Jio Family Plan: రీఛార్జ్ ధరలు పెరిగిపోవడంతో కుటుంబంలోని ఒక్కో సభ్యుడు ఒక్కో ప్లాన్ రీఛార్జ్ చేసుకునేందుకు భారీ మెుత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో చాలా మంది అవసరమున్నప్పటికీ పెద్దగా బెనిఫిట్స్ లేని చౌకైన ప్లాన్స్ తో సరిపెట్టుకుంటున్నారు. దీనిని గమనించిన రిలయన్స్ జియో.. తన యూజర్ల కోసం అద్భుతమైన రూ.749 పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకే రీఛార్జ్ బిల్లుపై కుటుంబంలో పలు మెుబైల్ కనెక్షన్లు తీసుకునే వెసులుబాటు కల్పించింది. అంతేకాకుండా ప్రముఖ ఓటీటీలకు ఫ్రీ యాక్సెస్ సైతం అందిస్తోంది.
ఈ నెలవారి పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ తీసుకున్న ప్రైమరీ యూజర్ కు ఏకంగా 100GB డేటా లభించనుంది. ఒకవేళ కేటాయించిన 100 GB డేటా పూర్తయితే ఆ తర్వాత వాడే ప్రతి 1GBకి రూ.10 చొప్పున ఛార్జ్ చేస్తారు. అలాగే దేశంలో ఎక్కడికైనా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్ లో ఒక్కోదానికి రూ.150 అదనంగా చెల్లించి గరిష్టంగా 3 ఫ్యామిలీ సిమ్స్ యాడ్ చేసుకునే వెసులుబాటును జియో కల్పించింది. ఇలా తీసుకునే ప్రతీ అదనపు సిమ్ కు మరో 5GB డేటాను సైతం ఆఫర్ చేస్తోంది.
ఈ రూ.749 ఫ్యామిలీ ప్లాన్ లో ఉచిత ఓటీటీ సేవలను సైతం జియో అందిస్తోంది. ఈ ప్లాన్ తీసుకున్న వారికి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్లను ఆఫర్ చేస్తోంది. వీటి ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్ లు, రియాలిటీ షోలు వీక్షించే వెసులుబాటు లభించనుంది. వీటితో పాటు జియో హాట్ స్టార్, జియో హాలీవుడ్, జియో టీవీ యాక్సెస్ ను కూడా యూజర్లు పొందొచ్చు. జియో టీవీ యాప్ ద్వారా ఎంచెక్కా లైవ్ టీవీ ఛానెల్స్ చూడొచ్చు. అంతేకాకుండా జియో ఏఐ క్లౌడ్ (JioAICloud) ద్వారా 50GB ఫ్రీ స్టోరేజ్ కూడా అందిస్తున్నారు.
ఈ ఫ్యామిలీ ప్లాన్ కింద జియో అపరిమిత 5G డేటాను సైతం అందిస్తోంది. అయితే ఇది పొందాలంటే 5G స్మార్ట్ ఫోన్ తో పాటు.. జియో 5G నెట్ వర్క్ పరిధిలో యూజర్లు తప్పనిసరిగా ఉండాలని జియో వర్గాలు వెల్లడించాయి. కంపెనీ నిర్దేశించిన అర్హత నిబంధనలకు లోబడి ఈ ఉచిత 5జీ సేవలు పనిచేస్తాయని స్పష్టం చేశాయి.