TRAI New Rules 2027: మనం ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు కాల్ చేసినప్పుడు లేదా మెసేజ్ పంపినప్పుడు ఎలాంటి అంతరాయం లేకుండా కనెక్ట్ అవుతుందంటే దానికి కారణం ఇంటర్ కనెక్షన్ వ్యవస్థ. టెలికాం రంగంలో చిన్న కంపెనీలను పెద్ద కంపెనీలు తొక్కేయకుండా, అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మార్కెట్‌లో 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ వాటా ఉన్న దిగ్గజ టెలికాం సంస్థలు తమ ఇంటర్ కనెక్షన్ ఛార్జీల వివరాలను బహిరంగంగా వెల్లడించాల్సిందేనని స్పష్టం చేసింది.
గతంలో 2015లో రిలయన్స్ జియో తమ సేవలను పరీక్షిస్తున్న సమయంలో ఈ ఇంటర్ కనెక్షన్ సమస్య పెద్ద చర్చకు దారితీసింది. అప్పట్లో ఇతర పెద్ద నెట్‌వర్క్‌లు తమకు సరైన యాక్సెస్ ఇవ్వడం లేదని, అందుకే తమ కస్టమర్ల కాల్స్ సరిగ్గా కలవడం లేదని జియో ఆరోపించింది. ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా, చిన్న సంస్థలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు TRAI 2026 సవరణ నిబంధనల కింద ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది.
Also Read: కళ్లుచెదిరే ట్రాన్స్‌పరెంట్ లుక్, 48 గంటల నాన్‌స్టాప్ బ్యాటరీతో JBL Tune Buds 3 లాంచ్.. ధర ఎంతంటే?
ఒక టెలికాం కంపెనీకి మార్కెట్‌లో గణనీయమైన పట్టు (SMP) ఉందో లేదో తెలుసుకోవడానికి ట్రాయ్ నాలుగు ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఆ కంపెనీ ఆదాయం, సబ్‌స్క్రైబర్ల సంఖ్య, వాయిస్ కాల్స్ హ్యాండిల్ చేసే సామర్థ్యం, మొత్తం డేటా ట్రాఫిక్‌లో కనీసం 30 శాతం వాటా ఉంటే ఆ సంస్థను దిగ్గజ కంపెనీగా గుర్తిస్తారు.
ట్రాయ్ గుర్తించిన ఈ దిగ్గజ కంపెనీలు 30 రోజుల్లోగా తమ ఇంటర్ కనెక్షన్ ప్రతిపాదనలను ట్రాయ్ ఆమోదం కోసం పంపాలి. ఆమోదం పొందిన 15 రోజుల్లోగా ఆ వివరాలను, ఛార్జీలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందరికీ కనిపించేలా పెట్టాలి. ట్రాయ్ ఏవైనా మార్పులు సూచిస్తే 15 రోజుల్లోగా సవరించిన వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఈ నిబంధనలు 2027 జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. గడువులోగా వెబ్‌సైట్‌లో వివరాలు పెట్టని కంపెనీలకు గరిష్టంగా రూ.25 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అలాగే సబ్‌స్క్రైబర్లు, ట్రాఫిక్ వివరాలు సమయానికి వెల్లడించకపోతే రూ.15 లక్షల వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. దీనివల్ల టెలికాం రంగంలో పారదర్శకత మరింత పెరగనుంది.
Also Read: వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్.. విదేశాల్లోనూ పాత నంబర్‌తోనే ఇంటర్నెట్ వాడొచ్చు, ఎలాగంటే?