Raghunandan Rao: సంగారెడ్డి రాజకీయాల్లో ఎంపీ రఘునందన్ రావు, కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి మధ్య మాటల ఈటెలు గట్టిగానే పేలుతున్నాయి. తాజాగా సదాశివపేట పర్యటనలో మీడియా సమావేశంలో మాట్లాడిన రఘునందన్ రావు, జగ్గారెడ్డిపై పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
ముందు సంగారెడ్డిలో గెలువు!
రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు గెలుస్తామని, రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పడం పగటికలగా మిగిలిపోతుందని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. జగ్గారెడ్డికి సవాల్ విసురుతూ.. ‘ముందు సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా గెలవడంపై దృష్టి పెట్టు, ఆ తర్వాత రాహుల్ గాంధీని ప్రధాని చేయడం గురించి మాట్లాడవచ్చు’ అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఉన్న మొత్తం ఎంపీ స్థానాలు, రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియపై కనీస అవగాహన లేకుండా జగ్గారెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు.
తాగునీటి తిప్పలు పట్టవా?
సంగారెడ్డి నియోజకవర్గంపై నిజంగా ప్రేమ ఉంటే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రోడ్లపై బొమ్మలు పెట్టి నిరసనలు తెలిపితే సమస్యలు తీరవని, సదాశివపేటలో తాగునీటి ఎద్దడిపై ముందుగా దృష్టి పెట్టాలన్నారు. వారానికి ఎన్నిసార్లు నీళ్లు ఇస్తున్నారో తెలుసుకుంటే అసలు పరిస్థితి అర్థమవుతుందని, స్థానిక ప్రజలకు కనీసం తాగునీరు అందించలేని కాంగ్రెస్ నేతలు భారీ ఉపన్యాసాలు మాత్రం ఇస్తున్నారని మండిపడ్డారు.
సింగూరు ప్రాజెక్టుపై నిర్లక్ష్యం
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో ముందు తెలుసుకోవాలని స్పష్టం చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి 25 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసి, కనీస మరమ్మతులు కూడా చేపట్టకుండా కాంగ్రెస్ పెద్దలు తీవ్ర నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం సింగూరులో కేవలం 3 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, సంగారెడ్డి, సదాశివపేట సహా చుట్టుపక్కల గ్రామాలకు వెంటనే తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
Also Read: కామారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో పడి తండ్రీకూతురు మృతి