Cyber Fraud: సరదాగా సోషల్ మీడియాలో సమయం గడుపుదామనుకున్న ఒక యువకుడికి సైబర్ ముఠా ఊహించని షాక్ ఇచ్చింది. ఫోన్‌లో దానంతట అదే ఒక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవ్వడమే ఆలస్యం.. మరుసటి రోజు చూసేసరికి అతని బ్యాంక్ ఖాతా పూర్తిగా ఖాళీ అయిపోయింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ చోరీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ (Banjara Hills) ఆరెంజ్ ట్రీ (Orange Tree) సమీపంలో నివసించే 27 ఏళ్ల ఒక యువకుడు ఆగస్టు 2న రాత్రి తన మొబైల్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడు. ఆ సమయంలోనే అతని ఫోన్‌లో ఒక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయింది. దాన్ని అతను పెద్దగా పట్టించుకోకుండా యథావిధిగా నిద్రపోయాడు. అయితే మరుసటి రోజు ఉదయం నిద్రలేచి తన బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోగా.. అక్కడ కనిపించిన మెసేజ్‌లు చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.
బాధితుడికి తెలియకుండానే అతని బ్యాంక్ ఖాతా నుంచి విడతల వారీగా మొత్తం రూ. 99,018 నగదు వేరే ఖాతాల్లోకి బదిలీ అయినట్లు మెసేజ్ వచ్చింది. బాధితుడు ఎలాంటి ఓటీపీ (OTP) షేర్ చేయకపోయినా.. ఏ లింక్‌పైనా క్లిక్ చేయకపోయినా.. రాత్రికి రాత్రే నాలుగు లావాదేవీల ద్వారా ఈ సొమ్ము మాయమైంది. ఆటో అప్‌డేట్ పేరిట సైబర్ నేరగాళ్లు అతని ఫోన్‌లోకి ఏదైనా మాల్వేర్ లేదా మాలీషియస్ యాప్‌ను పంపి ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఖాతాలోని డబ్బులు పోవడంతో తీవ్ర ఆందోళన చెందిన బాధితుడు వెంటనే బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇది ఆడ్వాన్స్డ్ సైబర్ మోసం అని భావిస్తున్నారు. డబ్బులు ఏ ఖాతాల్లోకి వెళ్లాయి? సదరు మాల్వేర్ లేదా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలపై సైబర్ క్రైమ్ విభాగం సహాయంతో లోతైన విచారణ జరుపుతున్నారు.
Also Read: మెటాకు భారీ షాక్.. ఏకంగా రూ.4,700 కోట్ల ఫైన్.. ఇంతకీ కేసు ఏంటంటే?
కొత్త తరహా సైబర్ మోసం తెరపైకి రావడంతో సోషల్ మీడియా యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్‌లలో ‘ఆటో అప్‌డేట్’ ఆప్షన్‌ను కేవలం అధికారిక ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్‌లకు మాత్రమే పరిమితం చేసుకోవాలని పేర్కొంటున్నారు. తెలియని సోర్సుల నుంచి వచ్చే ఆటోమ్యాటిక్ డౌన్‌లోడ్‌లను నిలిపివేయాలని హితవు పలుకుతున్నారు. ఏదైనా అనుమానాస్పద మార్పులు ఫోన్‌లో కనిపిస్తే వెంటనే బ్యాంక్ ఖాతాలను లాక్ చేయడం, ఇంటర్నెట్ ను ఆపేయడం వంటివి చేస్తే మంచిదని అధికారులు వివరిస్తున్నారు.
Also Read: ఇదెక్కడి వింత.. సముద్రంలా మారిన బావి.. ఎగసిపడుతున్న అలలు!