Social Media Privacy: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్లు ఉంటున్నాయి. అయితే వీటిని ఉపయోగించే సమయంలో మన వ్యక్తిగత వివరాలు ఎవరెవరు చూస్తున్నారో చాలామంది పట్టించుకోరు. ప్రొఫైల్ ఫొటో, ఫోన్ నంబర్, ఆన్‌లైన్ స్టేటస్, మనం ఎక్కడ ఉన్నామనే సమాచారం ఇతరులకు తెలిసే అవకాశం ఉంటుంది. వీటిని ఉపయోగించి కొందరు మోసాలకు పాల్పడే ప్రమాదం కూడా ఉంది. అయితే కొన్ని చిన్న సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా మన వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు కనిపించకుండా జాగ్రత్త పడొచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ముందుగా వాట్సప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్ ఎంచుకోండి. అక్కడ మీ లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫోటో, అబౌట్ వివరాలను అందరికీ కాకుండా కేవలం మీ కాంటాక్ట్స్‌కు మాత్రమే కనిపించేలా మార్చుకోండి. అలాగే, గుర్తుతెలియని వ్యక్తులు మిమ్మల్ని గ్రూప్స్‌లో యాడ్ చేయకుండా గ్రూప్స్ సెట్టింగ్‌ను కూడా మై కాంటాక్ట్స్‌కి మార్చండి. కాల్స్ మాట్లాడేటప్పుడు మీ ఐపీ అడ్రస్ ఇతరులకు తెలియకుండా అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్‌లో ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఆప్షన్ ఆన్ చేసుకోండి. చివరగా అకౌంట్ సెట్టింగ్స్‌లో ఆరు అంకెల పిన్‌తో టూ-స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకుంటే మీ వాట్సప్ సురక్షితంగా ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ఫోటోలు, రీల్స్ అందరూ చూడకూడదంటే ప్రొఫైల్ మెనూలోకి వెళ్లి అకౌంట్ ప్రైవసీలో ప్రైవేట్ అకౌంట్ ఆన్ చేయండి. దీనివల్ల మీరు యాక్సెప్ట్ చేసిన ఫాలోవర్స్ మాత్రమే మీ పోస్టులు చూడగలరు. మీరు ఆన్‌లైన్‌లో ఉన్న విషయం ఇతరులకు తెలియకుండా ఉండాలంటే మెసేజెస్ అండ్ స్టోరీ రిప్లైస్‌లోకి వెళ్లి యాక్టివిటీ స్టేటస్ ఆఫ్ చేయండి. అంతేకాకుండా.. మీరు వాడే ఇతర యాప్స్ డేటాను మెటా ట్రాక్ చేయకుండా అకౌంట్స్ సెంటర్‌లో ఆఫ్-మెటా యాక్టివిటీని డిస్‌కనెక్ట్ చేసుకోండి.
Also Read: ఇంటర్నెట్ స్పీడ్‌లో ఎయిర్‌టెల్ హవా.. జియో వెనకబడినా, బీఎస్ఎన్ఎల్ మాత్రం గట్టి పోటీ ఇచ్చింది!
ఫేస్‌బుక్ వాడేవారు ముందుగా తమ ప్రొఫైల్‌లోకి వెళ్లి మూడు చుక్కల మీద క్లిక్ చేసి లాక్ ప్రొఫైల్ ఆప్షన్ ఎంచుకోవాలి. దీనివల్ల మీ పోస్టులు కేవలం మీ ఫ్రెండ్స్‌కు మాత్రమే కనిపిస్తాయి. ఆ తర్వాత సెట్టింగ్స్‌లో హౌ పీపుల్ ఫైండ్ అండ్ కాంటాక్ట్ యు ఆప్షన్‌లోకి వెళ్లి మీ ఫ్రెండ్ లిస్ట్, ఈమెయిల్, ఫోన్ నంబర్ వివరాలను ఓన్లీ మీ కింద మార్చుకోండి. చివరగా, గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లలో మీ ప్రొఫైల్ కనిపించకుండా ఉండే ఆప్షన్‌ను ఆఫ్ చేయడం మర్చిపోకండి.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్‌లైన్‌లో మన ప్రైవసీని మనమే కాపాడుకోవాలి. పైన చెప్పిన చిన్న చిన్న సెట్టింగ్స్ మార్చుకోవడానికి కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. కానీ, ఇవి మిమ్మల్ని పెద్ద పెద్ద సైబర్ మోసాల నుంచి కాపాడుతాయి. కాబట్టి.. ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ ఫోన్ తీసి ఈ మార్పులు చేసుకోండి.
Also Read: మడత కనిపిస్తే ఒట్టు.. 200MP గింబల్ కెమెరాతో ఒప్పో తెస్తున్న కొత్త ఫోల్డబుల్ ఫోన్ వివరాలు లీక్!