common upi payment mistakes: ఈ రోజుల్లో మార్కెట్‌కి వెళ్లాలన్నా, కూరగాయలు కొనాలన్నా చిల్లరతోపని లేకుండా కేవలం ఒకే ఒక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పేమెంట్స్ చేసేస్తున్నాం. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్స్ మన జీవితాలను ఎంతగానో ఈజీ చేశాయి. అయితే ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు కూడా సరి కొత్త దారుల్లో అమాయకుల అకౌంట్లను లూటీ చేస్తున్నారు. యూపీఐ చెల్లింపులు చేసేటప్పుడు.. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు అకౌంట్‌ను పూర్తిగా ఖాళీ చేయవచ్చు. ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం!
1.’క్యూఆర్ కోడ్’ స్కాన్ చేయడం:
చాలామంది షాపుల్లో లేదా ఆన్‌లైన్‌లో అమ్మకాలు జరిపేటప్పుడు అవతలి వ్యక్తులు పంపిన క్యూఆర్ కోడ్‌ను చూసి గుడ్డిగా స్కాన్ చేస్తుంటారు. గుర్తుంచుకోండి, డబ్బులు పొందడానికి యూపీఐలో ఎప్పుడూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు లేదా యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఎవరైనా మీకు డబ్బులు పంపిస్తామని చెప్పి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమంటే.. అది మీ ఖాతా నుంచి డబ్బులు కాజేయడానికి వేసిన ఉచ్చు అని గమనించాలి.
2. ‘కలెక్ట్ రిక్వెస్ట్’ :
ఫోన్‌పే లేదా గూగుల్ పే యాప్‌లలో అప్పుడప్పుడు కొన్ని రిక్వెస్ట్‌లు వస్తుంటాయి. “మీకు రూ. 5000 క్యాష్ బ్యాక్ వచ్చింది, ఈ బటన్ నొక్కండి” అని మెసేజ్‌లు పెట్టి కలెక్ట్ రిక్వెస్ట్ పంపుతారు. ఆ రిక్వెస్ట్‌ను ఓపెన్ చేసి.. మీ యూపీఐ పిన్ ఎంటర్ చేశారో లేదో, మీ అకౌంట్‌లోని అమౌంట్ నేరుగా అవతలి వాడి ఖాతాకి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఎవరికైనా డబ్బులు పంపేటప్పుడే.. పిన్ ఎంటర్ చేయాలి తప్ప, డబ్బులు రిసీవ్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ పిన్ అవసరం ఉండదు.
3. యూపీఐ పిన్ నంబర్:
మీ యూపీఐ పిన్ అనేది మీ బ్యాంకు లాకర్ కీ లాంటిది. దీన్ని మీ కుటుంబ సభ్యులతో కూడా పంచుకోకూడదు. కొంత మంది సైబర్ కేటుగాళ్లు బ్యాంక్ అధికారులమంటూ ఫోన్ చేసి, లాటరీ తగిలిందని లేదా కేవైసీ అప్డేట్ చేయాలని చెప్పి పిన్ నంబర్ అడుగుతుంటారు. ఏ బ్యాంకు ఉద్యోగీ కూడా ఫోన్ చేసి మీ యూపీఐ పిన్ లేదా ఓటీపీ అడగరు. ఒక సారి పిన్ తెలిస్తే.. వాళ్లు మీ అకౌంట్ క్షణాల్లో ఖాళీ చేయగలరు.
4. నకిలీ కస్టమర్ కేర్ నంబర్లను నమ్మడం:
ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ లేదా బ్యాంకింగ్ సర్వీసులకు సంబంధించి ఏవైనా సమస్యలు వస్తే.. నేరుగా గూగుల్‌లో సెర్చ్ చేసి కస్టమర్ కేర్ నంబర్లకు ఫోన్ చేస్తుంటాం. అక్కడే.. మోసగాళ్ళు ఉచ్చు బిగిస్తారు. గూగుల్‌లో కనిపించే అనేక ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లు సైబర్ నేరగాళ్లవే ఉంటాయి. వారు మిమ్మల్ని ఏదైనా ఎనీడెస్క్ లేదా టీమ్ వ్యూవర్ వంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ డౌన్‌లోడ్ చేయమంటారు. ఆ యాప్ ద్వారా మీ ఫోన్ కంట్రోల్ వారి చేతికి వెళ్లిపోతుంది.
Also Read: మరుగుతున్న నీటిలోనూ పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!
సైబర్ మోసాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం చాలా ముఖ్యం. ఏఐ వాయిస్ క్లోనింగ్ ద్వారా మీ బంధువుల గొంతుతో ఫోన్ చేసి డబ్బులు అడిగే మోసాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా అత్యవసరంగా డబ్బులు అడిగితే, ముందుగా నేరుగా వారికి ఫోన్ చేసి నిజంగా ఆ పరిస్థితి ఉందో లేదో నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.
సౌలభ్యం కోసం తెచ్చుకున్న టెక్నాలజీ మన నిర్లక్ష్యం వల్ల శాపంగా మారకూడదు. యూపీఐ చెల్లింపులు చేసే ప్రతిసారీ కాస్త అప్రమత్తంగా ఉండటం, గుర్తు తెలియని లింక్‌లు క్లిక్ చేయకపోవడం, పిన్ నంబర్ సేఫ్ గా ఉంచడం ద్వారా మీ కష్టార్జితాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు. డిజిటల్ ప్రపంచంలో ‘అప్రమత్తతే’ మనకు శ్రీరామరక్ష!