Nara Lokesh: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అకస్మాత్తుగా ఆందోళన ఎందుకు మొదలైంది? 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. ఆ పునర్విభజనలో కొత్తగా ఏర్పడిన ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. అప్పుడు కాంగ్రెస్‌కు ఎలాంటి అభ్యంతరాలూ లేవు.
ఒక్కసారి ఆనాటి వివరాలను పరిశీలిద్దాం. 2008 ఫిబ్రవరి 19న నియోజకవర్గాల పునర్విభజన ఉత్తర్వులు వెలువడ్డాయి. వాటి ఆధారంగానే 2009 ఎన్నికలు జరిగాయి. భద్రాచలం, బొబ్బిలి, హన్మకొండ, మిర్యాలగూడ, పార్వతీపురం, సిద్దిపేట, తెనాలి ఈ ఏడు లోక్‌సభ నియోజకవర్గాలు కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో జహీరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరి, మహబూబాబాద్, అరకు, విజయనగరం నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన ఈ ఏడు స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఒక్క అరకు నియోజకవర్గంలోనే 1.9 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచింది.
అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలోనూ భారీ మార్పులు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 6 నుంచి 14కు పెరిగింది. మరోవైపు విజయనగరం జిల్లాలో మూడు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో రెండేసి అసెంబ్లీ స్థానాలు తగ్గిపోయాయి. వారి హయాంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడిన ఏడు లోక్‌సభ స్థానాలనూ గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశానికి న్యాయం, సమానత్వం గురించి పాఠాలు చెబుతోంది. ఏ రాష్ట్రానికీ ప్రాతినిధ్యం విషయంలో అన్యాయం జరగకుండా, ప్రతి రాష్ట్రం వాటాను కాపాడుతూ, మహిళలకు 33 శాతం సీట్లు కల్పించేలా కొత్త బిల్లును తీసుకొస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి అసలు భయం దేనికి? దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారాలోకేష్ ప్రశ్నిచారు.
Also Read: వాట్సప్ యూజర్లకు CERT-In హై అలర్ట్.. ఈ వెర్షన్లు వాడుతున్నారా? వెంటనే అప్‌డేట్ చేసుకోండిలా!