iPhone New Prices: మీరు కొత్త ఐఫోన్ కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే వెంటనే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈసారి మాత్రం కొత్త మోడల్ వచ్చే సరికి ధరలు చూస్తే మీరు తలపట్టుకోవాల్సి వస్తుంది. అమెరికా తీసుకుంటున్న తాజా వాణిజ్య విధానాల వల్ల టెక్నాలజీ ఉత్పత్తుల ధరలు భయంకరంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై భారీ దిగుమతి సుంకాలు విధించడంతో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కార్లు, మౌస్‌లు ఇలా చాలా ఉత్పత్తుల ధరలు ఠారెత్తేలా మారనున్నాయి. ఒకవేళ మీరు ఐఫోన్ కొనాలంటే అప్పుడు రెండు సార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే వీటి తయారీ భాగాలన్నీ చాలా వరకు చైనా నుంచే వస్తాయి. ఆ సుంకం ప్రభావం వినియోగదారుడి ఖర్చుపై పడేలా ఉంటుంది.
టెక్ ప్రపంచానికి షాక్
అమెరికా – చైనా మధ్య వాణిజ్య పోరాటం కొత్త దశలోకి ప్రవేశించింది. తాజాగా ట్రంప్ పరిపాలన తీసుకున్న నిర్ణయం ప్రకారం, చైనా నుంచి దిగుమతయ్యే టెక్ పరికరాలపై కనీసం 125% సుంకం విధించనుంది. ఇది ఏకంగా ధరలు రెట్టింపు కాకపోయినా, వినియోగదారులపై ఒత్తిడిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం ఆపిల్ తన ఉత్పత్తుల తయారీకి అత్యధికంగా చైనాపై ఆధారపడుతోంది. అంచనా ప్రకారం, ఐఫోన్‌ల అసెంబ్లీ 90% వరకు చైనాలోనే జరుగుతోంది.
ఖరీదైనదిగా మారిన బ్రాండ్
వెడ్బుష్ సెక్యూరిటీస్, కెనాలిస్, IDC వంటి సంస్థలు వెల్లడించిన విశ్లేషణ ప్రకారం, ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఐఫోన్ స్టాక్ పూర్తయిన తరువాత, కొత్తగా దిగుమతి అయ్యే ఫోన్లపై ఈ సుంకాలు బలంగా ప్రభావం చూపించనున్నాయి. అంటే, ప్రస్తుతం మీరు ఐఫోన్ కొనకపోతే, కొన్ని వారాల తర్వాత అది మీకు అందని ద్రాక్షగా మారిపోయే ప్రమాదం ఉంది.
ఒక ఐఫోన్ ధర $3,500కి చేరుకుంటుందా?
IDC గణాంకాల ప్రకారం, అమెరికాలోని ఐఫోన్ స్టాక్ 3 వారాల వరకు ఉండొచ్చని అంచనా. కెనాలిస్ మాత్రం 2 నుంచి 3 నెలల స్టాక్ ఉందని చెబుతోంది. అయితే మరో సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ మాత్రం ఇది 4.5 నుంచి 6 వారాల వరకు మాత్రమే ఉండొచ్చని చెబుతోంది. మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఐఫోన్‌ను అమెరికాలో తయారు చేస్తే, దాని ఖర్చు అంతచేత $3,500 (రూ. 3,01,677) వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం $1,000 చెల్లించడమే భారంగా అనిపిస్తుంటే, ఇంత పెద్ద పెరుగుదల వినియోగదారులకు షాక్ తప్పదు.
Read Also: Become Crorepati: రోజుకు రూ.500 సేవింగ్..కోటి రూపాయల …
భారతదేశంలో తయారు చేస్తే
UBS విశ్లేషకులు పేర్కొన్నదాని ప్రకారం, చైనాలో తయారైన iPhone 16 Pro Max (Base Model) ధర 67% పెరిగి $1,999 (రూ. 1,72,300.85) వరకు చేరుకోవచ్చు. అయితే అదే మోడల్‌ను భారతదేశంలో తయారు చేస్తే కేవలం $45 మాత్రమే పెరుగుతుందట. ఈ పోలిక చూస్తే, భవిష్యత్తులో ఐఫోన్ ధరలపై దేశీయ తయారీ ఎంత ప్రభావం చూపించగలదో స్పష్టంగా అర్థమవుతుంది.
భారతదేశానికి అవకాశాల వేట
చైనాపై అమెరికా సుంకాల పెంపు భారతదేశానికి మంచి అవకాశంగా మారుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా, ఆపిల్ తన తయారీ కేంద్రాలను చైనా నుంచి భారత్, వియత్నాంకు తరలిస్తోంది. ఇప్పటికే భారతదేశంలోని ఫాక్స్ కాన్, విస్ట్రాన్ వంటి కంపెనీలు ఐఫోన్‌లను అసెంబుల్ చేస్తున్నాయి. ఇటీవలి సమాచారం ప్రకారం, US-bound ఐఫోన్‌లలో అధిక శాతం ఇప్పుడు భారతదేశం నుంచి రవాణా అవుతున్నాయట. ఇది మానవ వనరులు, పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు అన్నింటికీ ఊపొచ్చే అంశం. ఈ క్రమంలో టెక్ రంగంలో భారత్ పాత్ర మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి.
వినియోగదారులు ఏం చేయాలి?
ఈ నేపథ్యంలో వినియోగదారులు పాత ఐఫోన్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సర్వీస్ ప్రొవైడర్లు ఇప్పుడు పాత ఫోన్లపై డిస్కౌంట్లను, వాయిదా చెల్లింపు స్కీమ్‌లను అందించేందుకు సిద్ధమవుతున్నారు. CIRP డేటా ప్రకారం, అమెరికాలో 55% మంది వినియోగదారులు వాయిదా పద్ధతిలో ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. అంటే ధరలు పెరిగినా, ఆ భారాన్ని సమంగా విభజించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇదంతా తాత్కాలిక ఉపశమనం మాత్రమే.
టెక్ బిజినెస్‌కు అల్లకల్లోలం
ఒకవైపు ధరలు పెరుగుతుండగా, మరొకవైపు డిమాండ్‌పై ప్రభావం తప్పదు. ధర పెరిగినప్పుడు కొనుగోలు నిర్ణయం తీసుకునే వినియోగదారుల సంఖ్య తగ్గుతుంది. ఇది కంపెనీల రెవెన్యూలపై ప్రభావం చూపుతుంది. ఇక ఆపిల్ వంటి కంపెనీలు తమ సరఫరా గొలుసు ప్రణాళికలను పూర్తిగా పునరాలోచించాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. ఐఫోన్ ఉత్పత్తిని అమెరికాలో తయారు చేయాలని ట్రంప్ కోరుతున్నా, అది ఆపిల్‌కి ఆచరణీయమైన మార్గం కాదని నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే అక్కడి వేతన వ్యయం, మౌలిక సదుపాయాల ధరలు అత్యధికం.