Instagram for TV: మనకు ఏదైనా ఫన్నీ రీల్ లేదా ఆసక్తికరమైన వీడియో నచ్చితే.. వెంటనే పక్కన ఉన్న ఫ్రెండ్స్‌కో, ఫ్యామిలీ మెంబర్స్‌కో ఫోన్ ఇచ్చి చూపిస్తుంటాం. కానీ ఆ చిన్న స్క్రీన్‌పై అందరూ కలిసి చూడటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ మెటా సంస్థ ఒక అదిరిపోయే అప్‌డేట్ తీసుకొస్తోంది. అదే ‘ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ’ (Instagram for TV). ఇటీవల ముంబైలో జరిగిన ‘హౌస్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్’ ఈవెంట్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే మన దేశంలో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఈ ఫీచర్ యాపిల్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్‌లలో సపోర్ట్ చేస్తుంది. యూజర్లు నేరుగా తమ స్మార్ట్ టీవీలో ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని లాగిన్ అవ్వొచ్చు. ఒకే టీవీలో గరిష్టంగా 5 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను యాడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన కంటెంట్‌ను వేర్వేరుగా చూసుకోవచ్చు. ఒకవేళ మీ పర్సనల్ అకౌంట్ టీవీలో లాగిన్ చేయడం ఇష్టం లేకపోతే, కేవలం టీవీలో వీడియోలు చూడటానికి ఒక ప్రత్యేక అకౌంట్‌ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
మొబైల్‌లో మాదిరిగా ప్రతి వీడియోను చేతితో స్వైప్ చేయాల్సిన అవసరం ఇందులో ఉండదు. టీవీలో రీల్స్ ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్‌గా ప్లే అవుతూనే ఉంటాయి. మీ టీవీ రిమోట్ సాయంతో వీడియోలను మార్చుకోవచ్చు. అంతేకాకుండా మీ ఆసక్తికి తగ్గట్టుగా ప్రత్యేక ఛానెల్స్, క్రియేటర్ ప్రొఫైల్స్, స్టోరీలు, ఫోటోలు కూడా చూసే అవకాశం ఉంటుంది. పెద్ద స్క్రీన్‌కు తగ్గట్టుగా హారిజాంటల్ (అడ్డంగా ఉండే) రీల్స్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.
Also Read: కళ్లుచెదిరే ట్రాన్స్‌పరెంట్ లుక్, 48 గంటల నాన్‌స్టాప్ బ్యాటరీతో JBL Tune Buds 3 లాంచ్.. ధర ఎంతంటే?
నేరుగా టీవీలో యాప్ ఓపెన్ చేయకుండా, మీ ఫోన్‌లో చూస్తున్న వీడియోను కూడా టీవీకి కనెక్ట్ చేయవచ్చు. ఇందుకోసం మీ ఫోన్, టీవీ ఒకే వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉండాలి. ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో ఉన్న ‘క్యాస్ట్’ (Cast) ఆప్షన్‌ను ఎంచుకుంటే చాలు, ఆ వీడియో వెంటనే మీ టీవీ స్క్రీన్‌పై ప్లే అవుతుంది.
వినోదంతో పాటు పిల్లల భద్రతపై కూడా మెటా ప్రత్యేక దృష్టి పెట్టింది. టీవీలో ప్లే అయ్యే రీల్స్‌కు 13+ కంటెంట్ రేటింగ్స్ నిబంధనలు వర్తిస్తాయి. అలాగే టీనేజ్ అకౌంట్లకు ఉండే సేఫ్టీ ఫీచర్లు టీవీలోనూ కొనసాగుతాయి. ముఖ్యంగా పిల్లలు టీవీలో ఇన్‌స్టాగ్రామ్ చూసే సమయం కూడా వారి రోజువారీ స్క్రీన్-టైమ్ లిమిట్‌లోనే లెక్కించబడుతుంది. సమయం మించిపోతుంటే ఎప్పటికప్పుడు రిమైండర్లు కూడా వస్తాయి. మొత్తానికి రీల్స్ వినోదాన్ని మరింత సామాజికంగా మార్చేందుకు మెటా వేసిన ఈ అడుగు అందరినీ ఆకట్టుకుంటోంది.