How to identify fake mobile charger:ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ల వాడకం ఎంత పెరిగిందో, మార్కెట్లో నకిలీ మొబైల్ యాక్సెసరీల దందా కూడా అంతే పెరిగింది. ముఖ్యంగా శాంసంగ్, వన్‌ప్లస్, యాపిల్, షియోమీ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్ల పేర్లతో నకిలీ ఛార్జర్లు విచ్చలవిడిగా అమ్ముడవుతున్నాయి. తక్కువ ధరకే వస్తున్నాయి కదా అని వీటిని కొంటే మీ ఖరీదైన ఫోన్ మదర్‌బోర్డ్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే.. ముంబై లేదా ఢిల్లీ గల్లీల నుంచి వచ్చే ఈ నకిలీ ఛార్జర్ల మాయలో పడకుండా.. ఒరిజినల్ ఛార్జర్‌ను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. BIS కేర్ యాప్-బ్రహ్మాస్త్రం:
మనదేశంలో విక్రయించే ప్రతి ఎలక్ట్రానిక్ డివైజ్‌కు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ తప్పనిసరి. మీ ఛార్జర్‌పై ఒక చిన్న ‘R’ అక్షరంతో కూడిన 8 అంకెల రిజిస్ట్రేషన్ నంబర్ (ఉదాహరణ: R-xxxxxxxx) ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘BIS Care’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అందులో ‘Verify R-No’ ఆప్షన్ ద్వారా ఆ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఆ నంబర్ గనుక అసలైనదైతే సదరు బ్రాండ్ పేరు, తయారీ తేదీ, ఫ్యాక్టరీ వివరాలు స్క్రీన్‌పై వస్తాయి. ఫేక్ అయితే నో రికార్డ్స్ అని చూపిస్తుంది.
2. లోగో, స్పెల్లింగ్ తప్పులు:
నకిలీ ఛార్జర్లను తయారుచేసేవాళ్లు బ్రాండ్ లోగోలను కాపీ కొడతారు కానీ..చిన్న చిన్న తప్పులు చేస్తారు. ఒరిజినల్ ఛార్జర్‌పై ఉండే కంపెనీ పేరు చాలా షార్ప్‌గా, స్పష్టంగా ప్రింట్ అయి ఉంటుంది.నకిలీ ఛార్జర్లపై ప్రింటింగ్ కాస్త మసకగా ఉంటుంది. కొన్నిసార్లు పట్టుబడకుండా ఉండటానికి Samsung ని ‘Samsong’ అని, Xiaomi ని ‘Xiomi’ అని స్పెల్లింగ్స్ మారుస్తుంటారు. కొనేటప్పుడు అక్షరాలను జాగ్రత్తగా చదవండి.
3. ఛార్జర్ బరువు, బిల్డ్ క్వాలిటీ :
నకిలీ ఛార్జర్లలో వాడే ప్లాస్టిక్ , లోపలి విడిభాగాలు చాలా చౌక రకానికి చెందినవి. ఒరిజినల్ ఛార్జర్ లోపల హెవీ క్వాలిటీ కండెన్సర్లు, సేఫ్టీ సర్క్యూట్లు ఉంటాయి కాబట్టి అది చేతిలోకి తీసుకుంటే కాస్త బరువుగా అనిపిస్తుంది. నకిలీ ఛార్జర్లు చాలా తేలికగా, ప్లాస్టిక్ బొమ్మల్లా ఉంటాయి. అలాగే, ఛార్జర్ పిన్స్ వంకరగా ఉండటం లేదా యూఎస్‌బీ పోర్ట్ లూజ్‌గా ఉండటం నకిలీ ఛార్జర్ల ప్రధాన లక్షణం.
4. ఛార్జింగ్ స్పీడ్ , హీటింగ్ :
మీరు ఫోన్ ప్లగ్ ఇన్ చేసినప్పుడు ఛార్జర్ బిహేవియర్ గమనించండి. మీది 65W ఫాస్ట్ ఛార్జర్ అయినా కూడా ఫోన్ చాలా స్లోగా ఛార్జ్ అవుతుంటే అది నకిలీది కావచ్చు. అంతేకాదు.. ఒరిజినల్ ఛార్జర్లు ఫోన్‌ను సేఫ్‌గా ఛార్జ్ చేయడానికి హీట్ కంట్రోల్ టెక్నాలజీని వాడుతాయి. కానీ నకిలీ ఛార్జర్లు కేవలం 10-15 నిమిషాలకే ఇస్త్రీ పెట్టెలా వేడెక్కిపోతాయి.
Also Read: వన్ ప్లస్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే కొనకుండా ఉండలేరంతే !
5. ఆన్‌లైన్ ఫేక్ రేటింగ్స్ & ప్రైస్ ట్యాగ్:
రూ.3,000 విలువైన బ్రాండెడ్ ఫాస్ట్ ఛార్జర్ రోడ్డు పక్కన లేదా నమ్మకం లేని వెబ్‌సైట్లలో రూ.400 కే వస్తుందంటే వంద శాతం అది నకిలీదే,
నకిలీ ఛార్జర్ల వల్ల వచ్చే నష్టాలు:
బ్యాటరీ లైఫ్ ఖతం: ఇవి స్థిరమైన వోల్టేజ్‌ను అందించవు. దీని వల్ల ఫోన్ బ్యాటరీ ఉబ్బిపోవడం లేదా బ్యాటరీ హెల్త్ పడిపోవడం జరుగుతుంది.
టచ్ స్క్రీన్ ప్రాబ్లమ్స్: నకిలీ ఛార్జర్‌కు కనెక్ట్ చేసినప్పుడు ఫోన్ డిస్‌ప్లే సరిగ్గా రెస్పాండ్ అవ్వదు. ఘోస్ట్ టచ్ (ఆటోమేటిక్‌గా క్లిక్ అవ్వడం) సమస్యలు వస్తాయి.
స్మార్ట్‌ఫోన్ ఎంత ముఖ్యమో.. దానికి ప్రాణం పోసే ఛార్జర్ కూడా అంతే ముఖ్యం. కొన్ని వందల రూపాయలు ఆదా చేయాలనే ఆశతో నకిలీ ఛార్జర్లు కొని వేల రూపాయల ఫోన్‌ను పాడుచేసుకోకండి. ఎల్లప్పుడూ అఫీషియల్ బ్రాండ్ స్టోర్స్ లేదా నమ్మకమైన ఈ-కామర్స్ సైట్లలో మాత్రమే ఛార్జర్లను కొనండి.