Hyperloop Test Track |వందల కిలోమీటర్ల దూరంగా ఉన్న నగరాల మధ్య ఇకపై ప్రయాణం కేవలం నిమిషాల్లోనే పూర్తికానుంది. అయితే మీరకున్నట్లు విమానం మార్గంలో కాదు రైలు మార్గంలోనే. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా?.. టెక్నాలజీ మహిమ మరి. ఆధునికతను అనుసరిస్తున్న భారతీయ రైల్వే విభాగం.. వందే భారత్ వంటి సెమీ-హైస్పీడ్ రైళ్లను ఇప్పటికే ప్రారంభించింది. త్వరలో బుల్లెట్ రైలు సేవలు కూడా ఆరభం కానున్నాయి.
ఇవేకాదు.. విమాన వేగంతో భూమిపై ప్రయాణించే రైలు కూడా భారతదేశంలో పరుగులు తీయనుంది. ఈ కొత్త రైలు హైపర్ లూప్ టెక్నాలజీ స్పీడుతో పట్టాలపై ఉంటూనే గాల్లో దూసుకోపోతుంది. హైపర్‌లూప్ ప్రాజెక్టు ప్రారంభించి ఈ అత్యంత వేగ ప్రయాణం దిశగా భారతీయ రైల్వే అడుగు పడింది.
ఈ సాంకేతికతను పరీక్షించడానికి భారతదేశంలో మొట్టమొదటి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. 422 మీటర్ల పొడవైన ట్రాక్‌ను రైల్వే శాఖ మద్దతుతో ఐఐటీ మద్రాస్ అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ విజయవంతమైతే.. 350 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 30 నిమిషాలలో చేరుకోవచ్చు. అంటే హైదరాబాద్, వైజాగ్ లాంటి ముఖ్యమైన నగరాల మధ్య ఒక గంట కంటే తక్కువ వ్యవధిలోనే ప్రయాణం పూర్తి చేయోచ్చు. ఈ వివరాలన్నీ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Also Read: ఏసీతో కరెంటు బిల్లు వాచిపోతోందా.. ఈ టిప్స్‌తో సమస్యకు చెక్!
రైల్వే మంత్రి తన ట్వీట్‌లో ఇలా రాశార. “ఈ భవిష్యత్ రవాణా వ్యవస్థ కోసం ప్రభుత్వం, విద్యా సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు రైల్వే శాఖ నిధులు అందించింది. ఐఐటీ మద్రాస్ ప్రాంగణంలో ఈ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. ఇది కొత్త సాంకేతికత అభివృద్ధికి దోహదపడుతుంది. ఇప్పటికే రెండు దశల్లో ఈ ప్రాజెక్ట్ కోసం ఐఐటీ మద్రాస్‌కు 20 లక్షల డాలర్లు మంజూరు చేయబడ్డాయి. మరింత అభివృద్ధి కోసం మరో 10 లక్షల డాలర్లు మంజూరు చేయనున్నారు” అని తెలిపారు.
హైపర్‌లూప్‌ను ఐదవ తరం రవాణా వ్యవస్థగా నిపుణులు పరిగణిస్తున్నారు. ఇది సుదూర ప్రయాణాల కోసం రూపొందించబడిన హై-స్పీడ్ రవాణా వ్యవస్థ. ఈ వ్యవస్థలో.. శూన్యంతో నిండిన ట్యూబ్‌లలో రైలు బోగీలను పోలిన పాడ్‌లు ప్రయాణిస్తాయి. ఇందులో మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికత ఉపయోగించబడుతుంది. దీని వల్ల పాడ్‌లు పట్టాలను తాకకుండా గాలిలో కదులుతూ వేగంగా ముందుకు సాగుతాయి. ఈ ట్యూబ్‌లలో గాలి చాలా తక్కువ స్థాయిలో ఉండడం వల్ల రాపిడి అయ్యే అవకాశం ఉండదు. ఈ రైళ్లు గంటకు 1000-1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు.
హైపర్‌లూప్ టెక్నాలజీతో ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జోరుగా సాగుతున్నాయి. చైనా ఇప్పటికే ఈ ప్రాజెక్టులో చాలా అడ్వాన్స్‌డ్ గా ఉంది. ట్యూబ్‌లను స్వయంగా అభివృద్ధి చేసి ప్రయోగం చివరి దశలో ఉంది. ఈ ప్రాజెక్టు భవిష్యత్ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పును తీసుకువస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రారంభించాలని తొలుత భావించారు. కానీ ఆయన అంతరిక్ష టెక్నాలజీ రంగంలో బిజీగా ఉన్నారు. దీంతో చైనా , భారత్ ఈ రంగంలో పోటీపడుతున్నాయి.