అడకత్తెరలో పోకచెక్కలా మారింది సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి. తను పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో ఎన్నికల వేళ తెలంగాణ జన సమితి, సీపీఐ పార్టీల మద్దతు కోరాడు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని, మిత్రపక్షంగా పోటీ చేయడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని వారికి నచ్చజెప్పాడు.. బుజ్జగించాడు.. ఆయా పార్టీల కార్యాలయాలకు రేవంత్ స్వయంగా వెళ్లి కలిసి చర్చించాడు.
ఈ సందర్భంగా మిత్రపక్షంగా వారున్నందుకు.. ప్రభుత్వం ఏర్పడగానే ఈ రెండు పార్టీలకు ఇచ్చే పదవులపైనా చర్చ జరిగింది. ఓ స్పస్టమైన హామీ కూడా ఇచ్చి ఉన్నాడు రేవంత్. సీపీఐకు ఓ ఎమ్మెల్సీ పదవితో పాటు ఓ ఐదు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని అనుకున్నారు. టీజేఎస్ పార్టీకి కూడా ఓ ఎమ్మెల్సీతో పాటు 5 రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు, 5 జిల్లా స్థాయి పదవులు.. మొత్తం పది నామినేటెడ్ పదవులు ఇచ్చే విధంగా మాట్లాడుకున్నారు.
సీపీఐకి ఇచ్చిన హామీ మేరకు నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేశారు. ఇక్కడ టీజేఎస్ నుంచి కోదండరామ్‌కు ఎమ్మెల్సీ అవకాశం దక్కింది.ఈయనతో పాటు పీఎల్ విశ్వేశ్వరరావును విద్యాకమిషన్ మెంబర్‌గా అవకాశం ఇచ్చారు. ఆ తరువాత ఈ రెండు పార్టీలను పట్టించుకోవడం మానేశారు.
కాంగ్రెస్‌లో పదవుల విషయంలో తీవ్ర పోటీ నెలకొన్నది. సీనియర్లు, జూనియర్లు, కొత్తాపాత ..అంతా పదవులు ఆశిస్తున్నారు. ఓ వైపు మంత్రి వర్గ విస్తరణ రేపు రేపు అంటూ దాట వేస్తూ వస్తోంది అధిష్టానం. మొన్ననే నామినెటెడ్ పోస్టుల పదవీ కాలం ముగిసినా.. ఎవరినీ రెవ్యూవల్ చేయలేదు. దీంతో కొత్త వారికి అవకాశం దక్కుతాయని భావించారు. దీనిపై పది రోజులకొక లీకు ఇస్తున్నారే తప్ప.. పదవులపై గ్రీన్ సిగ్నల్ మాత్రం రావడం లేదు.
పలు దఫాలుగా పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌లు చర్చించారు. ఓ తుది నిర్ణయానికి వచ్చినట్టుగా వార్తలొచ్చాయి. కానీ మళ్లీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది పరిస్థితి. దీంతో రెండు పార్టీల్లో ఈ పదవుల అంశం అంతర్గత ఒత్తిళ్లకు దారి తీస్తున్నది. కాంగ్రెస్ వైఖరి పట్ల కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డైరెక్ట్ అటాక్ చేస్తున్నాడు.
మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తామంటూ సినీ డైలాగులు కొట్టడంతో వార్తల్లో కేంద్రబిందువయ్యాడు. బీఆరెస్ మాతో పెట్టుకున్నది భూస్తాపితమయ్యింది.. ఇక మీరు కూడా అదే తోవలో పోతే మిమ్మల్ని రక్షించేవాడుండడు అని నేరుగా బెదిరింపు కామెంట్లు చేస్తున్నాడు కూనంనేని. మరోవైపు కోదండరామ్‌పై టీజేఎస్ సీనియర్ నేతలు, ఆశావహులు తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు.
నేరుగా సీఎంతో కలిసి తాడోపేడో తేల్చుకుందామంటున్నారు. దీంతో కోదండరామ్ కూడా వారి ఒత్తిడి భరించలేక సీఎం అపాయింట్‌మెంట్ అడిగాడు. అడిగి కూడా పదిహేను రోజులు దాటుతోంది. కానీ ఇంత వరకు అక్కడి నుంచి కబురు రాలేదు. సీఎం ఎప్పుడు రమ్మంటాడా? అని ఇక్కడ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా.. అక్కడ నుంచి స్పందన లేదు. పట్టింపు లేదు.
దీంతో కోదండరామ్‌తో కటీఫ్ చేసుకుందామా? అనే దాకా వచ్చింది అక్కడి పరిస్థితి. ఇవాళ కోదండరామ్ నర్సంపేట వెళ్లాడు. దివంగత నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆయన వెంట ఒక్క నేత కూడా హైదరాబాద్ నుంచి వెళ్లలేదు. దీంతో ఒంటరిగానే ఇక్కడి నుంచి బయలుదేరిన కోదండరామ్..అక్కడ లోకల్ క్యాడర్‌తో కలిసి పెద్ది కుటుంబాన్ని పరామర్శించాడు.