Well Water Waves: గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఉన్న ఓ బావి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 18 అడుగుల లోతు ఉన్న ఈ బావిలోని నీరు గత ఐదు రోజులుగా ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఎడతెరిపి లేకుండా అలల రూపంలో కదులుతూ పైపైకి ఉబికి వస్తున్నాయి. ఈ వింత దృశ్యాన్ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రహదారిపై వెళ్లే ప్రయాణికులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు.
మోర్బీ తాలూకాలోని వీర్‌పర్దా గ్రామానికి చెందిన ప్రాంజీవన్ సదరియా అనే రైతు పొలంలో ఈ బావి ఉంది. ఈ బావిని సుమారు మూడు నెలల క్రితమే తవ్వించినట్లు రైతు తెలిపారు. ఆగస్టు 2వ తేదీన పొలానికి వెళ్లినప్పుడు బావిలోని నీరు ఉప్పొంగి బయటకు రావడం గమనించానని.. అప్పటి నుండి ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. మధ్యలో ఒక్క రోజు మినహా.. గత ఐదు రోజులుగా నీరు ఇలాగే అలల్లా కదులుతూ ఉండటంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
🚨 An 18-foot-deep farm well in Gujarat's Morbi district surprised locals after its water started producing continuous, tide-like waves despite no earthquake. pic.twitter.com/HjRx6er4Ss
— Indian Tech & Infra (@IndianTechGuide) August 7, 2026
బావిలో నీరు వింతగా కదలడంతో.. తొలుత స్థానికులు భూకంపం ఏమైనా రాబోతోందా అని భయపడ్డారు. అయితే జిల్లా యంత్రాంగం, భూగర్భ శాస్త్రవేత్తలు వెంటనే స్పందించి.. ఇది భూకంపం వల్ల జరిగింది కాదని తేల్చిచెప్పారు. గాంధీనగర్‌లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ (ISR) అధికారులను దీని గురించి సంప్రదించగా.. ఆ ప్రాంతంలో ఎలాంటి భూ ప్రకంపనలు రిజిస్టర్ కాలేదని ధ్రువీకరించారు.
అయితే బావిలోని నీరు ఇంత వింతగా ప్రవర్తించడానికి కారణాన్ని జిల్లా జీయాలజిస్ట్ అధికారి జె.ఎస్. వధేర్ వెల్లడించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా భూగర్భ జలాల మట్టం వేగంగా పెరుగుతోందని అన్నారు. ఈ క్రమంలో భూమిలోపల రాతి పొరల్లో చిక్కుకున్న గాలి బయటకు రావడానికి ప్రయత్నించడం వల్లే నీటిలో ఈ తరహా అలలు వస్తున్నాయని వివరించారు. ఇది ఒక సహజమైన భూగర్భ జల ప్రక్రియ అని స్పష్టం చేశారు.
Also Read: డెలివరీ యాప్స్ కొత్త దందా.. మరీ ఇంత మోసమా.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశారు!
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి గుజరాత్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు మోర్బీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ఖారే తెలిపారు. దీనిపై పూర్తి స్థాయి శాస్త్రీయ పరిశోధన చేయడానికి గాంధీనగర్ నుంచి ప్రత్యేక నిపుణుల బృందం త్వరలోనే ఆ ప్రదేశాన్ని సందర్శించనుందని పేర్కొన్నారు. నిపుణుల పరిశోధన ముగిసిన తర్వాతే ఈ ప్రక్రియకు సంబంధించి మరిన్ని స్పష్టమైన వివరాలు వెలువడే అవకాశం ఉంది.
Also Read: అమ్మబాబోయ్.. జియో నుంచి అస్సలు ఊహించని ప్లాన్.. జస్ట్ రూ.175 కే 10 పైగా ఓటీటీలు!