AGR Dues : ఇండియాలో పనిచేస్తున్న ప్రమఖ టెలికాం కంపెనీలకు ఊరట కల్పించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుంది. AGR బకాయిలపై పెద్ద మొత్తం మాఫీ చేయాలని ఆలోచన దిశగా అడుగులు వేస్తుంది.
టెలికం కంపెనీల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ టెలికాం సంస్థలను ఆదుకునేందుకు ఏజీఆర్ (స్థూల సర్దుబాటు ఆదాయం) బకాయిల్లో పెద్ద మొత్తంలో మాఫీ చేసే ప్రయత్నం చేస్తుంది. కేంద్రం తీసుకునే ఈ నిర్ణయంతో టెలికాం కంపెనీలకు దాదాపు రూ.లక్ష కోట్లు ఊరట లభించే ఛాన్స్ కనిపిస్తుంది.
గతంలో టెలికాం సంస్థలు దక్కించుకున్న స్పెక్ట్రమ్‌కు గానూ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించాలన్న నిబంధనను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఈ సంస్థలకు ఊరటనిచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని పలు ఆంగ్ల కథనాలు తెలుపుతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణంయ అమలు చేయగలిగితే వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ వంటి సంస్థలకు పెద్ద మెుత్తంలో మేలు చేకూరే అవకాశం కనిపిస్తోంది.
ఇక ఏజీఆర్ బకాయిలకు సంబంధించిన చర్చలు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బకాయిలపై 2019లో టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఏజీఆర్ విషయంలో ప్రభుత్వ నిర్వచనాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పు ఇవ్వడంతో ఆయా కంపెనీలపై దాదాపు రూ.1.47 మేర లక్షల కోట్ల భారం పడింది. అయితే ఇందులో దాదాపు 75 శాతం మేర వడ్డీ ఉండగా… మిగిలినది పెనాల్టీ, పెనాల్టీ మీద వడ్డీనే కావడం చెప్పుకోదగిన విషయం.
ALSO READ : ఇండియా ఫస్ట్ క్రిప్టో కరెన్సీ.. జియో కాయిన్ కోసం తెలుసా!
ఈ బకాయిల్లో అత్యధికంగా వొడాఫోన్ ఐడియానే చెల్లించాల్సిఉండగా.. ఎయిర్‌టెల్ తో పాటు టాటా టెలీ సర్వీసెస్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ ఏడాది మార్చి నాటికి వొడాఫోన్ ఐడియా బకాయిలు రూ.80వేల కోట్లకు చేరగా.. ఎయిర్‌టెల్ బకాయిలు రూ.42వేల కోట్లకు చేరే ఛాన్స్ ఉందని టెలికాం వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే ఇప్పటికే టెలికాం కంపెనీల ప్రతినిధులతో టెలికాం విభాగం పలుమార్లు సమావేశమైంది. ఆర్థికంగా తాము ఒత్తిడిని ఎదుర్కుంటున్నామని ఆ కంపెనీలు ప్రభుత్వానికి తెలిపాయి. ఈనేపథ్యంలోనే వడ్డీపై 50శాతంతో పాటు పెనాల్టీలు, పెనాల్టీలపై విధించిన వడ్డీని 100 శాతం మేర మాఫీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ఆయా వర్గాలు తెలిపాయి.
అయితే ఈ ప్రతిపాదన అమలయితే దాదాపు రూ.లక్ష కోట్ల మేర టెలికాం కంపెనీలకు ఊరట లభించే ఛాన్స్ ఉంది. ఇందులో భారీ స్థాయిలో అప్పులు ఎదుర్కుంటున్న వొడాఫోన్ ఐడియాకు ఊరట లభించనుంది. ఈ నిర్ణయంతో ఆ కంపెనీ రూ.52 వేల కోట్ల మేర భారాన్ని తగ్గించుకోనుంది. ఎయిర్‌టెల్‌కు రూ.38వేల కోట్లు, టాటా టెలీ సర్వీసెస్‌కు రూ.14వేల కోట్ల మేర మాఫీ జరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంతో టెలికాం రంగంలో అన్ని కంపెనీలకు సమాన అవకాశాలు లభిస్తాయి అని… ఏ ఒక్క కంపెనీ గుత్తాధిపత్యానికి అవకాశం ఉండదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.