CPR to New Born Baby: ఆ చిన్నారి అప్పుడే జన్మించింది. బిడ్డను చూసి తల్లి మురిసింది. ఆ మురిపెంలో ఉండగానే, ఉన్నట్లుండి చిన్నారి అసలు కదల్లేదు. ఇక అంతే ఏమైందో అంటూ ఆ తల్లి రోదించింది. వెంటనే కుటుంబసభ్యులు అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు. ఆ అంబులెన్స్ లో కూడ పాపకు కదలికలు లేవు. అప్పుడే ఓ అద్భుతం జరిగింది. ఆ చిన్నారి కళ్లు తెరిసి చూసింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో శనివారం జరిగింది.
మెదక్ జిల్లాకు చెందిన ఓ గర్భిణీ మహిళ పురిటినొప్పులతో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. కొన్ని గంటల్లోనే పండంటి బిడ్డను జన్మనిచ్చింది. బిడ్డను చూసి, ఆ తల్లి మురిసి పోయింది. అలాగే మహిళ కుటుంబ సభ్యులు కూడ పాపను చూసి ఆనందపడ్డారు. కానీ అంతలోనే పాపలో కదలికల్లేవు. వెంటనే వైద్యులకు సమాచారం అందించారు. వారు పాప ఆరోగ్య స్థితిని పరీక్షించారు. ఊపిరి ఆడని పరిస్థితిలో పాప ఉందని, వెంటనే హైదరాబాద్ కు తీసుకెళ్లాలని సూచించారు.
ఆ తల్లి గుండె బరువెక్కింది. పాపను ఒడిలో ఒడిసిపట్టుకొని అంబులెన్స్ లో ఎక్కారు. పాప కదులుతుందేమోనన్న ఆశ ఆతల్లిలో కనిపిస్తోంది. కానీ కొంచెం దూరం వెళ్లాక అంబులెన్స్ టెక్నీషియన్ రాజు, పాప ఆరోగ్యస్థితిని గమనించారు. అప్పటి వరకు ఉన్న పల్స్ లేకపోవడంతో, వెంటనే సీపీఆర్ చేశారు రాజు. సీపీఆర్ చేస్తున్న తీరును ఆ తల్లి అలాగే చూస్తూ ఉండిపోయింది. సీపీఆర్ పూర్తి చేశారు. ఇక అంతే ఆ పాప ఉన్నట్లుండి ఒక్కసారిగా కళ్లు తెరిచింది. అంతేకాదు పాపలో కదలికలు కూడ కనిపించాయి.
అలాగే అంబులెన్స్ లో నీలోఫర్ వైద్యశాలకు తరలించారు. పాప సురక్షితంగా ఉందని, సకాలంలో టెక్నీషియన్ రాజు సీపీఆర్ చేయడంతో మేలు జరిగిందని వైద్యులు తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన రాజును, పాప తల్లి, కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ సీపీఆర్ విధానంపై అవగాహన కలిగి ఉండాలని రాజు కోరారు. ఏదిఏమైనా ఆ చిన్నారికి ధైర్యంగా సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించిన టెక్నీషియన్ రాజును మనం కూడ అభినందిద్దాం.
అప్పుడే పుట్టిన పాపకు CPR చేసి ప్రాణాలు కాపాడిన అంబులెన్స్ టెక్నీషియన్
మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే జన్మించిన ఓ పాపకు
ఊపిరి ఆడకపోవడంతో అంబులెన్స్ లో హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలింపుమార్గమధ్యలో పాప గుండె ఆగిపోవడంతో CPR చేసి పాప ప్రాణాలు కాపాడిన అంబులెన్స్… pic.twitter.com/ehuhShGWyw
— BIG TV Breaking News (@bigtvtelugu) January 18, 2025