Chanagani Dayakar: మియాపూర్ లోని 550 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను కాపాడి చారిత్రాత్మక విజయం సాధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ భూముల వివాదంపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనకు చెంపపెట్టు లాంటిదని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రూ.50 వేల కోట్ల ఆస్తి రక్షణ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అక్రమార్కుల బారి నుండి రక్షించిందని దయాకర్ పేర్కొన్నారు. మియాపూర్ లోని 50 వేల కోట్ల విలువైన ఆస్తిని కాపాడటంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని అన్నారు. భూకేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులలో అత్యున్నత న్యాయ నిపుణులను రంగంలోకి దించి ఒక్క ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం గట్టిగా పోరాడిందని వివరించారు.
బీఆర్ఎస్ కుట్రలు బట్టబయలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడానికి కుట్రలు చేసిందని దయాకర్ ఆరోపించారు. గోల్డ్‌స్టోన్ ప్రసాద్, పార్థసారథి వంటి వ్యక్తులతో కేసీఆర్ కుమ్మక్కై, ట్రినిటీ డెవలప్‌మెంట్ , కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం పేరుతో హుడా భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మండిపడ్డారు. 23 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ తీర్పు ప్రజా ప్రభుత్వ నిజాయితీకి దక్కిన విజయమని ఆయన అభివర్ణించారు.
కేటీఆర్ కు సవాల్
గచ్చిబౌలిలోని 400 ఎకరాలు, IMG అకాడమీకి సంబంధించిన 850 ఎకరాల భూములను కూడా సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వం కాపాడగలిగిందని దయాకర్ గుర్తుచేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూకబ్జాలకు పాల్పడిన బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు మాట్లాడే హక్కు లేదన్నారు. ట్రినిటీ ఇన్ఫ్రా అక్రమాలపై కేటీఆర్ కు ధైర్యముంటే బహిరంగంగా సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.
Also Read: రూ.84,790 కోట్లతో భాగ్యనగరం రూపురేఖలు చేంజ్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిగ్ ప్లాన్!