతాడు. పిల్లల దాడుల నుంచి తప్పించుకుంటూ వీళ్లంతా స్థానిక చర్చిలో ఆశ్రయం పొందుతారు. అక్కడ వారికి ఒక చర్చి పాస్టర్ కనిపిస్తాడు. అతడు చెప్పిన ఊరి పాత చరిత్రతో ఈ భయంకరమైన ఘటనల వెనుక ఉన్న అసలు కారణం బయటపడుతుంది.
ఆ పాస్టర్ చెప్పిన వివరాల ప్రకారం.. ఒకప్పుడు జోనాథన్ స్మైలీ ఒకప్పుడు మంచిమనసున్న వ్యక్తి. పిల్లలను సంతోషపెట్టడమే తన లక్ష్యంగా ఐస్‌క్రీమ్‌లు అమ్మేవాడు. కానీ ఆ ఊరిలో కొందరు చేసిన దారుణాలను కప్పిపుచ్చడానికి అతడిపై తప్పుడు నేరారోపణలు చేసి జైలుకు పంపిస్తారు. అక్కడ అతడికి ఒక నెక్రోమాన్సర్ పరిచయమై, ప్రతీకారం తీర్చుకునేందుకు సాయం చేస్తానని చెబుతాడు. ఇక్కడే ఒక భయంకరమైన ఒప్పందం జరుగుతుంది. మరి ఆ ఒప్పందం ఏమిటి? పిల్లలను మామూలు మనుషులుగా మార్చేందుకు జారెడ్, లిజ్జీ ఏం చేశారు? వారికి సహాయం చేస్తున్న ఫాదర్ నిజంగా ఎవరు? అనేది సినిమాలోని ఉత్కంఠభరితమైన మలుపులు. ముఖ్యంగా చివర్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తుంది.
‘ఐస్ క్రీమ్ మ్యాన్’ (Ice Cream Man) సినిమా 2026 ఆగస్టు 7న అంతర్జాతీయంగా థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత సెప్టెంబర్ 22, 2026 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), యాపిల్ టీవీ (Apple TV) వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అద్దెకు (Rent/Buy) అందుబాటులోకి వచ్చింది. 2026 నవంబర్ 20 నుండి షడ్డర్ (Shudder) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్‌లో మాత్రమే ఉంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు.