ChatGPT AI: ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చేస్తున్న మిరాకిల్స్ ప్రతీ ఒక్కరం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఏఐకి సంబంధించి జరిగిన మరో ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చింది. గ్రానెట్ రాళ్లల్లో కనిపించకుండపోయిన ఇయర్ బడ్ ను.. చాట్ జీపీటీ (ChatGPT) సాయంతో కనుగొన్నట్లు ఓ వ్యక్తి పెట్టిన రెడ్డిట్(Reddit) పోస్ట్.. ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
సదరు యూజర్ ‘బోస్’ (Bose) సంస్థకు చెందిన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ధరించి గ్రానేట్ రాళ్లున్న నేలపై నడుస్తుండగా.. వైట్ ఇయర్‌బడ్ కిందపడిపోయింది. కిందపడిన ప్రాంతం అంతా తెల్లటి చిన్న చిన్న రాళ్లతో నిండి ఉండటంతో అందులో తెల్లటి ఇయర్‌బడ్‌ను వెతకడం అతనికి ఎంతో కష్టంగా మారింది. దాదాపు 10 నిమిషాల పాటు ఓపికగా వెతికినా ఫలితం లేకపోవడంతో ఆశ వదిలేసుకున్నాడు.
సాధారణంగా బ్లూటూత్ ఇయర్‌బడ్స్ పోయినప్పుడు కనెక్ట్ అయిన ఫోన్ లో ఫుల్ వాల్యూమ్ తో పాటలు పెట్టడం ద్వారా దానిని కనుగొంటారు. కానీ, బోస్ ఇయర్‌బడ్స్ చెవిలో పెట్టుకుంటేనే యాక్టివేట్ అయి ఫోన్‌కు సరిగ్గా కనెక్ట్ అవుతాయి. బయట పడిపోయినప్పుడు ఈ ట్రిక్ పనిచేయదు. దీంతో బ్లూటూత్ ఆడియో ఫీచర్ ఉపయోగించి వెతికే అవకాశం కూడా లేకుండా పోయింది.
ఇయర్ బడ్ వెతకడం తన వల్ల కాదని గ్రహించిన యూజర్.. వెంటనే ఆ గ్రావెల్ రాళ్ల ప్రాంతాన్ని తన ఫోన్‌తో ఫోటో తీసి చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేశాడు. రాళ్ల మధ్యలో ఉన్న ఇయర్‌బడ్‌ను గుర్తించడంలో సాయం చేయమని కోరాడు. చాట్‌జీపీటీ ఆ ఇమేజ్‌ను విశ్లేషించి సరిగ్గా ఇయర్‌బడ్ ఎక్కడ ఉందో మార్క్ చేసి పాయింట్ అవుట్ చేసింది. ఫొటో అప్‌లోడ్ చేసిన ఐదు నిమిషాల్లోనే ఇయర్‌బడ్ దొరకడంతో ఆ యూజర్ ఆశ్చర్యపోయాడు. ‘చాట్‌జీపీటీ లేకపోతే నేను దానిని ఎప్పటికీ కనుగొనేవాడిని కాదేమో’ అని రెడ్డిట్ పోస్ట్ లో ఆనందం వ్యక్తం చేశాడు.
Also Read: పాకిస్తాన్ ప్లేయర్ తో SRH బౌలర్ నటరాజన్ దోస్తానా..దేశం నుంచి తరిమేయాలంటూ ట్రోల్స్!
ఈ ఘటనకు సంబంధించిన చాట్ జీపీటీ స్క్రీన్‌షాట్‌లను రెడ్డిట్‌లో షేర్ చేయగా.. అది వైరల్ అయ్యింది. దీనిపై పలువురు యూజర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘చాట్‌జీపీటీకి ఇప్పుడు విజువల్స్ విశ్లేషించే సామర్థ్యం పెరిగింది. ఇది ఫొటోను జూమ్ చేసి అందులోని వస్తువులను విశ్లేషించి దాని సమాచారాన్ని పసిగట్టగల్గుతోంది’ అని రాసుకొచ్చారు. మరొక నెటిజన్ స్పందిస్తూ.. ‘ఏఐ వల్ల ఏ ఉపయోగం లేదని కొట్టిపారేసే వారికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఏఐ వాడకంలో గొప్ప పురోగతి’ అని ప్రశంసించారు.
Also Read: ‘ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాల్సిందే’.. ఏపీ ప్రభుత్వానికి షర్మిల అల్టిమేటం!